ఓ సోషల్ పోస్టును ప్రతిపక్ష శిబిరం సోషల్ మీడియాలో పుష్ చేస్తోంది… సదరు సోషల్ పోస్టు ఏమిటీ అంటే..? ‘‘సచివాలయం దగ్గర పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహం… అడిగి అడిగి అలిసిపోయాను’’ అని ఫిబ్రవరిలో ‘తెలుగు తీపి’ పేరిట ఎవరో కేకేమోహన్ పేరిట పోస్టు… మళ్లీ తాజాగా ‘‘ముఖ్యమంత్రి @revanth_anumula గారూ దయచేసి సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని తిరిగి వెంటనే ప్రతిష్ఠించండి’ అని మరో పోస్టు…
నిష్పాక్షిక న్యాయం చేయడమే కాదు, నిష్పాక్షికంగా ఉన్నట్టు కనిపించాలి అంటారు న్యాయమూర్తులు… సేమ్, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రయాసపడటమే కాదు, వాటికోసమే కట్టుబడినట్టు కనిపించాలి… జనంలోకి సంకేతాలు కూడా అలాగే వెళ్లాలి… లేకపోతే ఓ రకమైన అన్‌రెస్ట్ తెలంగాణ సమాజంలో మొదలవుతుంది… దీనికి కారణం కూడా ఉంది…
Ads
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలిచింది… గెలిచిన చంద్రబాబు రేవంత్‌రెడ్డికి ఒకప్పుడు బాస్… ఇప్పుడూ తనంటే గౌరవమే… ఇక తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, రావల్సిందే అనే వ్యాఖ్యలు మొదలయ్యాయి, చంద్రబాబు నుంచి… తనకు హైదరాబాదులో ఘనమైన స్వాగతాలు, పార్టీ పునరుద్దరణకు ప్రయత్నాలు వేగంగా సాగిపోతున్నాయి… దీనికితోడు విభజన సమస్యల పేరుతో చంద్రబాబు- రేవంత్ రెడ్డి భేటీ…
కేసీయార్ ధాటికి తెలంగాణ వదిలేసి వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ దూకుడుగా తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాడు… అదీ తెలంగాణ సమాజంలో కలవరం, కలకలం… తను బయటికి కొబ్బరిచిప్పల సిద్ధాంతాలు, రెండు కళ్ల సిద్ధాంతాలు ఎన్ని వల్లెవేసినా తెలంగాణ సమాజం తనను తెలంగాణ వ్యతిరేకిగానే పరిగణిస్తుంది… దీనికితోడు చంద్రబాబుతో జతకట్టిన పవన్ కల్యాణ్ తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులపాటు నిద్రాహారాలు లేకుండా బాధపడ్డానని తనే చెప్పాడు…
సరే, వాళ్ల ఆశలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే… రేవంత్ రెడ్డి ఆ కూటమి ప్రయత్నాలకు ఏదో ఈల్డ్ అవుతున్నట్టుగా కనిపించకూడదు… తను పక్కా తెలంగాణ ప్రయోజనాల రక్షకుడు అనే ఫోకస్ జనానికి కనిపించాలి… అది తనకూ వ్యక్తిగతంగా, పార్టీపరంగా అవసరం… పైగా చంద్రబాబుది ఎన్డీయే కూటమి, రేవంత్‌రెడ్డిది ఇండి కూటమి… సో, రాజకీయంగానూ చంద్రబాబు అండ్ కంపెనీతో రాసుకుపూసుకు తిరగడం రేవంత్‌రెడ్డి భావి ప్రయోజనాలకూ విరుద్ధమే అవుతుంది…
ఒకవైపు ఈ చర్చ ఇలా జరుగుతూ ఉండగానే… కమ్మ సంఘం మీటింగుకు వెళ్లి కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అంటూ ఆ కులం మీద ఏవేవో ప్రశంసలు కురిపించాడు… సరే, తన రాజకీయ అవసరాల కోసం కమ్మలతో దోస్తీ, వారి ఆదరణ పొందడం రేవంత్‌రెడ్డికి అవసరమే కావచ్చుగాక… పైగా ఓ సంఘం సమావేశానికి అతిథిగా వెళ్లినప్పుడు నాలుగు మంచి మాటలు చెబితే తప్పేమిటనే భావన కూడా కరెక్టే కావచ్చుగాక… కానీ అసలే తెలంగాణ సమాజంలో చంద్రబాబు అండ్ కో దూకుడుగా తెలంగాణ వైపు కదులుతున్న నేపథ్యంలో ప్రతిదీ తెలంగాణ సమాజం అనుమానపు చూపులతోనే గమనిస్తూ ఉంటుంది…
చంద్రబాబు ఆంధ్రా ముఖ్యమంత్రి, అంతే… తెలంగాణకు తనేమీ కాడు… అవసరమైతే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ ఏపీ బాగు కోసం ప్రయత్నిస్తాడు… ఆ రాష్ట్రం కోణంలో గుడ్… కానీ అలాంటివి ఉపేక్షిస్తే రేవంత్‌రెడ్డికి రాజకీయంగా నష్టం… తెలంగాణకూ నష్టం… ఏమో, రేప్పొద్దున ఏ పరిస్థితి ఎలా వస్తుందో, ప్రస్తుతం బీజేపీ కూటమికి ఆక్సిజెన్‌లాగా ఉన్న తన పాత బాస్ చంద్రబాబుతో బాగుంటే నాకే మంచిది అనే రేవంత్‌రెడ్డి భావించే పక్షంలో అది కూడా కొన్నిసార్లు వికటించవచ్చు కూడా..! ఎందుకంటే… చంద్రబాబుకు రేవంత్‌రెడ్డిని ప్రేమించాల్సిన అవసరం లేదు కాబట్టి..!!
పైన పోస్టు విషయానికి వస్తే… సచివాలయం దగ్గర తెలుగు తల్లి విగ్రహం ఎందుకు పెట్టాలి… పెడితే తెలంగాణ తల్లి విగ్రహం పెడతారు… పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక కేసీయార్ బాపతు తెలంగాణ తల్లి రూపాన్ని కూడా మారుస్తున్నారు… అదుగో ఆ విగ్రహం పెడతారు… అలాగే తమిళనాడు నుంచి ఆంధ్రా రాష్ట్ర విభజన కోసం బలిదానం చేసిన పొట్టి శ్రీరాములుపై కూడా తెలంగాణ సమాజానికి ప్రేమ ఉండదు… ఆ రెండు విగ్రహాలూ తెలంగాణ కోణంలో అనవసరంగానే కనిపిస్తాయి… సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పం…
నిజంగానే రేవంత్ రెడ్డి గనుక ఆ విగ్రహాల పునఃప్రతిష్ఠ విషయంలో సానుకూలంగా ఏమాత్రం కనిపించినా, (వేరే ప్లేసుల్లో అయినా సరే) అది తనకే నష్టకారకం అవుతుంది… యాంటీ సెంటిమెంట్ అవుతుంది… రేవంత్ రెడ్డి అనాలోచితంగా అడుగులు వేస్తాడని కాదు, తన పొలిటికల్ కెరీర్ తనకు ముఖ్యం… అందుకే, తెలంగాణ సెంటిమెంట్ల విషయంలో రేవంత్ రెడ్డి స్థిరంగా నిలబడటమే కాదు, నిలబడుతున్నట్టుగా జనానికి కనిపించాలి… అవసరమైతే పాత ప్రేమల్ని, పాత బంధాల్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలి… అది తనకూ మేలు, తెలంగాణకూ మేలు… ఇదొక సూచన..!!
Share this Article