Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి నాసాకే అంతుచిక్కని సునీతా విలియమ్స్ స్పేస్ రిటర్న్ జర్నీ…

August 26, 2024 by M S R

ఇండియన్ మూలాలున్న అమెరికన్ అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు.. బోయింగ్ స్టార్ లైనర్ కంటే, ఎలోన్ మాస్క్ స్పేస్ ఎక్సే బెటర్ అంటోంది నాసా! ఎందుకు…?

ఎలోన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ను ఎంచుకోవాలనుకోవడం వెనుక కారణాలతో పాటు.. ప్రపంచదేశాల్లోనూ ఇప్పుడు వ్యోమగాములైన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి మళ్లీ భూమ్మీదకు చేరుకోగలరా అన్నవి ప్రధాన ప్రశ్నలుగా మారాయి. దానికి మరో ఆర్నెళ్ల సమయం పడుతుందని నాసా ప్రకటించడంతో… అది సాధ్యపడే పనేనా అనే ఒకింత ఆందోళన కూడా సామాన్యజనంలో రేకెత్తుతోంది.

ఇద్దరు యుఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సరిగ్గా గత జూన్ 5వ తేదీన 10 గంటల 52 నిమిషాలకు బోయింగ్ స్టార్ లైనర్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) కు ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి ప్రయాణం కేవలం 8 రోజుల వ్యవధితో మాత్రమే ఖరారైంది. కానీ, స్టార్ లైనర్ లో హీలియం లీకేజ్, వ్యోమనౌక ప్రయాణానికి చోదకంగా ఉపయోగపడే 28 థ్రస్టర్లలో ఐదింటిలో సమస్యలు రేకెత్తడం వంటి కారణాలతో ఇప్పుడు ఇద్దరు వ్యోమగాముల 8 రోజుల ప్రయాణం కాస్తా సుదీర్ఘమైన 8 నెలల ప్రయాణంగా మారింది.

Ads

ఇప్పటికే రెండు నెలలు పూర్తైన నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మళ్లీ తిరిగి వస్తారా… రాగలరా అనే సందేహాలు సామాన్య జనంలో అనుమానాలతో కూడిన చర్చలకు తెరలేపుతున్నాయి. మరోవైపు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏమంటారంటే.. యూఎస్ లేదా, రష్యా దగ్గర మాత్రమే ఇప్పుడు ఆ స్పేస్ లో చిక్కుకున్న వ్యోమగాములను కాపాడి తిరిగి భూమ్మీదకు తెచ్చే సాంకేతిక పరిజ్ఞానముందంటారు. అమెరికా వద్ద crew dragon space craft.. అలాగే, రష్యా దగ్గర soyuz వంటి క్యాప్సుల్స్ ఉన్నాయంటారు.

అయితే, అందుకు భిన్నంగా ఇప్పుడు నాసానే అధికారికంగా ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ పై బాధ్యతను పెట్టడం.. అందుకు సంబంధించి నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ప్రకటన చేయడంతో వ్యోమగాముల రిటర్న్ జర్నీపై భిన్నరకాల చర్చలకు ఆస్కారమేర్పడింది.

space X crew-9 మిషన్ సెప్టెంబర్ చివరి వారంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమవుతోంది. ఆ క్రమంలో నల్గురికి బదులుగా ఇద్దరు ప్రయాణీకులనే ఎలాన్ మాస్క్ space X crew-9 తీసుకెళ్తోందని.. అలాగే అదనపు కార్గోతో పాటు, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ధరించే నిర్ధిష్ఠ సూట్స్ ను కూడా తీసుకెళ్తుందని.. కాబట్టి, space X crew-9 అక్కడికి చేరుకోగానే స్టార్ లైనర్ ను ఖాళీ చేసి తిరిగి డాటాతో కిందకు పంపొచ్చని.. అక్కడ చిక్కుకున్న వ్యోమగాములిద్దరూ తిరిగి space X crew-9లో రావొచ్చనేది నాసా తాజాగా చెబుతున్న మాట.

