Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ డీఎస్పీ నళిని గుర్తుంది కదా…! ఇప్పుడామె ఏం చేస్తోంది..? ఇంట్రస్టింగ్ ఛేంజ్..!!

December 12, 2023 by M S R

2012… తెలంగాణ ఉద్యమకాలం… ఈమె గుర్తుందా..? నళిని… ఏకంగా తన డీఎస్పీ కొలువునే వదిలేసింది… తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్లపై లాఠీని ఝలిపించలేేనని, తూటాల్ని ఎక్కు పెట్టలేనని చెబుతూ తన ఉద్యోగాన్నే త్యాగం చేసింది… 2003లో కాకతీయ యూనివర్శిటీలో తనకు బీఎడ్ క్లాస్‌మేట్ అని ఓ మిత్రుడు గుర్తుచేసుకున్నాడు ఫేస్‌బుక్‌లో… మేర (దర్జీ) కులస్థురాలు… బీసీ… అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు… ఢిల్లీలో దీక్ష చేసింది… రెండుసార్లు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది…

మరి ఇన్నాళ్లూ ఏమైపోయింది..? అయిపూజాడా లేదు… ఆమె గురించి ఎవరికీ తెలియదు… సదరు ఉద్యమ పార్టీ ప్రభుత్వం కూలిపోయాక ఇప్పుడు అందరి విజ్ఞప్తులూ వెల్లువెత్తుతున్నయ్… ఆమెకు మళ్లీ కొలువు ఇవ్వండి అంటూ… సీఎం రేవంత్‌రెడ్డి పేరిట అభ్యర్థనలు కనిపిస్తున్నయ్… నిజమే కదా… తెలంగాణ పేరిట ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు, అనర్హులు సైతం… తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసిన శక్తులూ తెలంగాణలో అధికారాన్ని అనుభవించినయ్… మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన ఆమెకు న్యాయం ఎందుకు జరగలేదు అనిపించింది…

May be an image of 1 person and smiling

Ads

అనుకోకుండా ఓ మిత్రుడి వాల్ మీద దోమకొండ నళిని పేరిట ఓ షేర్ కనిపించింది.,. అందులో ఆమె తన మనసులో మాట చెప్పుకుంది… ఆసక్తికరం అనిపించింది… నిజంగా ఆ ప్రొఫైల్ ఆమేదేనా అనే డౌట్‌తో ఆమె వాల్ మీదకు వెళ్లి చెక్ చేస్తే ఆమె కంప్లీట్‌గా ఓ భిన్నమైన ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్టు ఫోటోలు, పోస్టులు, వీడియోలు కనిపించాయి… సో, అది ఆమె వాల్ అనే భావించి, ఆ పోస్టును ఇక్కడ షేర్ చేస్తున్నాను… ఒక డీఎస్పీ, ఒక తెలంగాణ ఉద్యమకారిణి ఇప్పుడేం చేస్తుందనే ఆసక్తికి సమాధానం ఇది… ఆమె మాటల్లోనే…



నళిని
Domakonda Nalini

నా మనసులో మాట

నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ ల ద్వారా అర్థం అవుతుంది. చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొందరు జర్నలిస్ట్ లు బైట్ కావాలి అని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మ గా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను.

ఉద్యమ సమయంలో నన్ను 4.12.2011 న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్ల లో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలేట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీ లో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నిక లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరిని కలవలేదు. ఎపుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు. నా రాజీనామాను విత్ డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడెన్ గా వార్తల్లోకి ఎలా వచ్చాను? ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది ? ఆశ్చర్యంగా ఉంది.

ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు.ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది . చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్ ను కూడా నేను కోల్పోయాను .

ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లైతే, పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హై కోర్ట్ లో పిల్ వేస్తే నా నియామకం రద్దు అవచ్చు కూడా. కొరివితో తల గోక్కున్నట్లు అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో , 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గురుతే. అందుకే నేను ఉద్యోగం అడగను. కాని బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవ చేస్తూనే ఉంటాను.

త్యాగి నుండి యోగినీ అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్న. ఇప్పుడు తపస్వి నై, నిత్యాగ్నిహోత్రి ని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న. ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే ఇప్పుడు నాలో దైవ భక్తి  ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా!! అలాగే ఆకలి వేయనిదే ఎవరు కూడా అన్నం కావాలి అని అడగరు…



పలువురు మహిళలు సనాతన సంప్రదాయ పద్ధతిలో… (అంటే, ప్రస్తుతం మనం చూస్తున్న పద్ధతిలో కర్మలు, అర్చనలు, పౌరోహిత్యాలు జరిపించే పూజారులకు భిన్నంగా)… హోమాలు, యాగాలు జరిపిస్తున్నారు… ఇళ్లకు కూడా వస్తారు… పెళ్లిళ్లు కూడా జరిపిస్తారు… అవసరమైన సామగ్రి, సరంజామా కూడా వాళ్లే తెస్తారు… బాగానే పాపులర్ అవుతున్నారు… నళిని కూడా అదే బాటలో ఉన్నట్టు కనిపిస్తోంది… ఆల్ ది బెస్ట్ అమ్మా… 

 


ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన నళిని మెట్టినిల్లు వరంగల్‌ జిల్లా. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నళినికి జిల్లాలోని ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్‌తో వివాహం జరిగింది. నరేందర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కాగా, ఈయన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వద్ద అప్పట్లో పీఏగా పనిచేశారు. ఎంకాం, బీఈడీ, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్‌ ఫార్మసీ పూర్తి చేసిన నళిని 2006లో పరకాలలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందారు.

అనంతరం 2007 గ్రూప్‌-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. అప్పాలో శిక్షణ పొందిన నళిని కొద్దిరోజులు మామునూరు ఫోర్త్‌ బెటాలియన్‌లో శిక్షణ పొందారు. నళిని డీఎస్పీగా హన్మకొండ, హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్లలో మూడు వారాలపాటు ప్రొబేషనరీ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెను కరీంనగర్‌ డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కొద్ది రోజులకే నళిని మెదక్‌ డీఎస్పీగా బదిలీ అయ్యారు. మెదక్‌ డీఎస్పీగా కొనసాగుతున్నప్పుడే ఆమె తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, పోలీసు శాఖలో ఆంధ్ర అధికారుల నిరంకుశ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించారు… (ఇదీ ఆమె నేపథ్యం)


Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions