.
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మించిన కన్నప్ప ఫెయిల్యూర్ కారణాల మీద బోలెడు అభిప్రాయాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి… ఈమధ్య తమ్మారెడ్డి భరద్వాజ ఎక్కడో మాట్లాడుతూ…
‘‘అక్షయ్ కుమార్, కాజల్ శివపార్వతులుగా అస్సలు సెట్ కాలేదు… ప్రధాన దేవుళ్లను చూస్తేనే భక్తిభావం కలగలేదు, పైగా సినిమాలో భక్తికన్నా ఇతర అంశాలే హైలైట్ అయ్యాయి… స్టార్లకన్నా చిన్న నటులను తీసుకున్నా సినిమా ఇంకా బాగా వచ్చేదేమో…’’ అని అభిప్రాయపడ్డాడు…
Ads
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఓ పెద్ద పాన్ ఇండియా తీయాలనే ఆలోచనే తప్పు అనేది సర్వజనాభిప్రాయం… నిజానికి కన్నప్ప మీద వచ్చిన ప్రతి సినిమా హిట్టు… కృష్ణంరాజు, వాణిశ్రీ, బాపు కలయికలో వచ్చిన పాత కన్నప్ప కూడా సూపర్ హిట్టు… కారణం..?
బాపు దర్శకత్వం, రావుగోపాలరావు విలనీ, ఓ నాస్తికుడు ఆస్తికుడిగా మారే క్రమాన్ని ఆసక్తికరంగా చిత్రించడం, కిరాతార్జునీయం ప్లస్ ప్రత్యేకించి పాటలు… ఆ సినిమాకు పాటలు కూడా ప్రధానబలం… రక్తి, భక్తి పదాల దగ్గర ఇంకొంత చెప్పుకోవాలి… ఎంత భక్తి సినిమా అయినా కాస్త రక్తి టచ్ చేయకుండా ఉండరు మన దర్శకులు… మంజునాథలో మహాప్రాణదీపం వంటి క్లాసిక్‌తోపాటు శివపార్వతుల డ్యూయెట్ కూడా ఉంది…
వేమన సినిమా అయినా అంతే… రక్తి నుంచి వైరాగ్యం దాకా… రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మూడు సినిమాలను ఉదహరిద్దాం… అన్నమయ్య, పాండురంగడు, శ్రీరామదాసు… డిబేట్ కోసం… అన్నమయ్యలో సాళువ నరసింహరాయలు పాత్ర చిత్రణ చికాకు పెడుతుంది, అస్మదీయ మగటిమి అనే ఓ మసాలా పాట, నాగార్జున మీసాలు గట్రా కొంత విమర్శలకు తావిచ్చినా… మిగతా బ్రహ్మాండమైన పాటల జోరులో, ప్రత్యేకించి అదిరిపోయిన క్లైమాక్స్‌తో అవన్నీ కొట్టుకుపోయాయి…
ఈ మూడు సినిమాలకూ కథ, సంభాషణలు జేకే భారవి… అన్నింటికీ కీరవాణే సంగీత దర్శకుడు… ఐనా సరే, అన్నమయ్య పాటలు ఈరోజుకూ ఇళ్లల్లో మోగుతుంటాయి… పాండురంగడులో కూడా భక్తికన్నా రక్తి ఎక్కువైపోయి, అవే కీరవాణి కంపోజ్ చేసిన పాటలు పెద్దగా హిట్ కాలేదు… శ్రీరామదాసు పాటలు కాస్త నయం… శ్రీరామదాసులో కూడా చాలు చాలు అనే రక్తిపాట… సో, ప్రధానమైన టీమ్ ఒకటే అయినా, ప్రధానంగా కంటెంట్ భక్తే అయినా… ఫలితాలు వేర్వేరు…
మూడు సినిమాల్లోనూ 16 నుంచి 18 పాటల దాకా ఉన్నాయి… అన్నమయ్య సినిమాకు ప్లస్ పాయింట్ ఏమిటంటే..? ఒకటీరెండు వేటూరితో రాయించుకున్నా, మిగతావన్నీ అన్నమయ్య కీర్తనలే… కీరవాణి తనదైన ముద్రతో స్వరకల్పన చేశాడు, అన్నీ శృతి కుదిరాయి… ఒరిజినల్ కథకు కాస్త కల్పన యాడ్ చేయడం, క్రియేటివ్ ఫ్రీడం మూడింట్లోనూ ఉంది…
శివుడిగా అక్షయకుమార్ లుక్కు బాగాలేకపోవడం ఒక్కటే కాదు, కన్నప్ప ఫెయిల్యూర్‌కు చాలా కారణాలున్నయ్… అన్నమయ్యలో సుమన్ ఆ పాత్రకు బాగా నప్పాడు… అన్నమయ్యలో పాటల్లో గాత్రవైవిధ్యం పుష్కలం…
కీరవాణి 14 గొంతుల్ని వాడుకున్నాడు… ఒకటి స్వీయగాత్రం… ఆనంద్, అనురాధ,
జె.కె.భారవి, ఆనంద్ భట్టాచార్య, కె.ఎస్.చిత్ర, గంగాధర శాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, మనో, పూర్ణచందర్, రేణుక, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, ఎం.ఎం.శ్రీలేఖ, సుజాత…
పాండురంగడు పాటలకు కూడా దాదాపు 12 మంది పాడారు… శ్రీవేదవ్యాస, చంద్రబోస్, జేకే భారవి, వేటూరి, సుద్దాలతో పాటు శివదత్తాతో కూడా ఓ పాట రాయించుకున్నాడు దర్శకుడు… గాత్రవైవిధ్యం ఉన్నా పాటల మీద కీరవాణి ప్రత్యేక శ్రద్ధ కనబరిచినా… సినిమాలో రక్తి ఎక్కువై, భక్తిభావనలో ప్రేక్షకుడు తాదాత్మ్యత పొందలేకపోయాడు… టబు, బాలకృష్ణల రొమాన్స్ ప్రేక్షకుడికి రుచించలేదు…
శ్రీరామదాసు పాటల మీద కూడా కీరవాణి కాన్సంట్రేట్ చేశాడు, కానీ అన్నమయ్య రేంజ్‌లో అవి హిట్ కాలేదు… అన్నమయ్యలోలాగే రామదాసు పాపులర్ కీర్తనలు కొన్ని వాడుకున్నా… వేదవ్యాస్, చంద్రబోస్, భారవి, వేటూరి, సుద్దాలతో విడిగా పాటలు కొన్ని రాయించుకున్నాడు…
దాదాపు 13 మంది గాయకులు… శంకర్ మహదేవన్, హరిహరన్, జేసుదాసులు కూడా… గాత్ర వైవిధ్యం, స్వర వైవిధ్యం, రచనా వైవిధ్యం, కథన వైవిధ్యం ఉన్నాసరే అన్నమయ్య విజయాన్ని రిపీట్ చేయలేకపోయింది…!! అన్నమయ్యలో శ్రీవారిగా సుమన్‌కు నప్పిన వేషం రాముడిగా శ్రీరామదాసులో పెద్దగా నప్పనట్టు అనిపించింది..!!
Share this Article