2021 అక్టోబర్ రెండో వారంలో ఒక ఉదయం 7 గంటలప్పుడు.. ఒక యువ కాంగ్రెస్ నేతకు బాలినేని నుంచి 12 ఫోన్ కాల్స్ … మన పిల్లోడివి నువ్వు టీడీపీలోకి పోవద్దంటూ బుజ్జగింపుతో మొదలు పెట్టి బెదిరించే వరకు.. నేను ఫోన్ చేస్తే చాలు అతను ఆగిపోతాడు అనుకున్న బాలినేనికి అతను కూల్ గా ఇచ్చిన సమాధానం చిర్రెత్తించింది.. కోపంతో ఫోన్ కట్ చేయటం మళ్ళీ 5 నిముషాలకు ఫోన్ చేయటం.. మొత్తం పన్నెండుసార్లు కాల్ చేశారు.. చివరి కాల్ లో మాత్రం కాంగ్రెస్తో ఉండి విమర్శ చేసినా సీరియస్ గా తీసుకోలేదు కానీ పచ్చ కండువా కప్పుకొని విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోను అని బెదిరింపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి చాలా జరిగాయి , సబ్జెక్టు ఉన్న వాళ్ళను, మీడియాలో మంచి ప్రెజెన్స్ ఉన్నవాళ్లను పట్టించుకోవాలన్న ఆలోచన వైసీపీ చేయలేదు.. మీడియా అవసరం ఉందని కానీ, బాగా మాట్లాడే వాళ్ళ అవసరం ఉందని కానీ వైసీపీ అనుకోలేదు.. ప్రతిపక్షంలో ఏ స్క్రిప్ట్ లేకుండా స్వేచ్ఛగా, స్వచంగా మాట్లాడిన జగన్ గారికి అధికారంలోకి వచ్చిన తరువాత స్క్రిప్ట్ చూసి చదివే పరిస్థితి వచ్చింది , అయినా కానీ ఆ స్క్రిప్ట్ సరిగా రాయలేకపోయారు. ఆ స్కిప్టులు రాసిన మనిషి జూన్ 4 మధ్యాహ్నం నుంచి పత్తా లేరు, జగన్ కోర్ టీమ్ ఫోన్ కూడా ఎత్తటం మానేశారు.
సరే మళ్ళీ మొదటికి వస్తే , ఆ కాంగ్రెస్ యువనేత పార్టీ మారుతున్నాడు, మీరు ప్రయత్నం చేయండి అని నేను సన్నిహితంగా ఉన్న ఒకరికి (సీఎంను రోజూ కలిసే మంచి పదవిలో ఉన్నారు అప్పుడు) చెబితే.. ఏమైతది అతనితో? ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తాడు? అని పుల్ల విరిచారు..
Ads
అధికారంలో ఉన్నంతకాలం సబ్జెక్టు ఉన్నవాళ్లు అవసరం అని కానీ , చేస్తున్న అభివృద్ధి పనులను సాక్షి తరహాలో తూతూమంత్రంగా రాయటం కాకుండా మరోరకమైన అంటే ప్రొఫెషనల్ పద్దతిలో ప్రజలకి చేరే విధంగా ప్రచారం అవసరం అని వైసీపీలో అధికార నిచ్చెన పై మెట్టు నుంచి కింద మెట్టు వరకూ ఉన్న ఏ ఒక్కరూ గుర్తించలేదు. ఆ దిశగా సూచనలు చేసిన వారిని పట్టించుకోలేదు. రోజువారి పని , మొక్కుబడి పనితో గడిపేశారు..
మీ జిల్లా పిల్లోడు టీడీపీలోకి పోతుంటే నువ్వు ఏమి చేస్తున్నావ్ అని జగన్ బాలినేని మీద కోప్పడితే అప్పుడు ఫోన్ చేసాడు.. అప్పటి వరకు అతని పేరు కూడా బాలినేనికి తెలియదు.
