ఐదారేళ్ల క్రితం… కేసీయార్ తన మేనల్లుడు హరీష్ రావును పూర్తిగా దూరం పెట్టేశాడు… ఒక దశలో హరీష్ ఇక పార్టీలో ఉంటాడా లేదా అనే చర్చ సాగింది… సీన్ కట్ చేస్తే… ఇప్పుడు అంతా హరీష్ రావే నడిపిస్తున్నాడు పార్టీని… తనే పార్టీ అధినేత అన్నట్టుగా మొత్తం కార్యక్రమాలన్నీ తన చేతుల్లోకి తెచ్చేసుకున్నాడు…
బీఆర్ఎస్ భావి అధినేత, కేసీయార్ రాజకీయ వారసుడు, కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకున్న కేటీయార్ రాష్ట్రంలోనే లేడు ఇప్పుడు… ఎక్కడో ఉండి ట్వీట్లు వదులుతున్నాడు… కేసీయార్ అసలు తెర మీదే లేడు… హఠాత్తుగా రోజుల తరబడీ మాయం అయిపోవడం తనకు అలవాటే కదా… అయిపూజాడా లేడు…
ఆమధ్య ఏదో నవగ్రహయాగం చేయించాడు ఫామ్ హౌజులో అన్నారు… జైలు నుంచి విడుదలైన కవిత కూడా అక్కడే పదిరోజులు ఉంటుందనీ అన్నారు… ఒకవైపు గాంధీ వర్సెస్ కౌశిక్ వివాదం రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలించగా… పార్టీ అధినేత కేసీయార్ కిమ్మనడం లేదు… అంతెందుకు, ఖమ్మం జిల్లా వరదలు జనాన్ని తీవ్ర అవస్థల పాలు చేస్తే, అప్పుడూ కేసీయార్ సైలెంట్… ఏ స్పందనా లేదు… నాపై కుట్ర చేసిన వాళ్ల సంగతి చూస్తాను అని పలికిన కవిత కూడా సైలెంట్…
Ads
ప్రతిపక్షనేతగా నీకు జీతం ఇస్తున్నాం అని రేవంత్ గుర్తుచేసినా సరే… ఉలుకు లేదు, పలుకు లేదు… ఓసారి అసెంబ్లీకి వచ్చి ఖండఖండాలుగా నరుకుతాం అన్నట్టుగా ఏదో అన్నాడు మీడియా పాయింట్‌లో… రెండుమూడు రోజులపాటు ఫామ్ హౌజులోనే సర్వదర్శనం స్కీమ్ పెట్టి అందరికీ దర్శనమిచ్చాడు… బస్, ఖతమ్… మళ్లీ జాడాపత్తా లేడు…
తెలంగాణ కోసం పోరాడితివి, తొమ్మిదినరేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తివి… ఒక దశలో ప్రధాని కావాలనీ కలలు గంటివి… బంగారు తెలంగాణ అంటివి… ఏమైంది..? తెలంగాణ జనం అవస్థల్లో ఉన్నప్పుడూ మాట్లాడవు… వర్తమాన రాజకీయాలపైనా మాట్లాడవు… నువ్వు టికెట్టిచ్చిన కౌశికుడే తొడగొట్టి ఆంధ్రోళ్ల మీద ఉరుముతున్నాడు… ఎమ్మెల్యే గాంధీని ఎక్కడి నుంచి వచ్చినవ్ అనడగుతున్నాడు… నగరంలో రాజకీయ ఉద్రిక్తతలు… హౌజ్ అరెస్టులు, ఆంక్షలు, సవాళ్లు… అధినేత ఏడీ..?
అంటే… పార్టీ మళ్లీ ‘జాగో- బాగో’ నినాదాన్ని తలకెత్తుకుంటోందా..? ఇది కౌశికుడి సొంతమా, లేక పార్టీ మారిన విధానమా..? పాత సెంటిమెంట్ రగిల్చే వ్యూహమా..? సో, సెటిలర్లు పునరాలోచనలో పడాల్సిందేనా..? క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు..? హరీష్ రావేనా..? తను కూడా మాట్లాడటం లేదు… నడవండి, కదలండి, వేలాదిగా రండి, ముట్టడిద్దాం అనే పిలుపుల్లో పడి… రేవంత్ సర్కారును ఇంకా ఎలా గోకాలో ఆలోచిస్తూ… ఆంధ్రా-తెలంగాణ ప్రాంతీయతపై మళ్లీ వస్తున్న వ్యాఖ్యల మీద మాత్రం మాట్లాడడు…
అవును, నిజంగానే కేసీయార్ ఎక్కడున్నాడు..? ఎందుకు అదృశ్యంగా ఉండిపోతున్నాడు..? కారణాలనైనా, కనీసం పార్టీ కేడర్‌కైనా చెప్పాలి కదా… అబ్బే, కౌశిక్- గాంధీ ఇష్యూ చాలా చిన్నది, దానికి కేసీయార్ అక్కర్లేదు, హరీష్ చాలు అంటారా..? పోనీ, అదయినా చెప్పండి… హరీష్ రావు మాటే వినండి, తనే మార్గనిర్దేశకుడు అని చెప్పండి… ప్రస్తుతానికి, కేటీయార్ వచ్చేదాకా..!! రేవంత్ ప్రభుత్వ పలు నిర్ణయాల మీద ప్రజల్లో అసంతృప్తి మొదలవుతోంది… హైడ్రా దూకుడు మీద భిన్నాభిప్రాయాలు… ప్రతిపక్షనేతగా ప్రభుత్వ విధానాల మీద స్పందించాలి కదా…!!
Share this Article