Paresh Turlapati…. కారులో వెళ్తూ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడితేనూ ఆగా…
ఆగినవాడ్ని ఎందుకో పక్కకు చూసి ఉలిక్కిపడ్డా !
పక్కనెవడో బైకు వాడు నా వంక చూసి హుష్.. హుష్.. అని సైగలు చేస్తున్నాడు !
వసంతకోకిలలో శ్రీదేవి మైండ్ రిస్టోర్ అయి ట్రైన్లో వెళ్లిపోతుంటే కమలాసన్ రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడే.. అలా మూగ సైగలు చేస్తున్నాడు !
మొదట అర్థం కాలే.
తర్వాత భయమేసింది !
కొంపదీసి వీడి తలకు కూడా దెబ్బ తగిలి మైండ్ దొబ్బిందా ?
నన్ను చూడగానే వీడికేమన్నా గత జన్మ గుర్తొచ్చిందా ?
స్వతహాగా మనది జాలి గుండె కావటంతో ఎందుకైనా మంచిదని విండో ఓపెన్ చేయకుండా నన్నేనా ? అని కొచ్చన్ మార్కు సైగ చేశా.
ఆ సైగకే ఆ బైకు వాడు సాగర సంగమంలో ఆఖరి సీన్ లో ఆడిటోరియంలో జనాలు చప్పట్లు కొడితే కమలాసన్ ఉబ్బితబ్బిబ్బు అయిపోయినట్టు పరమానందభరితుడు అయ్యాడు !
Ads
“నిన్నే.. నిన్నే..’ అని మూగ సైగలు చేసాడు.
వీడెవడో తెలిసిన ముఖంలా లేదు.
పైగా హెల్మెట్ కూడా తీసిచావలేదు.
పోనీ విండో తీద్దామా అంటే ఏ చైను స్నాచరో అయితే ,
అమ్మో అనుకుని మళ్లీ నేను కూడా మూగ సైగ చేశా.
‘ ఎవడ్రా నువ్వు.. ? అని.
వాడికి మ్యాటరేమర్దమైందో ఏంటో కానీ ,
” నేను.. నేను…. సు.. సు…” అంటూ మరోసారి వసంత కోకిలలో కమలాసన్ లెక్కన సైగలు చెయ్యటం మొదలెట్టాడు !
పైగా ఏడుస్తున్నాడు కూడా.
కొంపదీసి వీడు వసంత కోకిల సినిమా చూసి ఇలా అయిపోయాడా ?
అయినా నిజం చెప్పొద్దూ ! వీడి సైగలకు నాక్కూడా కన్నీళ్లు వచ్చాయి !
వీడేదో సు…సు…అని సైగలు చేస్తున్నాడేంటి ?
అంటే వీడు కొంపదీసి సుబ్బు గాడు కాదు కదా ?
కానీ ఆ సైగలకు అర్థం కొన్ని రీళ్ళు వెనక్కి తిరిగిన తర్వాత బల్బ్ వెలిగింది.
ఎస్… వీడు చిన్నప్పుడు నాతో కల్సి చదివిన సుబ్బు గాడే !
సుబ్బు గాడిది ఏడుపు కాదు.
ఆనంద బాష్పాలు అని అర్థమైంది !
నన్ను చూడగానే ఎమోషన్ అయినట్టున్నాడు.
పాపం ! అప్పట్లోనే కవితలు కాకరకాయలంటూ మాట్లాడేవాడు !
ఆ సుబ్బు గాడే ఇప్పుడు దుబ్బులా ఇలా అయిపోయాడు !
విండో దించి “ఒరేయ్ తవిక సుబ్బుగా.. నువ్వేనా… ?” అని అర్చా.
వాడు ఉబ్బితబ్బిబ్బై “ఎస్ ! నేనంటే నేనేరా.. సుబ్బుని ?” అన్నాడు సంబడంగా.
ఈ లోపు గ్రీన్ సిగ్నల్ పడింది.
వెనుక రైడర్స్ హారన్లు మొదలయ్యాయి.
ఈలోపు వాడే అందుకుని” ఓసారి గబాల్న నీ మొబైల్ నెంబర్ చెప్పరా.. ?” అన్నాడు.
నేను చెప్పాను.
వాడు సేవ్ చేసుకున్నాడు.
తర్వాత వాడు లెఫ్ట్ ఎల్లిపోయాడు.
నేను రైటెల్లిపోయాను.
ఇంటికెళ్లి చూసా.
