సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది!!
… తాను తీయాలని అనుకున్న ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా సూపర్‌స్టార్ కృష్ణ గారు తీశారని ఎన్టీ రామారావు గారికి కోపం వచ్చింది. ఇద్దరూ కలిసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా శతదినోత్సవానికి రమ్మన్నా ఎన్టీఆర్ రాలేదు. కొన్నేళ్ల దాకా ఆ కోపం అలాగే మిగిలి ఆపై సమసిపోయింది. ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు.
… తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చే విషయంపై తనని సంప్రదించలేదని ఎన్టీఆర్ గారికి అక్కినేని గారి మీద కొంత కినుక ఉండిందని అంటారు. 1984 ప్రాంతంలో రవీంద్ర భారతిలో ఏదో సమావేశంలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ‘కాషాయం ధరించిన వారంతా సన్యాసులు కాదు’ అని అర్థం వచ్చే శ్లోకం వినిపించారు. అప్పుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. గిట్టనివారు ఆ విషయం ఆయనకు మోశారు. అది తననే అన్నారని భావించిన ఎన్టీఆర్ ఇకపై రవీంద్ర భారతిలో జరిగే అక్కినేని కార్యక్రమాల వీడియోలు తనకు కావాలని హుకుం జారీ చేశారు. అది తెలిసిన అక్కినేని త్యాగరాయ గానసభలో కార్యక్రమం పెడితేనే తాను వస్తానని అందరికీ చెప్పారు. ఈ వైరం కొన్నాళ్లు నడిచింది. ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అక్కినేని గారు అభినందనలు తెలిపేందుకు వెళ్లలేదు. ఆపై కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ కలిసిపోయారు.
Ads
… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారెక్కిన హెలికాప్టర్ కనిపించకుండా పోయిన తరుణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఎస్ కుటుంబానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆయన కోసం ఆదుర్దా చెందారు.
... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి బద్ధశత్రువులుగా ఉండేవారు. ఎవరో ఒకసారి కరుణానిధి గారి దగ్గరికి వచ్చి ‘ఎందుకు ఆమెతో అంత కయ్యం? ఆ కేసులు వేసి ఏం సాధిస్తారు?’ అని అంటే “ఆమె ఒక్క ఫోన్ చేసి ఇదంతా అవసరమా? అని అడిగితే మొత్తం వాపస్ తీసుకుంటాను. కానీ అడగదు. ఎందుకంటే ఆమె జయలలిత. నేనూ తగ్గను. ఎందుకంటే నేను కరుణానిధి” అని సమాధానం ఇచ్చారట.
… జయలలిత గారు ఆసుపత్రిలో ఉండగా కరుణానిధి కుమారుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను చూసి, ఆమెకు అందే చికిత్స గురించి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశించారు.
… సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది. అప్పుడు మనుషులు సాటి మనుషులతో చాలా పొందిగ్గా ఉండేవారు. ఆపద వేళల శత్రుత్వాన్ని మరిచి ఒకరి మంచి మరొకరు ఎంచి చూసేవారు. తోడుగా నిలిచేవారు. తోచిన సలహా చెప్పేవారు. చూసేవారు కూడా దాన్ని అనుమానంతో ఎంచక నిండు మనసుతో చూసేవారు.
… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ చదువు వచ్చు. అందరికీ రాయడం వచ్చు. అందరికీ విమర్శించడం వచ్చు. అందరికీ మరొకర్ని అనుమానించడం వచ్చు. అందరికీ ఇతరులపై తీర్పులు ఇవ్వడం వచ్చు. అందరికీ తమను తామే గొప్ప అని అనేసుకోవడం వచ్చు. ఇతరుల్ని అతి సులభంగా నవ్వులపాలు చేయడం, దాని పేరు ‘భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా హక్కు’ అనేసుకోవడం, అలా అనుకొని మరింత వీరలెవల్లో రెచ్చిపోవడం మహ బాగా వచ్చు.
… మాజీ ముఖ్యమంత్రి, ఒకనాడు తాను మెలిగిన పార్టీ అధ్యక్షుడు, వయసులో పెద్దవారు అయిన కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే ఆయన్ని పలకరించడం రేవంత్‌గారు చేసిన పని. అటు ముఖ్యమంత్రిగానూ, ఇటు మనిషిగానూ చేయాల్సిన కనీస బాధ్యత. అదే ఆయన చేశారు. ఇందులో వింతగా చూడాల్సింది, విమర్శ చేయాల్సింది ఏమీ లేదు. ఇదొక డ్రామాగా, సింపతీ మేకింగ్ షోగా కొట్టిపారేయాల్సింది అసలే లేదు! ఇదొక మామూలు, అతి మామూలు మానవ బాధ్యత. ఒక భరోసా! లాభనష్టాలు ఎవరివైనా, ఇదొక స్ఫూర్తిదాయకమైన చర్య! అభినందించకుండా అతి విచారణ చేస్తూ లోగుట్టు ఏదో ఉందని అనుకుంటే ఎట్లా?
... రేవంత్‌గారు, కేసిఆర్ గారు ఎదురు పడితే కత్తులు తీసి యుద్ధం చేస్తారనా జనాల ఊహ? అలా ఏమీ ఉండదు. అంతా మాములుగానే ఉంటుంది. మనం ఏవేవో ఊహించుకొని మన ఫేస్‌బుక్ వాల్స్ నింపేస్తాం! పోనిద్దూ.. రాసేందుకు మనకూ ఏదో టాపిక్ కావాలి కదా! పాజిటివ్ రాస్తే ఎవరు చదువుతారు? లోపల ఏదో గుట్టు ఉంది అని నెగెటివ్ రాస్తేనే కదా కిక్కు! – విశీ
Share this Article