స్టార్ లైనర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం నాసా యత్నించినప్పటికీ వాటికి పరిష్కార మార్గం కనుగొనలేకపోయింది. దాంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి భూమ్మీదకు చేరుకునే ప్రయాణం వాయిదా పడుతూ.. ఎప్పుడు కిందకు తిరిగి చేరుకుంటారో కచ్చితంగా తెలియని ఒక అనిశ్చితికి కారణమైంది.

అయితే, బోయింగ్ స్టార్ లైనర్ ను ఆస్ట్రోనాట్స్ లేకుండా తీసుకురావాలనుకోవడం.. ఆస్ట్రోనాట్స్ ను అత్యంత ప్రమాదకరమైన స్పేస్ ఫ్లైట్ నుంచి తప్పించి space X crew-9లో తీసుకురావాలన్న నాసా యోచన వెనుక ప్రధాన కారణం వారి భద్రతేనంటున్నారు బిల్ నెల్సన్. దాంతో పాటు స్టార్ లైనర్ సాయంతో మరింత డాటా సేకరణకు కూడా ఉపయోగపడుతుంది.. అలాగే, ప్రమాదానికీ అవకాశాలుండవనేది నాసా చెప్పే మాట.

ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి వరకూ.. అంటే మొత్తం ఎనిమిది నెలలు.. అంటే మరో ఆర్నెళ్లు.. ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ లోనే గడపాల్సిన పరిస్థితి. స్పేస్ ఎక్స్ కూడా నాసాకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ వంటివారు కూడా ప్రకటించారు.

బోయింగ్ స్టార్ లైనర్ పై ఆది నుంచీ అనుమానాలే!

స్టార్ లైనర్ స్పేస్ క్సాఫ్ట్ హీలియం లీకేజ్ సమస్యను ఆది నుంచే ఎదుర్కొంటోంది. అందుకే, ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. ఎయిర్ క్రాఫ్ట్ ప్రారంభమయ్యే ముందు కూడా నాసాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయినా ప్రణాళికా బద్ధంగా తామనుకున్న లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసంతోనే నాసా ఈ బోయింగ్ స్టార్ లైనర్ ని కక్షలోకి ప్రవేశపెట్టింది.

కానీ, ఆర్బిట్ లోకి ఎంట్రీకి ముందే మూడు హీలియం లీక్సును గుర్తించగా.. మరో రెండు లీకేజీ సమస్యలు కక్షలోకి ఎంటరయ్యాక బయటపడ్డాయి. అయితే, నాసా బృందం రెండు హీలియం వాల్వులను గుర్తించి మూసివేయగా.. మిగిలిన వాల్వులకు పరిష్కారం లభించలేదు. దీంతో బోయింగ్ స్టార్ లైనర్ అక్కడ ఉండటానికే తప్ప.. తిరుగు ప్రయాణానికి.. అదీ వ్యోమగాములతో కలిసి కిందకు రావడానికి ఎంతమాత్రమూ అనువైంది కాదని శాస్త్రవేత్తల బృందం నిర్ణయం తీసుకోవడంతోనే ఇప్పుడు మరో ఆర్నెళ్ల ఆలస్యానికి కారణం. ముఖ్యంగా స్టార్ లైనర్ కు భూమిపైన సురక్షితంగా దిగేందుకు కావల్సిన ప్రేరణశక్తి కొరవడటమే శాస్త్రవేత్తల ఆందోళనకు ప్రధాన కారణం.

మరో ఆర్నెళ్లు స్పేస్ లో తట్టుకోగలరా..?

కచ్చితంగా తట్టుకోగలరని.. ఆస్ట్రోనాట్స్ ఇద్దరూ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నారంటోంది నాసా. అందుకోసం కావల్సిన మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించామని.. శిక్షణ కూడా వారికి ఇచ్చి పంపించామంటోంది. అయితే, గతంలో కూడా సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 127 రోజులొకసారి, 195 రోజులొకసారి ఉండగల్గింది కాబట్టి… వచ్చే ఫిబ్రవరి వరకు కచ్చితంగా ఈ ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమ్మీదకు చేరుకుంటారని ఆశిద్దాం. సామ్యాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకూ నెలకొన్న ఉత్కంఠకు ఓ సానుకూల ఫలితం లభించాలని కోరుకుందాం….. (రమణ కొంటికర్ల)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions