పృథివి కలవాడి పృష్ఠంబు పుండయిన జగతి వార్తకెక్కు- అని ఒక ప్రమాణం. అంటే బాగా డబ్బున్నవాడి పిర్ర మీద చిన్న పుండు లేచినా అది ప్రపంచానికి అతి పెద్ద వార్త అవుతుందట. అలాంటిది బాగా డబ్బున్నవారి ప్రపంచ హోదా, ర్యాంకింగ్, స్థాయి, సంపద విలువ, ఎవరికంటే ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అన్న వార్త సకల వార్తలకు తాతలాంటి వార్త అయి తీరుతుంది. వేదాంతులకు కళ్లముందు స్పష్టంగా కనిపించే ఈ ప్రపంచమంతా ఒట్టి మిథ్య. మాయ. పుట్టినదేదయినా నశించేదే. భౌతికవాదులకు కళ్ల ముందు కనిపించేదంతా ఉన్నట్లే. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గ్లోబ్ రబ్బరు బొమ్మను కాలితో తంతూ భూగోళాన్ని ఫుట్ బల్ లా ఆడుకుంటున్నట్లు ఆనందించేవాడని “ది గ్రేట్ డిక్టేటర్” సినిమాలో చార్లీ చాప్లిన్ ఎగతాళిగా చూపించాడు. అలా అత్యంత సంపన్నులకు ఈ భూగోళం కాలితో ఆడుకునే ఒక బంతి. వారు నిలుచోమంటే ప్రపంచం నిలుచుంటుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. ప్రభుత్వాలు వారు చెప్పినట్లు వింటుంటాయి. వారి ఇంట్లో పులి పిల్లి. వారి పెరట్లో పిల్లి పులి. మన గుమ్మం ముందు సైకిల్, స్కూటర్ పార్క్ చేసినట్లు వారి కోసం హెలి క్యాప్టర్ రెక్కల పక్షులు, విమానాలు పార్కింగుల్లో ఎదురు చూస్తుంటాయి. ఏ పార్టీలు అధికారంలో ఉన్నా వారిచ్చే పార్టీల్లో ముందువరుసలో వినయంగా ఒదిగి ఉంటాయి. దేశాధ్యక్షులు, ప్రధానులను వారు భుజం తట్టి ప్రోత్సహించాల్సి వస్తుంది. వారి పిల్లలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో చదివి తప్పనిసరిగా వ్యాపారమే చేస్తూ సర్దుకుపోవాల్సి వస్తుంది.
డబ్బు డబ్బును ప్రేమిస్తుంది. డబ్బు డబ్బును సంపాదిస్తుంది. డబ్బు దబ్బున పేరు తెస్తుంది. డబ్బుకు లోకం దాసోహం. డబ్బే జీవిత పరమావధి. పైసామే పరమాత్మ. ధనమేరా అన్నిటికి మూలం. సిరిగలవానికే చెల్లున్. కలవారి వైభోగం. కలవారి పెళ్లి లోకానికే పెళ్లి. కలవారి కష్టం లోకానికే నష్టం. ప్రపంచ కుబేరుల్లో భారతీయులున్నారు. ఆ ప్రపంచ కుబేరుల్లో తెలుగువారున్నారు. ఇది తెలుగువారికి గర్వకారణం. అది కూడా ఒకరు, ఇద్దరు కాదు. ఏకంగా పది మంది. ఇంకా వందమంది ఉండి ఉండాలి. ఐటీ లో లెక్క చూపని బ్లాక్ నలుపు వల్ల ఈ లిస్ట్ లో వారు బ్లాక్ అయి ఉంటారు. బ్యాంకులకే హీనపక్షం అయిదువేల కోట్లకు సున్నాలు వేసినవారు మనదగ్గర వీధికొకరు లేరా? ఆ లెక్కన మొత్తం ప్రపంచ బ్యాంకులకు మన తెలుగువారు వేసిన సున్నాలు, కన్నాలు, నలుపును కూడా తెలుపుగా పరిగణిస్తే- అయిదు వందల పేర్లు అయిదు నిముషాల్లో సిద్ధమవుతాయి. తాజాగా విడుదలయిన ప్రపంచ కుబేరుల లిస్టులో కొన్ని అసమానతలున్నాయి. కొందరికి అన్యాయం జరిగింది. కొందరికి అర్హత ఉన్నా చిల్లర మల్లర సాంకేతిక కారణాలతో చోటు దొరకకపోవడం యావత్ తెలుగు ప్రజలకు జరిగిన ఘోరమయిన అవమానం. తప్పదు దీనికి భారీ మూల్యం!………… By….. -పమిడికాల్వ మధుసూదన్
Ads
Share this Article