చాలామందిలో ఓ సందేహం బలంగానే ఉంది… కార్తీక పౌర్ణమి పండుగను సోమవారం జరుపుకోవాలా..? మంగళవారం జరుపుకోవాలా..? పురోహితులు అందరూ ఒకేరీతిలో చెప్పరు… మంగళవారం జరుపుకోవాలంటే చంద్రగ్రహణం పడుతోంది… మరెలా..? ‘ముచ్చట’ కొందరితో మాట్లాడి షేర్ చేస్తున్న వివరాలు ఇవి… కానీ ఒక్కటి మాత్రం నిజం… చంద్రగ్రహణం పాడ్యమి రోజున సంభవిస్తుంది… గ్రహణం సమయానికి పౌర్ణమి ఘడియలు వెళ్లిపోతాయి… కానీ కొన్ని సంక్లిష్టతలున్నయ్…
ఏడో తారీఖు.., అనగా సోమవారం సాయంత్రం 4.16 గంటల నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది… కార్తీకమాసంలో సోమవారానికి కొంత విశిష్టత ఉంటుంది… ప్లస్ రాత్రంతా సంపూర్ణ చంద్ర దర్శనం, అందుకే దీపోత్సవాలకు అనువు… కానీ సోమవారం సూర్యోదయం వేళకు చతుర్దశి తిథి ఉంది కదా, మరి సోమవారాన్ని చతుర్దశిగా పాటించాలి గానీ, పౌర్ణమిగా ఎలా పాటిస్తాం అనేవాళ్లు కూడా ఉన్నారు… వాళ్లకు వాళ్ల పురోహితులు చెప్పిందే ఫైనల్… (పౌర్ణమికి, అమావాస్యకు ఈ సూర్యోదయం నిబంధన వర్తించదని జ్యోతిష్కుడు గొల్లపల్లి సంతోష్ శర్మ వివరణ…)
ఎనిమిదో తారీఖు అనగా మంగళవారం సాయంత్రం 4.32 వరకు పౌర్ణమి ఉంటుంది… అంటే సూర్యోదయం వేళకు ఏ తిథి అంటే, దాన్నే విధిగా పాటించాలనుకునే వాళ్లకు మంగళవారం ఉదయమే పండుగ… ఏ దోషమూ ఉండదు… పౌర్ణమి ఉంటుంది… కానీ దీపోత్సవాలకు అననుకూలంగా ఉంటుంది… ఇంట్లో వత్తులు కాల్చడానికి, ఉసిరి దీపాలకు వోకే…
Ads
మరి గ్రహణం ..? ఇదీ అసలు ప్రశ్న… ఈసారి చంద్రగ్రహణం 8న సాయంత్రం 5.09 నుంచి 6.19 వరకు ఉండనుంది… భారత దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో సాయంత్రం 5:40 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే అప్పటికే పౌర్ణమి ఘడియలు వెళ్లిపోయి పాడ్యమి వచ్చేస్తుంది… సో, కార్తీక పౌర్ణమి పండక్కి, ఈ గ్రహణానికీ సంబంధం లేదు… ఇదంతా ఓ సగటు మనిషికి ఈజీగా అర్థమయ్యే లెక్క… అయితే…
గ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే సూతకాలం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో పూజలు మరియు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. గ్రహణ సమయంలో దేవాలయాల తలుపులు కూడా మూసివేస్తారు. గ్రహణ సమయంలో ఇంటి ఆలయంలోని తలుపులు కూడా మూసివేయాలి. సూతకాలంలో ఏదైనా తినడం లేదా త్రాగడం చేయకూడదు. అదే సమయంలో తులసి ఆకులను, గరిక పోచలను వండిన ఆహారం లేదా పాలు లేదా పండ్లు మొదలైన వాటిలో వేయాలి…
ఏతావాతా అర్థమైంది ఏమిటి..? రఫ్‌గా పైపైన పంచాంగాన్ని చూసుకునేవాళ్లయితే పౌర్ణమి తిథికీ గ్రహణానికీ సంబంధం లేదని అర్థం చేసుకుని హాయిగా ఎనిమిదిన ఉదయం పండుగ చేసుకోవచ్చు… పైగా సూర్యోదయం వేళ్లకు పౌర్ణమే ఉంటుంది కాబట్టి ఇదే పండుగ పౌర్ణమిగా భావించొచ్చు… కానీ సోమవారం సాయంత్రం, అదీ రాత్రి మొత్తం పౌర్ణమి ఉంటుంది… చంద్రుడు ఉంటాడు… సూతకాలం భయం లేదు, పైగా సోమవారం…
సో, ఏడున సాయంత్రం పండుగ జరుపుకున్నా తప్పులేదు… ఎటొచ్చీ… ఎనిమిదిన అన్ని గుళ్ల తలుపులు పొద్దున్నే మూసేస్తారు, కాబట్టి గుళ్లలో దీపాలు వెలిగించడం కుదరదు… ఇంట్లో కూడా సూతకాలానికి ముందే, అంటే 8.10 గంటలకు ముందే వత్తులు కాల్చుకోవడం, ఉసిరి దీపాలు వెలిగించడం వంటి తంతులు పూర్తి చేసుకుంటే సరి… ఏది పాటించాలి అంటే మీ వెసులుబాటు… మీ ఇష్టం- మీదే నిర్ణయం…!
Share this Article