ఏమిటీ..? అసలేం జరుగుతోంది..? తన సొంత ఎమ్మెల్యేలు, మంత్రులకే సరిగ్గా టైం ఇవ్వడు కేసీయార్, విపక్ష నేతల్ని పురుగుల్లాగా చూస్తాడు, సన్నాసులు పదం దగ్గర్నుంచి నానా పరుష పదాలూ వాడేసి వెక్కిరిస్తాడు… తనంతట తనే పిలిచి మాట్లాడుతున్నాడు..? ఏమైంది తనకు..? ప్రగతి భవన్‌లోకి చాలామందికి ఎంట్రీ లభిస్తోంది, ఏమిటీ వైపరీత్యం..? మరియమ్మ కుటుంబానికి ఇతోధిక సాయం అంటున్నాడు, దళితులపై చేయిపడితే తాటతీస్తా అంటున్నాడు… క్యాహోరహా ఆజ్‌కల్..? అఖిలపక్ష భేటీ అంటున్నాడు, దళిత సంక్షేమ పథకాల సమీక్ష, అందరి అభిప్రాయాలూ తీసుకుంటాను అంటున్నాడు… హేమిటిది..? కేసీయార్ మరో కేసీయార్‌లాగా మారిపోతున్నాడా..? (దళితుల మీద గాకుండా వేరేవాళ్ల మీద చేయిపడితే పర్లేదా..? తను ఇతరుల అభిప్రాయాలు కూడా తీసుకుంటాడా..? ఈ ప్రశ్నల జోలికి వెళ్లకండి… సన్నాసి ప్రశ్నలూ మీరూనూ… )
అవునూ, కాంగ్రెస్ నేతలు వెళ్లారు కదా సీఎం దగ్గరకు..? ఎన్నడూ లేనిది ఆప్యాయతలు ఒలకబోసుకున్నారు కదా..! ఏం మాట్లాడుకుని ఉంటారు..? కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల గురించి శ్రీధరబాబు… దళితుల మీద పోలీసుల అఘాయిత్యాల గురించి భట్టి విక్రమార్క, మెడికల్ కాలేజీలు, సర్కారు గొప్ప విజయాల గురించి జగ్గారెడ్డి… ఇలా చర్చించి ఉంటారా..? ‘‘అనవసరంగా కాంగ్రెస్ పార్టీని తొక్కేశానబ్బా, నడిమిట్ల ఈ బొందుగాళ్లు వచ్చి విస్తరిస్తున్నారు, తల్నొప్పి క్రియేట్ చేస్తున్నారు, గట్టిగా ఏమనలేం, మోడీకి గుస్సా వచ్చే ప్రమాదం ఉంది… ఈ ఈటల గనుక గెలిస్తే ఇజ్జత్ పోతది… నాకే కాదు, మీకూ బేఇజ్జతే… కొట్లాడుకుంటే మనం కొట్లాడుకోవాలె గానీ ఈ బీజేపోళ్లు ఏంది ఎగురుతున్నరు… హుజూరాబాద్‌ల జెర చూడున్రి… సీపీఎం, సీపీఐ వాళ్లతో కూడా మాట్లాడుత…’’ అని ఉంటడా..? ఈటల నిష్క్రమణ చాలా మార్పులు తీసుకొస్తోందా..? అబ్బే, అలాంటి రాజకీయాలు ఎవరైనా ఇంత బహిరంగంగా చర్చిస్తారా..? తెర వెనుక నడుస్తుంటయ్ గానీ గిట్ల కనబడేటట్లు చేస్తరా..? వోకే, మరి ఏం మాట్లాడి ఉంటారు..?
Ads
హమ్మయ్య, సాక్షి చదివాక క్లారిటీ వచ్చింది కాస్త..! సాక్షి కదా, రాజకీయ అంశాలు మస్తు రాస్తరు… చాలా రోజుల తరువాత కలిసిన దోస్తులు కదా… శరద్ పవార్‌ను ముందుబెట్టి ప్రశాంత్ కిషోర్ ఆడుతున్న ఆటలు, మమత బెనర్జీకి పెరుగుతున్న పాపులారిటీ, మోడీ ప్రతిష్టకు పడుతున్న బీటల గురించే కాదు… అమెరికా కొత్త అధ్యక్షుడు బైడన్ పాలసీలు, బ్రిటన్ మీద కస్సుమంటున్న రష్యా ధోరణులు, కరోనా పుట్టుక మీద సాగుతున్న పరిశోధనల దాకా చాలా విషయాలే మాట్లాడుకుని ఉంటారు… ‘‘చైనా, భారత దేశాల మధ్య విధానాల అమలులో ఉన్న తేడాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది’’ అని సాక్షి రాసింది… నిజానికి ఇలాంటి అద్భుతమైన ఇన్‌సైడ్ స్టోరీలు ఆంధ్రజ్యోతి రాస్తుంది… ఎందుకో ఈమధ్య ఆ స్పిరిట్ కనిపించడం లేదు… మొన్న జగన్, మోడీ మధ్య ఏం చర్చ జరిగిందో కూడా రాయలేకపోయింది… ఇప్పుడు ఆ స్పిరిట్‌ను సాక్షి అంది పుచ్చుకున్నట్టుంది…
అవునూ, ఈ హఠాత్ దళిత సంక్షేమ ధ్యాసకు హుజూరాబాద్ ఉపఎన్నికకూ ఏమైనా లింక్ ఉండే అవకాశం ఉందంటారా..? ఈటల కచ్చితంగా బీసీ కార్డు ప్రచారానికి వాడుకుంటాడు… ఇక్కడ బీసీలు 64%, ఓసీలు 8%, ఎస్సీలు 20%, ఎస్టీలు 2% ,ఇతరులు 6%… వీళ్లలో రెడ్లు 21 వేలు, కాపు 30 వేలు, పద్మశాలి 25 వేలు, గౌడ్స్ 25 వేలు, గొల్లకుర్మ 25 వేలు, ముదిరాజ్ 25 వేలు, ఎస్సీలు 45-50 వేలు, ఎస్టీలు ఐదారువేలు, ముస్లిమ్స్ 10 వేలు అని ఓ రఫ్ అంచనా… కరీంనగర్ జిల్లాలో కాపులు కొంతకాలంగా బీజేపీ దిక్కు పోలరైజ్ అవుతున్నారు… మిగతా బీసీలు ఈటల దిక్కు చూస్తే మరి టీఆర్ఎస్ సంగతి..? యాభై వేల వోట్లున్న ఎస్సీలే దిక్కా..? ఏమోలెండి… ఇవన్నీ రాజకీయ వ్యూహాలు… ఎవరేం తక్కువ..? ఎవరెన్ని సంక్షేమ గీతాలాపనలు ప్రారంభించినా, దాని వెనుక ఏదో రాజకీయ లబ్ధి ఉంటుంది, ఉండాలి, పొలిటికల్ లెక్కల్లో ఎక్కాలంటే అవే…!!
Share this Article