అకస్మాత్తుగా విశ్వభ్రమణం ఆగిపోతే..? విశ్వం కాదు, భూభ్రమణం… ఎక్కువ సేపు కాదు, జస్ట్, ఒకే క్షణం… మనకు తెలుసు కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది… తన చుట్టూ తను ఒకసారి తిరగడానికి 24 గంటలు పడుతుంది… చిన్నప్పుడే చదువుకున్నాం కదా… సూర్యుడి చుట్టూ తిరగడం కాదు, తన చుట్టూ తిరగడం ఒక్క క్షణం ఆగిపోతే ఏం జరుగుతుంది..? ఇంట్రస్టింగు ప్రశ్న కదా… నిజంగా ఏమవుతుంది..? అబ్బే, ఏముంది అందులో… ఒక సెకండులో కొంపలేం మునిగిపోవు, వీసమెత్తు ప్రభావం ఉండదు అనుకుంటున్నారా..? తప్పులో కాలేసినట్టే… ఒక్క సెకను గనుక భూమి తన భ్రమణాన్ని ఆపేస్తే, ఒక్క జీవి కూడా బతికి బట్టకట్టదు అట… హాశ్చర్యంగా ఉందా..? నమ్మబుల్ అనిపించడం లేదా..? ఎవరో ఫేక్ స్వామీజీయో, డొల్ల మాటలకు పేరొందిన రాజకీయ నాయకుడో చెప్పింది కాదు ఇది… ప్రఖ్యాతి పొందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త (Astro physicist) చెప్పిందే…
ఆయన పేరు Neil deGrasse Tyson… సింపుల్‌గా టైసన్ అందాం… ఏదో ఓ టీవీ ఇంటర్వ్యూలో తను ఇది చెప్పాక విస్తుపోయిన విలేకరి ఇంకాస్త వివరించాలని ఆయన్ని అడిగారు… ఆధారం ఏమిటి అన్నారు… ఆయన ఏమంటాడంటే… ‘‘వేగంగా వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగింది, మీరు సేఫ్టీ బెల్ట్ పెట్టుకుని లేరు… ఏమవుతుంది..? సేమ్, దీన్ని కూడా అలాగే చూడాలి… కాకపోతే తీవ్రత చాలారెట్లు ఎక్కువ… ఎందుకంటే..? మన భూమి గంటకు 1000 మైళ్ల వేగంతో పరిభ్రమిస్తోంది… అంటే, భూమిపై ఉన్న జీవజాలం కూడా అదే స్పీడ్‌తో తిరుగుతున్నట్టు లెక్క… అందులో మనం కూడా ఉన్నాం, తిరుగుతున్నాం… అంత స్పీడ్‌గా భూమితోపాటు తిరుగుతున్నాం కాబట్టే మనకేమీ తెలియడం లేదు… సెకను ఆగితే అది మహోత్పాత విపత్తు అనాలి… అంత వినాశనం… గంటకు వేయి మైళ్లు వేగంతో వెళ్లే కారు ఒక్కసాారిగా ఆగితే ఏమవుతుంది..? మనిషి విండ్ షీల్డ్ బద్దలు కొట్టుకుని ఎంత దూరంలో పడతాడో చెప్పలేం, అలాగే భూమి సెకను ఆగితే జీవజాలం అంతే వేగంగా ఎక్కడెక్కడికో వెళ్లి పడుతుంది… అడ్డంగా ఉండే గోడలు, కిటికీలు, తలుపులు, రోడ్లు, చెట్లు, రాళ్లు, గుట్టలు గట్రా గుద్దుకుని ఆ క్షణం దాటకముందే మరణించడం..’’ ఇది సరే, ఒకవేళ భూమి వేగంతోపాటు జీవజాలం కూడా తన వేగాన్ని తగ్గించుకోగలిగితే ఏమవుతుంది..? దానికీ జవాబు చెప్పాడాయన… ‘‘ఎవరికీ ఏమీ జరగదు… ఐనా భూమి వేగం కాసేపు తగ్గితే ఏమవుతుంది..? యథాతథంగా అది వేగాన్ని తిరిగి పొందేలోపు ఎంత టైం పడుతుందో, ఆమేరకు ఆరోజు పొడవు పెరుగుతుంది…’’ అర్థం కాలేదు కదా… కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే బోధపడుతుంది… ప్రయత్నించండి…
Ads
Share this Article