‘‘ఎందువల్లనైనా’’ దర్శకుడికి సరే కోపం వస్తే… హీరోకు కోపమొస్తే… పోనీ, హీరో కొడుక్కి కోపమొస్తే… నిర్మాతకే నచ్చకపోతే… ఏం జరుగుతుంది..? చెప్పినట్టు వినని హీరోయిన్‌కు కత్తెర పడుతుంది… సీన్స్ పడిపోతయ్… పేమెంట్స్ చిక్కుల్లో పడతయ్… మౌత్ పబ్లిసిటీతో తొక్కేస్తారు… కొత్త చాన్సులు రానివ్వరు… అసలు ఇండస్ట్రీ అంటేనే అది కదా… మరీ కోపమొస్తే మొత్తం ఆమెను సినిమాలో కనిపించకుండా, ఆమె సీన్లన్నీ తీసిపారేస్తారు… అవును మరి, ఎంత పేరున్న హీరోయిన్ అయినా సరే..!!
మహాన్ అనే ఓ తమిళ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు… ఎప్పటిలాగే హడావుడిగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా డబ్ చేసేసి వదిలారు… ఈ సినిమా రివ్యూ ఏమిటో తరువాత చూద్దాం గానీ… ఎప్పటి నుంచో వాణి భోజన్ సినిమాలో ఉన్నట్టు పోస్టర్లు కనిపించాయి… వార్తలు కూడా వినిపించాయి… తీరా సినిమా చూస్తే ఆమె లేదు… కనిపించలేదు… మొత్తం సీన్లనే తీసిపారేశారు… అలా తీసేసిన ప్రభావం కథపై లేదా కథనంపై పడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేశారు…
Ads
ఐనా సినిమాలో కథేం ఉందని..? అయ్యాకొడుకుల యాక్షన్లు, రెచ్చిపోయిన ఓవరాక్షన్లు తప్ప..! వాణి భోజన్ విషయానికి వద్దాం… మొత్తానికే సినిమా నుంచి ఆమె సీన్లను తీసిపారేయడం అనేది సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైమ్ కావచ్చు… దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, హీరో విక్రమ్ రికార్డు సృష్టించారు… సినిమాలో సిమ్రాన్ ఉంటుంది కానీ ఆమె మరీ ఏజ్ బార్, పైగా ఆ పాత్రకు మరీ ఓవరాక్షన్ అద్దారు… సో, సినిమాలో ‘ఆడకళ’ లేకుండా పోయింది…
‘‘ఇప్పటికే రెండు గంటల నలభై నిమిషాలు ఉంది సినిమా… తమిళ, మలయాళ వెర్షన్లలో ఏడు పాటలు, 24 నిమిషాలు పాటలే… అవేమో సరిగ్గా రాలేదు… దాంతో తెలుగు, కన్నడ వెర్షన్లలో మూడేసి పాటల్ని తీసిపారేశారు… ఐనా ఇది మరీ లెంథీ… దీంతో విధిలేక అంతకుముందే తీసిన వాణి భోజన్ తాలూకు సీన్లన్నీ ఎత్తిపారేశారు… తప్పలేదు’’ అని ఓ సమర్థన తమిళ సైట్లలో కనిపిస్తోంది… అదే గనుక నిజమైతే ఆ దర్శకుడు, ఆ ఎడిటర్ తమ వృత్తులకు పనికిరారు అన్నమాట… (ఇలా తీసేయబడిన పాటల్లో విక్రమ్ కొడుకు సొంతంగా రాసి, పాడిన మిస్సింగ్ మి పాట కూడా ఉంది)
సీన్లు రాసుకున్నప్పుడు తెలియదా, ఉజ్జాయింపుగా సినిమా నిడివి ఎంత వస్తుందో..! కాస్త అటూఇటూ చివరి ఔట్‌పుట్ ఉంటుంది… సరే, హీరోయిన్‌ను తీసిపారేసినా సరే, 2.40 గంటల సినిమా వచ్చిందీ అంటే… కథ మీద, కథనం మీద, ఎడిటింగ్ మీద, ప్లానింగ్ మీద, దేని మీదనైనా సరే సినిమా టీంకు కంట్రోల్ లేనట్టు లెక్క… పోనీ, వాణి భోజన్ మీద ఏమైనా కోపమొచ్చిందా సినిమా టీంలో ముఖ్యులకు..?! లేకపోతే మొత్తమే లేపేయడం ఏమిటి..? మహాభారతం సినిమా తీస్తూ, లెంథ్ ఎక్కువైందని ద్రౌపది పాత్రనే కత్తిరించిపారేసినట్టు..!!
వాణి అనామకురాలు ఏమీ కాదు… 2010 నుంచీ ఫీల్డ్‌లో ఉంది, టీవీల్లో చేసేది… తెలుగులో కూడా ప్రేమ, మీకుమాత్రమే చెప్తా సినిమాల్లో చేసింది… ఒక దశలో బుల్లితెర నయనతార అని పేరు తెచ్చుకున్నా సరే, పెద్ద తెరపై బాగా స్ట్రగులైంది… మహాన్ టీం ఇప్పుడు ఆమెను కత్తిరించవచ్చుగాక… కారణాలు ఏవైనా గానీ, ఇప్పటికిప్పుడు ఆమెకు నష్టమేమీ లేదు… నాలుగు సినిమాలు కంప్లీట్ చేసి, రిలీజ్‌కు రెడీగా ఉన్నయ్ ఆమెవి… మరో మూడు సినిమాలో నిర్మాణంలో ఉన్నయ్… సీన్లన్నీ కత్తిరించి లేపేసినా సరే, ఫాఫం, మర్యాదగా సినిమా టైటిళ్లలో ఆమెకు థాంక్స్ చెప్పారండోయ్… ఈ మూవీ సీక్వెల్ లో ఉంటుందట… హహహ, అసలు సీక్వెల్ అంటూ వస్తే కదా..!! అవునూ, కార్తీక సుబ్బరాజుకు ఆమె మీద అంత కోపం ఎందుకు వచ్చింది..? మిస్టరీ…!!
Share this Article