ఒక టీవీ వినోద చానెల్ వేరు… ఓటీటీ వేరు… ఓటీటీ అనగానే ప్రేక్షకులు సినిమాలు, ఆయా ఓటీటీల ఎక్స్‌క్లూజివ్ వెబ్ సీరీస్ ఎట్సెట్రా చూస్తారు… అవి ఎప్పుడైనా చూసేలా ఉంటయ్… మళ్లీ వాటికి సబ్‌టైటిళ్లు, సపరేట్ భాషల ఆడియో అదనం… కేవలం సబ్‌స్క్రిప్షన్ మీద ఆధారపడి అంత కంటెంట్ క్రియేట్ చేసి, డంప్ చేయడం కష్టం…
టీవీ వేరు… సీరియళ్లు అనబడే ఫిక్షన్ కేటగిరీ ఉంటుంది, నాన్-ఫిక్షన్‌లో రియాలిటీ షోలు, ఇతర ప్రోగ్రాములు ఉంటయ్… రెగ్యులర్ యాడ్స్ ఉంటయ్, స్పాన్సరర్స్ ఉంటారు… టీఆర్పీలు ఉంటయ్… ఆ కథ వేరు… దీన్నే ఓటీటీలో రిప్లికేట్ చేయాలంటే కష్టం… ఓటీటీని ప్రేక్షకుడు కూడా ఓ రెగ్యులర్ టీవీగా చూడటానికి ఇష్టపడడు…
ఇదంతా ఎందుకు అంటే..? అల్లు అరవింద్ తప్పు చేస్తున్నాడేమోనని డౌట్… తను ఆహా ఓటీటీని ఓ టీవీ చానెల్‌గా మారుస్తున్నాడు… సంకల్పం మంచిదే… పదిమంది చూస్తే మంచిదే… కానీ రెండు వేర్వేరు ట్రాకుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నాడా అనేదే ప్రశ్న… ఉదాహరణకు… ఇండియన్ ఐడల్… హిందీలో సూపర్ హిట్… కానీ ఆ ప్రోగ్రాంకు కంటిన్యుటీ ఉంటుంది… ఒక సీజన్ అయిపోతే మరో సీజన్… టీవీలో రెగ్యులర్ షో… రెగ్యులర్ ఆర్కెస్ట్రా, స్పాన్సరర్స్, జడ్జెస్, హోస్ట్స్ కనిపిస్తూ ఉంటారు…
Ads
తెలుగులో సేమ్ షో చేశారు ఆహా టీవీలో… ఇతర తెలుగు వినోద చానెళ్లలో వచ్చే పాటల పోటీ షోలకన్నా ఇది సూపర్ హిట్… పరిమిత వనరుల్లోనే అయినా సక్సెస్ చేశారు… కానీ సెకండ్ సీజన్ ఏది..? బాలయ్యతో అన్‌స్టాపబుల్ చేశారు… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… సెకండ్ సీజన్ రెండు ఎపిసోడ్లు మాత్రమే అయిపోయాయి… ఎందుకో బ్రేకులు పడ్డాయి… పరువు పోతుంది ఇలాంటివాటితోనే… ఇప్పుడు డాన్స్ ఐకాన్ చేస్తున్నారు… రమ్యకృష్ణ, శ్రీముఖి, శేఖర్ మాస్టర్, ఓంకార్ ఎట్సెట్రా కేరక్టర్లతో షో బాగా నడుస్తోంది… కానీ వాట్ నెక్స్ట్…?
