నిన్న మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లోక్ అదాలత్‌ల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, ఎక్కడో మాట్లాడుతూ ప్రజలు కోర్టు వ్యవహారాలతో విసిగిపోయి, సెటిల్మెంట్ కోరుకుంటున్నారని అన్నారు… కరెక్ట్… నిజం, మన న్యాయవ్యవస్థలోని అపెక్స్ కోర్టు దీన్నే సరిదిద్దాల్సి ఉంది… మన న్యాయవ్యవస్థ పనితీరులో లోపాల వెల్లడికి మచ్చుకు ఓ కేసు… నిఖార్సయిన ఉదాహరణ…
తెలంగాణ… పాత మెదక్ జిల్లా… దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి గ్రామం… 2013,ఫిబ్రవరిలో గుండెల పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు… నేరారోపణ ఏమిటంటే… కన్నతల్లిని పోచయ్య పోషించలేక టవల్‌తో చెట్టుకు ఉరివేసి చంపాడట… సిద్దిపేట కోర్టు 2015 జనవరిలో తనకు యావజ్జీవం విధించింది… ఇక్కడ ఈ కేసులో ట్విస్టులు మొదలు…
పోచయ్య తరఫున చిన్నకొడుకు దావిద్ హైకోర్టులో అప్పీల్ చేశాడు… బెయిల్ పిటిషన్ వేశాడు, కానీ హైకోర్టు దాన్ని కొట్టేసింది… తరువాత 2018లో పెరోల్ దరఖాస్తు… కోర్టు పెరోల్ ఇచ్చింది… కానీ ఇక్కడ విషాదం ఏమిటంటే… పెరోల్ మీద బయటికి రావల్సిన ముందు రోజే పోచయ్య మరణించాడు…!!
Ads
గుండెపోటు మరణం అని జైలు అధికారులు చెప్పారు, కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు… ఆరేళ్లు గడిచిపోయాయి… హైకోర్టులో పోచయ్య తరఫున ఉన్న ఆ అప్పీల్ పిటిషన్ అలాగే ఉండిపోయింది… పదేళ్లు దాటిన కేసుల తక్షణ పరిష్కారం పేరిట ఈమధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టారని వార్త… పోచయ్య కేసులో ట్రయల్ కోర్టు కేవలం స్వీయ నేరాంగీకార ప్రకటన (?) ఆధారంగా, సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా యావజ్జీవం వేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది…
మరి విడుదల కావడానికి పోచయ్య ఉంటే కదా..! తను మరణించిన సమాచారం కూడా జైలు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు లేదు… అది హత్యో ఆత్మహత్యో కూడా పోస్ట్‌మార్టం రిపోర్ట్ స్పష్టంగా తేల్చలేదు… పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు తను వినిపించాడు… హైకోర్టు విని, ట్రయల్ కోర్టు తీర్పును వ్యతిరేకించి, పోచయ్య నిర్దోషి అని తేల్చింది…
అరెస్టు నుంచి ఈ పదకొండేళ్లలో పోచయ్య కేసు పురో‘గతి’ ఇదీ… అదే జైలులో దోషిగా శిక్ష అనుభవిస్తూ, అదే వేదనతో మరణించి, చివరకు ఆ తరువాత ఆరేళ్లకు మరణానంతర నిర్దోషిగా తేల్చబడటం ఎవరి పాపం..? అసలు ఈ వార్తకు చాలా ప్రాధాన్యం ఉంది… క్రైమ్, లీగల్, హ్యూమన్ ఇంట్రస్ట్ కోణాల్లో వార్తాప్రాధాన్యం ఉంది…
(నిజానికి ఇందులో హైకోర్టు తీర్పు బాగుంది… సరే, ట్రయల్ కోర్టు లీగల్‌గా సరిగ్గా వ్యవహరించలేకపోవచ్చు, అలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఒక కోర్టు తీర్పుకూ ఎగువ కోర్టు తీర్పుకూ నడుమ తేడా ఉండొచ్చు, అదీ సహజమే… కానీ తను మరణించిన సమాచారమూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అందకపోవడం, ఆ కేసు అలాగే ఉండిపోయి, విచారణ కూడా జరిగి, తీర్పు వెలువడటమే అసలు వార్తాంశం…)
నిన్న ఈనాడులో మామూలుగా (తెలంగాణ ఎడిషన్) ఫస్ట్ పేజీలో ఒక వార్త రాశారు… హైకోర్టు ఇన్నేళ్ల తరువాత తనను నిర్దోషిగా ప్రకటించిందీ అని… ఆ వార్త రిపోర్ట్ చేసే సమయానికి, ఆ వార్త రాసిన రిపోర్టర్‌కు కూడా పోచయ్య ఆల్రెడీ మరణించాడనే విషయం తెలిసి ఉండకపోవచ్చు… ఆ వార్త వచ్చాక సదరు పోచయ్య కుటుంబం ఉండే ఏరియా రిపోర్టర్ అసలు విషయం ఇదీ అని సమాచారం ఇచ్చాడేమో… నిన్నటి వార్త, ఈ మరణం విషయమూ కలిపి మళ్లీ ఓ వార్త ఇంట్రస్టుగా రాసి ఈరోజు పబ్లిష్ చేశారు…
ఈనాడు టీం వర్క్‌ను మెచ్చుకునేది ఇందుకే… ఈరోజుకూ ఈనాడుకు ఇదే బలం… ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా కనిపించింది ఈ వార్త… పర్లేదు, వివరంగా రాయలేకపోయింది, కానీ వార్త మిస్ కాలేదు… మెయిన్ పేజీలోనే వేసింది… మిగతా చిన్నాచితకా ఎవరూ చదవని పత్రికల్ని వదిలేయండి… మరి సాక్షి..? ఫాఫం, ఈరోజు మెయిన్ పేజీలు అన్నీ నాలుగైదుసార్లు వెతికినా కనిపించలేదు… (ఎక్కడైనా మరీ చిన్నగా కనీకనిపించనట్టు ఏమైనా వేశారేమో, జిల్లా పేజీల్లో రాసుకున్నారేమో తెలియదు…)
సర్, జగన్ సర్… రెవిన్యూ పెంచడానికి, సర్క్యులేషన్ పెంచడానికి ఎన్నెన్నో రకాలుగా తమరు ప్రయత్నించారు గానీ… ఇదుగో సాక్షి ఈరోజుకూ ఈనాడును ఎందుకు కొట్టలేకపోయిందో అర్థమవుతోందా..? సరైన సమయంలో సరైన రీతిలో స్పందించే ప్రొఫెషనలిజం కొరవడినందున… సారీ టు సే… ఇది రియాలిటీ..!
Share this Article