.
గంటకు పైగా రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం, తన స్వార్థం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా చేశారు. గతంలో ఎవరిని రుషికొండ దరిదాపుల్లోకి రానివ్వలేదు. గుండె చెదిరిపోయేలా నిజాలు బయటకు వస్తున్నాయి… – సీఎం చంద్రబాబు……. ఇదీ తాజా వార్త
ఆయన మాటలు… ‘‘ప్రజాస్వామ్యంలో, కలలో కూడా ఊహించలేం ఇలాంటి కట్టడాల్ని… జగన్ స్వార్థం, విలాసం కోసం ఈ ప్యాలెస్… అన్నింటికీ తెగిస్తే తప్ప ఇలాంటి సాహసం సాధ్యం కాదు… ప్రకృతి ధ్వంసం ఇది… చాలా రాజుల ప్యాలెసులు చూశాం గానీ దీన్ని చూస్తే దిమ్మతిరిగిపోతోంది… ముందు టూరిజం అన్నారు, తరువాత రాష్ట్రపతికి విడిది అన్నారు… 36 లక్షల టబ్బు, 13,540 అడుగులు… ఇలాంటి కారిడార్ వైట్‌హౌజులో కూడా లేదు… 200 టన్నుల ఏసీ… ప్యాలెస్ చూడటానికి ప్రజలకు అనుమతినిస్తాం..’’
Ads
తప్పు లేదు… అత్యంత వివాదాస్పదమైన ఓ మహారాజా ప్యాలెస్ నిర్మాణ ఉద్దేశాలు, వ్యయం, సీఎంగా ఆ నిర్మాణాల స్వయం పరిశీలన తప్పులేదు… ఐతే మరీ అనాలోచితంగా తిరుమల లడ్డూ మీద చేసినట్టుగానే జస్ట్, అలా కామెంట్స్ పాస్ చేయకండి శ్రీమాన్ చంద్రబాబు గారూ…
ఎస్, ఆ మహా వైభోగ, మహా విలాసవంత భవనాల అసలు ఖర్చు ఎంతో, గత ప్రభుత్వం ఏ పద్దులో, ఎందుకోసం ఆ కర్చు చేసిందో… దాని నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో మొత్తం సవివరంగా ఓ శ్వేతపత్రం కాదు గానీ ఓ యెల్లో పత్రం సమర్పించండి ప్రజలకు…
వాటి సద్వినియోగం ఏమిటో, ఎలాగో అభిప్రాయాలు తీసుకొండి… ఇప్పటికే చాలామంది రాసేస్తున్నారు… అసలే దివాలా రాష్ట్రం దాన్ని భరించలేదు, ఏదైనా మంచి హాస్పిటాలిటీ సంస్థకు లీజుకు ఇవ్వండి అని…! మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే, ఆ లీజును రద్దు చేయకూడదని లేదు కదా… ఖచ్చితంగా చేస్తాడు…
జుబ్లీ హిల్స్‌లో ఓ సాదాసీదా ఫ్లాటులో బతుకు గడిపే ఒక చంద్రబాబుకు ఆ రుషికొండ ప్యాలెస్ వైభోగం అసాధారణం అనిపించడమే అనూహ్యం… లోకేష్ బాబు రెడ్‌బుక్‌లో ఈ భవనం సంగతీ, టార్గెట్ రాసి ఉన్నాయో లేదో కూడా తెలియదు… కానీ అఫ్‌కోర్స్, అది జగన్ సీఎం హోదాలో నివాసం ఉండటానికే తప్ప… అది జగన్ సొంత ఆస్తి కాదు… జస్ట్, ఏపీ సీఎం రెసిడెన్స్…
తెలంగాణలో ప్రగతిభవన్‌ను కూడా కోట్లకుకోట్లు ఖర్చుపెట్టి కేసీయార్ ఉద్దరించాడు… ఐనా సరే, అధికారం పోయిన వేళ అర్జెంటుగా ఖాళీ చేసి, సొంత కారులో ఫామ్ హౌజు కుటీరానికి వెళ్లిపోయాడు… మరి జగన్ ఎందుకు అంత ఖర్చుపెట్టాడు అంటారా..? ఇప్పట్లో తనను ఎవరూ ఏపీ సీఎం కుర్చీ నుంచి దించలేరనే తప్పు భ్రమ…
మరిప్పుడేం చేయాలి..? చంద్రబాబు దానిపై ఏ రెడ్‌బుక్ చర్యలూ తీసుకోనక్కర్లేదు… సింపుల్‌గా అక్కడ ఏడాదికి ఒకసారో, రెండుసార్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టండి… మూడు రాజధానులు అనే జగన్ సూత్రాన్ని యథాతథంగా ఆమోదించాలని కాదు… అలాగని వైజాగ్ ప్రాధాన్యాన్ని కూడా తేలికగా తీసిపారేయవద్దు… ఈ చర్య వల్ల తమరి అమరావతి భావి వైభవానికి వచ్చే ఢోకా కూడా ఏమీ ఉండదు…
పలు రాష్ట్రాల్లో రెండేసి కేంద్రాల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టే పద్ధతి ఉంది… ఎక్కడిదాకో ఎందుకు..? పొరుగున ఉన్న కర్ణాటకలో బెళగావి సువర్ణ విధానసౌధ కథ తెలుసుకుంటే సరి… ఇక్కడ కర్ణాటక శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి… ఇదుగో ఆ భవనం ఫోటో…
Share this Article