ఈటీవీలో రేటింగ్స్ ఎలా ఉన్నా సరే… జబర్దస్త్ నడుస్తూనే ఉంటుంది… అది లేకపోతే చానెల్ రేటింగ్స్ లేవు, యాడ్స్ లేవు, దాంతో జబర్దస్త్‌కు తోడుగా ఎక్సట్రా జబర్దస్త్ వచ్చింది… ఇంకేదో ఒకటోరెండో అదనంగా వస్తుంటయ్, సొమ్ము చేసుకోవడమే… వావ్, క్యాష్, ఆలీతో సరదాగా, ఢీ ఇలా షోలలో కంటిన్యుటీ ఉంటుంది… ఇప్పుడు జబర్దస్త్‌కు పోటీగా అన్నట్టుగా (టీవీ రియాలిటీ షోలను చూసి వాతలు పెట్టుకోకూడదు అనేది ఓ బేసిక్ ఓటీటీ సూత్రం… అల్లు అరవింద్ దాన్ని ఉల్లంఘిస్తున్నాడు… ) కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ షో స్టార్ట్ చేయబోతున్నారు…
గుడ్, మార్కెట్‌లో బోలెడు మంది కమెడియన్లు ఉన్నారు… జీతెలుగు, స్టార్‌మా జబర్దస్త్‌కు దీటైన కామెడీ ప్రోగ్రాం చేయలేక చేతులెత్తేశాయి… కారణం, జబర్దస్త్ ఫార్మాటే నమ్ముకోవడం… అదొక దిక్కుమాలిన ఫార్మాట్… ఇప్పుడు ఆహా గనుక కాస్త కొత్తగా ప్లాన్ చేయగలిగితే బెటర్… ఎలాగూ సుడిగాలి సుధీర్ పాపులారిటీ ఉపయోగపడుతుంది… దీపికకు యాంకరింగ్ రాకపోయినా చూడబుల్ మొహం… ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ షోకు ముఖ్య ఆకర్షణ, తనకు కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ ఎక్కువే… సద్దాం బ్యాచ్ ఆల్‌రెడీ రంగంలోకి దిగినట్టుంది… కానీ ఓ సీజన్ నడిపించి ఆపేస్తే వేస్ట్… కంటిన్యుటీ ఎలా..?
కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ఫార్మాట్లలోనే జనం ఇష్టపడతారు… ఉదాహరణకు బిగ్‌బాస్… రోజుకు ఒక గంట ఎడిటెడ్ వెర్షన్ చూడటం వరకూ వోకే… కానీ ఆమధ్య ఓటీటీ స్పెషల్ సీజన్ చేశారు… 24 గంటల ప్రసారం అన్నారు… అట్టర్ ఫ్లాప్… జనం అస్సలు దేకలేదు… ఫలితంగా మళ్లీ ఈ సీజన్‌ను పాత ఫార్మాట్‌లోకి తీసుకొచ్చారు… ఇదీ డిజాస్టర్… దానికి కారణాలు వేరు… ఈటీవీలో ఢీకన్నా ఆహాలో డాన్స్ ఐకాన్ చాలా బెటర్… కానీ ఢీ వ్యూయర్‌షిపే ఎక్కువ… అలా కండిషనింగ్ జరగబడ్డారు ప్రేక్షకులు… క్యాష్, వావ్ చెత్త షోలు… కానీ జనం చూస్తున్నారు… ఏదో ఒక వినోదం, వేరే దిక్కులేదుగా…
సో, చిన్న సూచన… అరవింద్ భాయ్, ఓ వినోద చానెల్ స్టార్ట్ చేయడం బెటర్ కదా… ఎలాగూ క్రియేటివ్ టీం ఉంది కదా… సినిమాలు, సీరియళ్లు, రియాలిటీ షోలు… ఇటు ఓటీటీ కోసం, అటు టీవీ చానెల్ కోసం… సీరియస్‌లీ..!! ఓ బలమైన ఎంటర్‌టెయిన్‌మెంట్ హౌజు అరవింద్ మార్కెట్ విస్తృతిని పెంచుతుంది… గ్రిప్ పెంచుతుంది… డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ విభాగాల్లో బలమైన సిండికేట్… ఓ బలమైన హీరో, ఇంట్లోనే మరో హీరో… సొంతంగా నిర్మాణ సంస్థ… మెల్లిగా బావ నుంచి కూడా దూరం అవుతున్నట్టు సూచనలు… అలాగే…
టీవీ మార్కెట్లో బోలెడంత డబ్బుంది… ఉన్నవి మూడే వినోద చానెళ్లు… అవీ నాసిరకం… నాలుగో చానెల్ స్పేస్ అలాగే ఉంది… ఈటీవీ ఎలాగూ దెబ్బతిని మూడో ప్లేసులో కొట్టుకుంటోంది… ఒకరిద్దరు న్యూస్ చానెళ్ల ఓనర్లు కొత్త వినోద చానెల్ కోసం ట్రై చేసి, ఎందుకో వదిలేశారు… నంబర్ వన్ మాటీవీతో జీతెలుగు పోటీపడలేకపోతోంది… దిక్కుమాలిన చెత్తా సీరియళ్లు, నాన్-ఫిక్షన్ లేకపోవడం దానికి పెద్ద శాపం… ఈ స్థితిలో ఒక మంచి వినోద చానెల్‌కు స్పేస్ అయితే ఉంది… అల్లు అరవింద్‌కు సాధనసంపత్తి ఉంది… కావల్సింది సంకల్పమే…!!
Share this Article