థర్డ్ వేవ్ అని భయపెట్టేస్తూనే ఉన్నారు… ఎన్ని వేవ్స్ మీద ప్రచారాలు సాగుతాయో తెలియడం లేదు… ఒకవైపు అందరికీ బూస్టర్ డోసులు కంపల్సరీ అంటున్నారు… మరోవైపు రకరకాల రంగుల ఫంగసులు పుట్టుకొస్తున్నయ్… కరోనా అనంతరం సమస్యలూ దేహాల్ని పీడిస్తున్నయ్… కరోనా చికిత్సల ప్రోటోకాల్ నుంచి కొన్ని మందులు ఎగిరిపోతున్నయ్, కొన్ని కొత్తగా వచ్చి చేరుతున్నయ్… ప్రపంచమే ఓ పేషెంటుగా మారిపోయింది… ఇప్పట్లో ఏ ఆర్థిక వ్యవస్థా చక్కబడే స్థితి కనిపించడం లేదు… చైనా వాడి వైరస్ ప్రపంచాన్ని ఇంకా ఏ స్థాయికి తీసుకుపోతుందో తెలియదు………… ఇదే కదా, రోజూ మనం చదివే పత్రికలు, టీవీలు, సైట్లు, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు మన బుర్రల్లోకి ఎక్కిస్తున్నది… నిజంగానే ఇంకా భయంకరంగా ఉండబోతోందా సిట్యుయేషన్..? అందరూ భయపెడుతున్న డెల్టా ప్లస్ ఇంటికో పీనుగును లేపనుందా..?
ఒకవైపు ఇజ్రాయిల్ వంటి కొన్ని దేశాలు మాస్కుల్ని వదిలేస్తున్నయ్… అమెరికా వంటి దేశాలు మాస్కుల్ని వదిలేసే సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో పడింది… పలు దేశాలు కరోనా ఆంక్షల్ని సడలిస్తున్నయ్… వేక్సిన్లు కోట్లలో పడుతున్నయ్… నిజం చెప్పాలంటే చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది… వరల్డోమీటర్ గణాంకాలు పరిశీలిస్తే… కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినట్టుగా అర్థమవుతుంది… ఒకప్పుడు రోజుకు లక్ష కేసుల దాకా చేరి అతలాకుతలం అయిపోయి అమెరికా నగరాలు ఇప్పట్లో గాడిన పడతాయా అన్నంత కలవరాన్ని కలిగించాయి… కానీ ఇప్పుడు అమెరికాలో రోజుకు పది వేల కేసులకు పడిపోయింది తీవ్రత… అసలు పలు దేశాల్లో కొత్త కేసుల్లేవు… మరణాల్లేవు… కొన్ని దేశాల్లో 10, 20, 50 ఇలా కూడా నమోదవుతున్నయ్…
Ads
ఎటొచ్చీ ఆందోళనకరంగా ఉన్నది ఇండియా, బ్రెజిల్… ఇండియాలో తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా సరే, పరిస్థితి ఇంకా కంట్రోల్లోకి రానట్టే లెక్క… పాజిటివిటీ రేటు తగ్గినట్టు, రికవరీ రేటు పెరిగినట్టు కనిపిస్తోంది… కేసుల సంఖ్య తగ్గింది… (పలు రాష్ట్రాలు కేసుల సంఖ్యపై తప్పుడు వివరాలు ఇస్తున్నా సరే, ట్రెండ్ తెలుస్తుంది కదా…) ఆక్సిజన్ పెట్టే కేసులు తగ్గాయి… బెడ్స్ లభ్యత పెరిగింది… కానీ ఈరోజుకూ మరణాలు తగ్గడం లేదు… రోజుకు 60 వేల కేసులు అనేది ఇంకా ఆందోళనకరమే… ప్రత్యేకించి మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కంట్రోల్ కావడం లేదు… మరో సమస్యాత్మక దేశం బ్రెజిల్… అక్కడ రోజుకు 70 వేలపైనే కేసులొస్తున్నయ్… మరణాలూ ఎక్కువే… అర్జెంటినా, కాంబోడియా దేశాల్లో కూడా 20, 30 వేల కేసులొస్తున్నయ్… రష్యా, బ్రిటన్ పదేసి వేలు…
ఇక్కడ ఎవరి విశ్లేషణలకూ అందని ప్రశ్నలున్నయ్ కొన్ని… మన పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, బర్మా దేశాల్లో పరిస్థితి మరీ అదుపు తప్పలేదు, వాటికన్నా ఎంతోకొంత బెటర్ ప్రజారోగ్యవ్యవస్థ ఉన్న ఇండియాలో ఈ స్థితి ఏమిటి..? (చికిత్స పద్ధతుల్లో లోపాలే ఒక కారణంగా భావిస్తున్నారు)… ప్రపంచంలో ఆందోళనకరంగా కరోనా ఉన్న మరో దేశం బ్రెజిల్… అలాగే అర్జెంటీనా, కాంబోడియా… ఇవన్నీ దక్షిణ అమెరికా దేశాలే… వీటికన్నా పేద దేశాలు వాటి చుట్టుపక్కల ఉన్నా, వాటిల్లో తీవ్రత అంతగా లేదు… అదెలా..? పోనీ, చలి దేశాల్లోకన్నా ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది అనుకుంటే… దక్షిణాఫ్రికాలో ఈ తీవ్రత లేదు ఎందుకు..? బ్రిటన్, రష్యా కూడా చలి ప్రదేశాలే కదా, అక్కడెందుకు కంట్రోల్ కావడం లేదు..? సో, ఏ సైంటిఫిక్ విశ్లేషణలకూ సరిగ్గా అందడం లేదు కరోనా స్థితి… కానీ స్థూలంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్రత తగ్గినట్టే లెక్క… రకరకాల మ్యూటెంట్లు, వేరియెంట్లు ఏ వైరసులోనైనా సహజమే… సో, వేవ్స్ వస్తూ వస్తూ క్రమేపీ వైరస్ బలహీనపడుతుందని ఆశించడమే ఇప్పుడు మనిషి చేయదగింది…!!
Share this Article