- రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు… ఇవేకాదు, నా దగ్గర ఇంకా మస్తు స్కీమ్స్ ఉన్నయ్.., దేశమే కాదు, ప్రపంచమూ అబ్బురపడాలి, అనుసరించాలి, అగ్గి పుట్టాలె, గత్తెర లేవాలె… అని కేసీయార్ ఏదేదో మస్తు గట్టిగా ఘోషిస్తున్నాడు ఏదో మీటింగులో..! 25 ఏళ్ల క్రితమే దళితజ్యోతులు వెలిగించాడట… జనం నవ్వుతారనే సోయి లేదనేది వేరే సంగతి… తనకు చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉంది… రాజకీయంగా బలోపేతంగా కనిపిస్తున్నాడు… ప్రతిపక్షం బలహీనంగా ఉంది… సాధనసంపత్తిలో తిరుగులేదు… కానీ ఒకప్పటి పాపులారిటీ కేసీయార్ పట్ల జనంలో ఉందా..? పడిపోయిందా..? ……… ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వేలో టాప్ టెన్ సీఎం ముఖ్యమంత్రుల జాబితాలో మాత్రం కేసీయార్ పేరు లేదు… పదకొండో ప్లేసులో ఉన్న చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్‌కన్నా తక్కువ పాపులారిటీ శాతం…
- దేశంలో ఏ ముఖ్యమంత్రికీ చేతకాని రీతిలో ఏపీలో డబ్బు పంపిణీ జరుగుతోంది… అప్పోసప్పో, ఎలాగోలా తిప్పలుపడుతూ జగన్ నవరత్నాలను నడిపిస్తున్నాడు ఈరోజుకూ… కోట్ల మంది జనం ఖాతాల్లోకి డబ్బు చేరుతోంది… ప్రతిపక్షం బలహీనంగా ఉంది… చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉంది… కానీ పాపులారిటీలో జగన్ స్థానం ఎక్కడుంది..? నిజంగా ఆ నవరత్నాల వెలుగు జనంలో ఆదరణను విపరీతంగా పెంచేసిందా..? ……… ఇండియా టుడే సర్వేలో కేసీయార్ పేరులాగే టాప్ టెన్ సీఎంల జాబితాలో మాత్రం లేదు… నిజంగా 19 శాతం పాపులారిటీ దిగువకు పడిపోయాడా..? తెలుగు ముఖ్యమంత్రులకు స్వరాష్ట్రాల్లో ఆదరణ ఈ స్థాయికి జారిపోయిందా..? నిజమేనా..?
అయితే ఇక్కడ కొన్ని డౌట్లు… ఇండియాటుడే శాస్త్రీయంగానే సర్వే చేసి ఉండవచ్చుగాక… తరచూ సందర్భాన్ని బట్టి రకరకాల అంశాలతో సర్వే చేస్తూ ఉంటుంది ఆ మీడియా సంస్థ… ఆ శాంపిల్ సంఖ్య, క్రోడీకరణ, విశ్లేషణ, ప్రశ్నల తీరు తదితరాంశాల లోతుల్లోకి ఇక్కడ వెళ్లలేం… కానీ రఫ్‌గా చూస్తే ‘తేడా’ అనిపించే కొన్ని సందేహాలు మాత్రం తలెత్తుతాయి… స్టాలిన్‌కు 42 శాతం పాపులారిటీ… అసలు మొన్నమొన్ననే కదా తను సీఎం అయ్యింది… అప్పుడే జనం డిస్టింక్షన్‌లో పాస్ చేశారా..? సరే, మొన్నమొన్ననే భారీగా వోట్లేసి గెలిపించారు కాబట్టి, ఆ పాపులారిటీ హ్యాంగోవర్ ఇంకా ఉందని అనుకుందాం… నవీన్ పట్నాయక్ పాపులారిటీకి తిరుగులేదు, దానిపై మాట్లాడేదేమీ లేదు, నిజానికి పాలన కోణంలో ఫస్ట్ ప్లేస్ రావాలి… మూడో ప్లేసులోని కేరళ సీఎంకు కూడా మొన్నటి ‘రెండో గెలుపు’ హ్యాంగోవర్ పనిచేసి ఉండవచ్చు… నాలుగో ప్లేసులోని ఉద్ధవ్ ఠాక్రే తన పాలనలో పెద్దగా ఉద్దరించింది ఏముంది..? పొలిటికల్‌గా పాపులారిటీ కూడా తక్కువే కదా… అయిదో ప్లేసులోని మమతకు, ఆరో ప్లేసులో హిమంతకు మొన్నటి గెలుపులే ఇంకా పనిచేస్తూ ఉన్నాయనుకుందాం… యోగి, గెహ్లాట్‌లను వదిలేస్తే… కేజ్రీవాల్, హేమంత్ సొరెన్, భూపేష్‌లు ఇతర సీఎంలతో పోలిస్తే పెద్దగా వర్క్ చేసినట్టు కనిపించదు… (సీఎంల పాపులారిటీకి సంబంధించి వారి వారి స్వరాష్ట్రాల వోటర్లనే పరిగణనలోకి తీసుకున్నారు…) ఇది కాసేపు పక్కన పెడితే…
Ads
ఈ సర్వేలో విస్మయకరంగా అనిపించిన అంశం ఒకటుంది… దేశానికి తదుపరి ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్నకు 24 శాతం మంది మాత్రమే మోడీ పేరు చెప్పారు… సరిగ్గా ఏడాది క్రితం ఇది 66 శాతం… ఈ ఏడాదిలో వేక్సిన్ పాలసీ, కరోనా హ్యాండ్లింగ్, పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు, ఆత్మనిర్భర్ గట్రా చాలా అంశాల్లో మోడీ ఫెయిల్యూర్లు చాలా ఉన్నయ్… కానీ మరీ 66 నుంచి 24 శాతానికి పడిపోయిందా..? అంత వేగంగా..? ఇదీ నమ్మబుల్‌గా లేదు… అకస్మాత్తుగా కేజ్రీవాల్ ప్రధాని కావాలనే వాళ్ల సంఖ్య 3 నుంచి 8 శాతానికి, మమతా బెనర్జీ పట్ల సానుకూలత 2 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది… నమ్మొచ్చా..? రాహుల్, సోనియా, ప్రియాంక పాపులారిటీ కాస్త అటూఇటూ ఏడాదిక్రితంలాగే ఉంది… కానీ యోగి పట్ల సానుకూలత 3 నుంచి 11 శాతానికి పెరిగింది… ఇంత అనూహ్యమైన తేడా ఎలా సాధ్యం..? ఈ సందేహం రావడానికి మరో కారణం ఉంది… ఏమిటంటే..? ఒకసారి దిగువన రెండు టేబుల్స్ చూడండి…
ఫస్ట్ చార్ట్‌లో యోగీ ప్రధాని కావాలనుకునే వారు 3 శాతం నుంచి 11 శాతానికి పెరిగారు… రాహుల్‌కన్నా ఎక్కువ శాతం… మరోవైపు సీఎం పాపులారిటీ చార్ట్ చూస్తేనేమో జస్ట్, 29 శాతం… బీజేపీలో ఎవరు మంచి ప్రధాని అభ్యర్థి అనడిగితే మాత్రం కేవలం 19 శాతం మొగ్గుచూపించారు… అదీ గత ఏడాదికన్నా తక్కువ… అమిత్ షా పట్ల మొగ్గు కనిపిస్తోంది… ఫస్ట్ చార్ట్‌లో అమిత్ షా పేరే లేదు… రెండో చార్ట్‌లో మాత్రం ఫస్ట్ ప్లేస్… నిజంగానే జాతీయ స్థాయిలో యోగికి పాపులారిటీ పెరుగుతోంది, మోడీ తరువాత తనే ప్రధాని కావాలని జనం కోరుకుంటున్నారు అనుకుందాం… అది ఈ సెకండ్ చార్ట్‌లో రిఫ్లెక్ట్ కావాలి కదా… ఏమోనబ్బా… ఈ సర్వేలన్నీ తప్పులతడకలు, సందేహాలకుప్పలు అనిపిస్తున్నాయి అంటారా..? అవును, అక్కడక్కడా అలాగే అనిపించేలా ఉంది..!!
Share this Article