పండుగ ఎన్నడు..? ఈ ప్రశ్న దాదాపు ప్రతి పండుగకూ వస్తోంది… భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి… పండుగ తిథిని సరిగ్గా ఖరారు చేయడానికి ఓ కామన్ సూత్రం లేదు… పండితులుగా ప్రఖ్యాతి గాంచినవాళ్లు తలా ఓ సూత్రం చెప్పి సామాన్య ప్రజల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నారు… తాజాగా దసరా ఎన్నడు అనే ప్రశ్న రాష్ట్రంలోని పండితుల నడుమ చర్చకు దారితీసింది… 23న జరుపుకోవాలని కొందరు, 24న శ్రేయస్కరం అని మరికొందరు… ఎందుకీ సందిగ్ధత..? ఎందుకీ ద్వైదీభావం..?
ఇలాంటి సందిగ్ధతలు, ప్రశ్నలు, సందేహాలు తలెత్తినప్పుడు తెలంగాణ విద్వత్సభ ముందుకొస్తోంది… తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంది… అందరూ దాన్ని ఆమోదించాలని ఏమీ లేదు… ఆ నిర్ణయాల్ని తమదైన సిద్ధాంతాలతో విబేధించేవాళ్లు బోలెడు మంది… ఒక్కొక్కరు గణించే పద్థతి ఒక్కోరకంగా ఉంటుంది… సహజం… ఈ నేపథ్యంలో సగటు మనిషికి సరైన డైరెక్షన్ కరువవుతోంది…
విద్వత్సభ 23న దసరా జరుపుకోవాలీ అంటోంది… ఎందుకంటే..? 23న అపరాహ్ణం, సూర్యాస్తమయ కాలంలో శ్రవణా నక్షత్ర యుక్త దశమి తిథి వ్యాప్తి ఉన్నందున 23న పండుగ జరుపుకోవడమే మేలు అంటోంది… సరే, ఇదొక పద్ధతి… నిజానికి చాలామంది పూర్వ పద్ధతినీ, మరికొందరు దృక్ పద్ధతినీ గణిస్తుంటారు… సరే, ఎవరి పద్ధతి వాళ్లది… కానీ ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి…
Ads
సాధారణంగా జనం నమ్మేది ఏమిటంటే…? సూర్యోదయం వేళ ఏ తిథి అంటే దాన్నే పాటిస్తుంటారు… లేదా రోజులో అధికభాగం ఏ తిథి వ్యాప్తి ఉంటే దాన్నే పాటించడం ఆనవాయితీ… కానీ విద్వత్సభ శ్రవణా నక్షత్ర యుక్త దశమి 23న ఉంటుంది కాబట్టి అదేరోజు పండుగ శ్రేష్టం, శ్రేయస్కరం అంటోంది… కానీ ఆరోజు నవమి… దాదాపు సాయంత్రం వరకూ నవమే… మరి రోజులో అధికభాగం నవమి అనే తిథి వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు దాన్ని దశమిలా ఎలా జరుపుకోవాలి..?
ఇది సరే… మరి సద్దుల బతుకమ్మ ఎన్నడు..? 23న నవమి తిథి వ్యాప్తి అధికంగా ఉంది కాబట్టి అదే రోజు సద్దుల బతుకమ్మ, దసరా రెండూ జరుపుకోవాలా..? సాధ్యమేనా..? శాస్త్రోక్తమేనా..? ఒక్కసారి ఇది చూడండి… 23న మహార్నవమి, 24న విజయదశమి అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది… ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అంటారా..?
భారతీయ కేంద్ర వాతావరణ శాఖలోనే ఆస్ట్రానమీ విభాగం కూడా ఉంటుంది… (Ministry of Earth Sciences)… నెహ్రూ కాలంలోనే ఏర్పాటు చేశారు… పండుగల సందేహాలు, సంక్లిష్టతలు, సందిగ్ధతలు తలెత్తుతున్నందున… గ్రహగతులు గణించి ఏ పండుగ ఎన్నడో, ఏ తిథి ఏ తారీఖున ఎలా ఉంటుందో ఆ విభాగం రూపొందించింది… పైన చెప్పిన గ్రహగతుల పంచాంగం అదే… దేశం మొత్తానికీ వర్తించే పద్ధతి ఇది… అందరూ దీన్ని ప్రామాణికంగా కూడా తీసుకుంటారు…
23న ఉదయం నవమి ఉంటుంది… 24న ఉదయం దశమి ఉంటుంది… పండుగ అంటే కొత్త బట్టలు, శమీ వృక్షం దగ్గరకు చేరిక, గుళ్ల సందర్శన, బంధుమిత్రులకు శమీ (జమ్మి) పెట్టి అలుముకోవడాలు, దండాలు పెట్టడం… అవన్నీ ఉదయం- మధ్యాహ్నం పూటే… మరి 23న పండుగ జరుపుకోమంటే ఆరోజు పొద్దున ఉండేది నవమి కదా… నవమి రోజున దశమి జరుపుకోవడం ఏమిటి..? ఇదీ సగటు మనిషి సందేహం… పోనీ, రోజులో దశమి తిథి వ్యాప్తి ఎక్కువగా ఉండేది కూడా 24నాడే కదా… మరి 23న పండుగ ఏమిటి..? హేమిటో…!!
Share this Article