వాడు ఫోన్ చేస్తాడేమో అని.
చెయ్యలా ? .
పాపం ! ఆ పిచ్చి వెధవని నేను గబాల్న గుర్తుపట్టలేకపోయా ! అప్పటికీ వసంత కోకిల్లో కమలాసన్ లా మూగ సైగలు కూడా చేసాడు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది !
హర్ట్ అయ్యాడేమో అందుకే ఫోన్ చెయ్యలేదు.
అనుకుంటూ ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు.
సరిగ్గా అర్ధరేత్రి వాట్సాప్ నోటిఫికేషన్ టంగ్ అంటూ గంట మోగింది.
ఈ టైములో ఎవరా అంటూ ఉలిక్కిపడి లేచా.
ఏదైనా అర్జంట్ మెసేజెమో అని వాట్సాప్ ఓపెన్ చేశా.
ఎవడో శుభ అర్ధరాత్రి మెసేజ్ పెట్టాడు.
టైం చూసా.
పన్నెండు కావటానికి ఓ నిమిషం ఉంది.
ఆ వెంటనే ఇంకొడు శుభోదయం మెసేజ్ పెట్టాడు.
మళ్లీ టైం చూసా.
పన్నెండు గంటలు దాటి ఒక నిమిషం అయ్యింది.
ఎప్పుడూ పరిచయం లేని నెంబర్లు.
ఈలోగా ఇంకో మెసేజ్ వచ్చింది.
‘ రాజు రాస్తాడు కవిత ‘
‘ రాణి వేస్తుంది రవిక ‘
రాజు కవితలు రాయటానికీ రాణి రవిక వేయటానికి సంబంధం ఏంటో ఎంత గింజుకున్నా అర్థం కాలే !
వెంటనే ఇంకో బాణం దిగింది.
‘ ఆకాశంలో కారు మబ్బులన్నీ ఊరుక్కుంటూ
దిగి వచ్చాయి నా నట్టింటికి జుట్టు విరబోసుకుంటూ ‘
ఉలిక్కిపడ్డా.
ఏంటిది ?
వీడింట్లో కరెంట్ పోయిందా ?
అంతా నలుపంటున్నాడు ?
ఈలోపు ఇంకో బళ్లెం విసరబడింది.
‘నేనో నిప్పు కణిక
భగభగ మండే అగ్ని గోళాన్ని ‘
రేయ్ బాబూ.. ఏంట్రా ఇది.. అసలే ఎండలకు ఇక్కడ ఐస్ గడ్డలేసుక్కూర్చుంటే నిప్పు రవ్వలు.. అగ్ని గోళాలు ఏంట్రా నాయనా ?
ఇదేంటి ఇదేదో కవితల సమూహంలా ఉంది.
అప్పుడు గుర్తొచ్చింది.
సాయంత్రం తవికల సుబ్బుగాడికి నా మొబైల్ నెంబర్ ఇచ్చిన సంగతి !
వార్నీ ! సుబ్బుగా నీకు నెంబరిస్తే ఇలా తవికల గ్రూపులో పడేసి క్రూరతిక్రూరంగా హింసిస్టావా అని పళ్ళు పట పటా కొరికా !
ఈలోపు ఇంకో బాణం… కాదు.. కాదు… బల్లెం కాదు.. కాదు.. గునపం వచ్చి పడింది !
ఫోను పక్కన పడేసి విరక్తిగా కళ్ళు ముసుకున్నా !
తవికా సముహంలో ఎవరో బాహుబలి కూడా ఉన్నట్టున్నాడు… ఒకేసారి వంద బాణాలు విసురుతున్నాడు !
భళ్ళున తెల్లారింది.
మొబైలుకి ఒళ్ళంతా గాయలే !
ఒళ్ళు మండి తవికల గ్రూపుని దూరంగా విసిరికొట్టా !
మెల్లిగా ఫోను కోలుకుంది !!
అప్పటినుంచి అందరికీ వాట్సాప్ నంబర్ ఇవ్వటం మానేశా !
ఇతి వాట్సాపా తవికల గ్రూపు అధ్యాయ సమాప్తహ !!
(వాట్సాప్ అనేది ఓ అందమైన ప్రాయోజిత కార్యక్రమం… దాన్ని రకరకాల గ్రూపులలో యాడ్ చేసి చిత్రవధలతో చావదొబ్బకండ్రా బాబూ )… పరేష్ తుర్లపాటి
Share this Article