తెలంగాణ ఏర్పడే నాటికి అప్పు దాదాపు 70 వేల కోట్లు అయితే… ఈ పదేళ్లలో రాష్ట్రాన్ని కుప్పకుప్ప చేసిన కేసీయార్ ప్రభుత్వం ఈ అప్పులను 6.7 లక్షల కోట్లకు తీసుకుపోయింది… అత్యంత అరాచకం… ఆర్థిక నిర్వహణలో అత్యంత అధ్వానం… ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన శ్వేతపత్రం అదే చెబుతోంది… అవి అధికారిక గణాంకాలే కాబట్టి ఇక బీఆర్ఎస్ మాట్లాడటానికి ఏమీ లేదు…
అప్పులు తెచ్చాం సరే, ఆస్తులు పెంచలేదా అనే ఓ పిచ్చి తర్కాన్ని ముందు పెడతారు… ఏమున్నయ్..? కాళేశ్వరమా..? ఇసుకలో దస్కి, అంటే కుంగిపోయి మన బంగారు తెలంగాణను వెక్కిరిస్తోంది… అదేనా..? కేసీయార్ అనబడే నయా విశ్వేశ్వరరావు సొంతంగా డిజైన్ చేసిన ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు మరి… ఇంకేమున్నయ్ చెప్పడానికి ఆస్తులు..?
అదేదో కొత్త జిల్లాల విభజన, పోలీస్ సర్కిళ్ల ఏర్పాటు, వేల వాహనాల కొనుగోలు… ఇవేనా ఆస్తులు..? వారెవ్వా, ఏం తర్కం పాత పాలకా..? ఐనా ఆ వాహనాల కొనుగోళ్లు కూడా దందాయే కదా… అసలు పాలన సౌలభ్యం కోసం కొత్త పోలీస్ సర్కిళ్లు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అది ఆస్తుల కల్పనా..? ఎలా..? మిషన్ భగీరథా..? పాత ట్యాంకులకు కొత్త రంగులు పూసి, పైపులేయడమేనా..? ఇదీ మా ఘనత అని చెప్పడానికి ఇంకేమైనా ఉందా..? వైద్య, విద్య రంగాల్లో దేశంలోకెల్లా సిగ్గుచేటు ప్రగతి…
Ads
పాత ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పెండింగే… మనకు ఎఫ్ఆర్‌బీఎం అని ఓ పద్ధతి ఉంది… అంటే ఫైనాన్స్ రెగ్యులేషన్ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్… దాని ప్రకారం అప్పులు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 3 శాతం దాటొద్దు… అందుకని కేసీయార్ సర్కారు బడ్జెట్ పరిధిలోకి రాకుండా మూడు రకాలుగా అప్పులు చేసింది… స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఇదుగో ఇలాంటి అప్పుల సేకరణ, నిర్వహణ కోసమే) ఏర్పాటు చేసి, ప్రభుత్వమే నిర్వహించి, ప్రభుత్వమే చెల్లింపుల గ్యారంటీర్… కొన్ని ప్రభుత్వ గ్యారంటీ ఉన్నా సొంతంగానే రుణ నిర్వహణ చేసుకునేవి… ఇంకొన్ని పూర్తిగా ఆయా కార్పొరేషన్ల సొంత సేకరణ…
నిజానికి ఇవన్నీ తిరిగి చెల్లించాల్సింది, మిత్తీలు కట్టాల్సింది ప్రభుత్వమే… అవి ప్రభుత్వ సంస్థలే… కానీ బడ్జెట్ పరిధిలోకి రావు… అంటే జనం కళ్లుగప్పడం… ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకపోవడం…!! నిజానికి కాంగ్రెస్ సర్కారుకు కూడా ఓ సోయి లేదు… ప్యూర్ బడ్జెట్ పత్రాల్లాగా, కాగ్ రిపోర్టుల్లాగా శ్వేతపత్రం విడుదల చేయడం దేనికి..? వాటి సారాంశం, మర్మం మహా అయితే ఆర్థికశాఖలో పనిచేసే పిడికెడు మందికి మాత్రమే అర్థమవుతాయి… ఆ భాష ఇనుప గుగ్గిళ్లు…
ఈ భాష, ఈ బడ్జెట్ గణాంకాలు గాకుండా… సగటు మనిషికి అర్థమయ్యే రీతిలో కేసీయార్ పాలన వైఫల్యాల్ని పొందుపరచాల్సింది… తప్పేమీ లేదు, అధికారిక గణాంకాలే వాడుతూ సరైన విమర్శను సభలో ప్రవేశపెట్టవచ్చు… అది ఈ ప్రభుత్వానికి చేతకాలేదు… 40 పేజీల శ్వేతపత్రం ఓ వైట్ పేపర్‌లా కాదు, ఓ బ్లాంక్ పేపర్‌లా కనిపిస్తోంది… ‘‘కేసీయార్ భ్రష్టుపట్టించాడు, ఇక మేం ఉద్దరిస్తాం’’ అని స్థూలంగా చెప్పడానికి తప్ప ఎవరికీ అర్థం కాని ఈ శ్వేతపత్రం రిలీజ్ ఉపయోగం ఏమీ లేదు…!!
ఉదాహరణకు… మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ల రుణాలు దాదాపు 56 వేల కోట్లు… దేనికోసం వెచ్చించారు..? ఎందుకయ్యాయి ఈ అప్పులు..? తీరా చూస్తే లక్షల టన్నుల ధాన్యం మిల్లుల నుంచి మాయం… వేల కోట్ల కుంభకోణం… అలాగే కరెంటు సంస్థల రుణాలు 50 వేల కోట్లపైమాటే… ఎటు పోయాయి ఆ నిధులన్నీ..? కరెంటు కొనుగోళ్ల మాయామర్మం తేలేదెలా..? ఇలా ఒక్కొక్క రంగం మీద వివరంగా పొందుపరిస్తే బాగుండేది… ఉమ్మడి ప్రభుత్వంలో ఏం జరిగింది..? పాత కాంగ్రెస్ హయాంలో ఏ సంస్థలు ఏర్పడ్డాయి..? ఇతర రాష్ట్రాల్లో ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఎలా ఉందో అంకెలు పేరిస్తే ఎవరికి సమజ్ కావాలి..?!
Share this Article