సదరు యువనేత వైసీపీలో ఉండగా ఒక సందర్భంలో పైన చెప్పిన స్క్రిప్ట్ రైటర్ వద్దకు ఫ్లవర్ బొకే తీసుకొని వెళితే, నువ్వు ఎవరివి మీడియాలో మాట్లాడటానికి అంటూ అందరి ముందే బొకేను నేలకేసి కొట్టాడు ,ఆ యువ నేత నేను ఎవరో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి, నాడు అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళు ఆహ్వానించినా సరే, వద్దని ఏమీ లేని కాంగ్రెస్ లో చేరి భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు, 2021లో అధికార వైసీపీ పిలిచినా వద్దనుకొని టీడీపీ ఆహ్వానంతో అంటే ప్రతిపక్షంలోకి వెళ్ళాడు..
బాలినేని రాజీనామా
ఇప్పుడు ప్రజలు expecting most unexpected things అంటే… ప్రజల ఊహకు అందనిది ఏది లేదు. అలాంటిది అందరూ అనుకున్నదే జరిగినప్పుడు ఆశ్చర్యపోయేది ఏమి ఉండదు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. రెండుసార్లు ముహుర్తాలు పెట్టుకున్నా కుదరలేదు, ఇప్పుడు సెట్ అయ్యింది. బాలినేని జనసేనలో చేరటం కోసం నాగబాబుతో మూడు రోజుల కిందట సమావేశం అయ్యారు. ఈరోజే రేపో పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ ఉందంట.
బాలినేని పోతే ఏమవుతుంది ?
వైసీపీ ప్రకాశం జిల్లాలో మరో పెద్ద తలకాయను వెతుక్కోవాలి. బాలినేనితో సహా అందరూ వ్యతిరేకించినా చంద్రగిరి నుంచి రెండు జిల్లాలు దాటించి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గారికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఈసారి కూడా ఆయనకే ప్రకాశం జిల్లా అధ్యక్షపదవి ఇస్తారని ప్రచారం జరిగింది.. జిల్లా అధ్యక్ష పదవి ఆ జిల్లా నేతకే ఇవ్వాలని ఏమి లేదు .. ప్రాంతీయపార్టీలో అధినేత ఏది అనుకుంటే అదే ఫైనల్..
బాలినేని పార్టీ వీడటంతో వైసీపీకి ఓట్లపరంగా పెద్ద నష్టం ఏమి ఉండదు కానీ ఇంతకాలం పార్టీని నడిపిన నేత కాబట్టి ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది.. బాలినేని ఏ రోజూ ఇతర నియోజకవర్గాలలో ప్రజల వద్దకు వెళ్లినవాడు కాదు. .ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడికే పార్టీ నాయకులు వెళ్లేవారు , ప్రజలకు సంబంధం ఉండేది కాదు.
బాలినేనిని మా నేత అని ప్రకాశం జిల్లా ప్రజలు అనుకోరు.. బాలినేని అడ్డుకోవటం వలనే మార్కాపురం జిల్లా కాకుండా పోయింది అనే భావిస్తారు. బాలినేని తన ఒంగోలుకు తాగునీరు తీసుకొని పోవటంపై పెట్టిన శ్రద్ద వెలిగొండ ప్రాజెక్ట్ మీద కూడా పెడితే అది 2023 జూన్ నాటికే పూర్తయ్యేదనే భావన ఉంది.
స్థానిక మంత్రి (వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోకే వస్థాయి ) మంత్రి సురేష్ మీద కన్నా బాలినేని మీదనే రైతులు కోప్పడుతారు. పదవి ఉన్నా పదవి లేకున్నా బాలినేని కానీ సురేష్ కానీ జిల్లాకు చేసింది ఏమీలేదనే విమర్శ ఇద్దరి మీద ఉంది.
ఇంకా ఎవరు పోతారు ?
ప్రకాశం జిల్లాలో వైసీపీ గెలిచిన దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఇద్దరూ బాలినేని అనుచరులే. వీరిలో చంద్రశేఖర్ ను పార్టీలోకి తీసుకొచ్చింది , ఛానల్స్ కు డిబేట్లకు పంపింది , యర్రగొండపాలెం సీట్ ఇప్పించింది బాలినేనే .
బాలినేని చంద్రశేఖర్ కు టికెట్ ఇప్పించారు కానీ యూత్ కాంగ్రెస్ నుంచి తనకు మిత్రుడు అయినా కాకుమాను రాజశేఖర్ కు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు, సంతనూతలపాడు, కొండపి & యరగొండపాలెం మూడు SC స్థానాలు ఉన్నా కాకుమాను రాజశేఖర్ కు టికెట్ రాకపోవటంలో బాలినేని వైఫల్యం కూడా ఉంది.
బూచేపల్లికి భవిషత్తు మీద అసలు ఉండొచ్చు పార్టీ మారటం మీద తొందరపడకపోవచ్చు కానీ చంద్రశేఖర్ బాలినేని మాటే భగవద్గీత అనుకోవచ్చు.
ముందు అనుచరులను పంపి వాటర్ టెస్ట్ చేసుకునే అలవాటు ఉన్న బాలినేని ఎన్నికల తరువాత ఒంగోలు మేయర్ ను టీడీపీలోకి పంపారు అనే అంటారు. ఒంగోలు కార్పొరేటర్లలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ బాలినేనితోనే ప్రయాణం చేస్తారు.
పార్టీ మార్పా? రాజకీయ రిటైర్మెంటా?
నా ఉద్దేశంలో… జగన్ మీద ఉన్న కోపంతోనే బాలినేని పార్టీ మారుతున్నారు. కానీ కొత్త పార్టీలో యాక్టివ్ గా ఉండే అవకాశం లేదు. బాలినేని మనస్తత్వానికి విపరీతమైన గౌరవం కోరుకుంటాడు, అమర్యాద కాదు కదా తగిన మర్యాద దక్కకున్నా తట్టుకోలేడు.
కొత్త పార్టీ అంటే అత్తగారిల్లే .. కొత్త కోడలే సర్దుకొని పోవాలని అనుకుంటారు కానీ వాళ్ళు శ్రద్ధ పెట్టి మర్యాదలు చేయరు.. జనసేనలో చేరితే పవన కళ్యాణ్ ను కలవటం అన్నిసార్లు సాధ్యం కాదు , నాదెండ్ల మనోహర్ లాంటి నేతలతో పనిచెయ్యటం బాలినేనికి మనస్కరిస్తుందా? బాలినేనిని జనసేనలో చేర్చుకోకుండా పవన్ కళ్యాన్తో మాట్లాడండి అని టీడీపీ మంత్రి ఒకరు చంద్రబాబు గారి వద్దకు వెళ్లారు, దానికి అది వాళ్ళ ఇష్టం అని తేల్చిచెప్పారు.
ఎన్నికల ముందే జనసేనలోకి వెళ్ళటానికి సిద్ధమైన బాలినేని కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆగిపోయారు. బాలినేని జనసేనలోకి వస్తే ఒంగోలు టికెట్ ఇచ్చి దామచర్ల జనార్దన్ కు కందూకూర్ టికెట్ ఇచ్చేలా ఒక సర్వే కూడా జరిగింది. అది కుదరని పక్షంలో బాలినేనికి గిద్దలూరు టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేశారు.
1999 కాంగ్రెస్ టికెట్ నాటి మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనుకు రావలసింది కానీ వైఎస్సార్ ఆశీస్సులతో బాలినేని దక్కింది. చంద్రబాబు తటస్థుల ప్రయోగంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఈదర హరిబాబును కాదని వైశ్య సామాజిక వర్గానికి చెందిన యక్కలి తులసీరావుకు సీట్ ఇచ్చారు, హరిబాబు రెబల్ గా వేసి 25,000 ఓట్లు చీల్చటంతో బాలినేని కేవలం 6000 ఓట్ల తేడాతో గెలిచారు.. అప్పటి నుంచి కాంగ్రెస్ & వైసీపీ పార్టీ గెలిచిన 2004, 2009 & 2019లో గెలిచి… వైసీపీ 2014 & 2024లో ఓడిపోయినా (2012 ఉప ఎన్నికకు ప్రాధాన్యత లేదు ) బాలినేని మరోసారి పోటీ చేస్తారా?, 2024 ఓటమే చివరి ఎన్నిక అవుతుందా?
నా ఉద్దేశంలో బాలినేని కొత్తపార్టీలో చేరి సైలెంట్ అయిపోతారు. కొద్దికాలం తరువాత బాలినేని కొడుకు ప్రణీత్ రెడ్డి , మా తండ్రి రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను జగన్ తోనే నడుస్తాను అని ప్రకటించి 2029 ఒంగోలు టికెట్ రేసులోకి రావొచ్చు…… (శివ రాచర్ల)
Share this Article