కేసీయార్‌ను జనానికి దూరం చేసిన ఆ ఎల్ఆర్ఎస్, ఆస్తుల సర్వే, ధరణి వైఫల్యాలకు బాధ్యులెవరో ఫిక్స్ చేసి, వేటు వేయడం ఎంత అవసరమో… ఓసారి వ్యవసాయ అంశాల్లో కేసీయార్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్న వారినీ గుర్తించి, వదిలించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది… నియంత్రిత వ్యవసాయ విధానం తప్పు… అది నష్టదాయకం, ప్రభుత్వమే బదనాం అవుతుంది, రైతు నష్టపోతాడు అని ‘ముచ్చట’ పదే పదే హెచ్చరించింది… ఇప్పుడు ఏమైంది…? సన్న ధాన్యం నువ్వు వేయమన్నావు..? మేం వేశాం… అదనపు ధర ఇప్పిస్తానన్నావ్… ఏమైంది..? అసలు కొనేవాడు లేడు… నీ మాట విని నిండా మునిగాం అంటూ రైతులు కేసీయార్‌ను నిందిస్తున్నారు…
కేంద్రంలోని బీజేపీ మోసం చేసిందోయ్, అది కొననంటోంది, మరి నన్నేం చేయమంటావ్ అని తప్పించుకోవడానికి లేదు… జనం కేసీయార్‌ను చూస్తారు తప్ప మోడీని చూడరు… అసలు తెలంగాణ సన్నాలు పేరిట… సుగర్ ఫ్రీ అని ప్రచారం చేయడం తప్పు… మస్తు మార్కెట్ ఉంటుంది అని చెప్పడం తప్పు… మార్కెట్ అంత త్వరగా ఏ వెరయిటీని యాక్సెప్ట్ చేయదు… ఇదుగో మళ్లీ పంటలకు సంబంధించి కొత్త ఆలోచనలు…
Ads
నిజమే… వరికి మంచి ప్రత్యామ్నాయమే ఆయిల్ పామ్… దేశంలో నూనెలకు కొరత ఉంది కాబట్టి, దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి, కొనుగోళ్ల సంక్షోభం రాదు కాబట్టి, ధరల పతనం ఉండదు కాబట్టి ఆయిల్ పామ్ మంచిదే… కానీ ఇదే… ఒకేసారి లక్షల ఎకరాలంటూ హైప్… సిద్ధిపేట, జనగామ వంటి ప్రాంతాల్లో నేలలు ఆయిల్‌పామ్‌కు అనుకూలమేనా..? ఏ శాస్త్రవేత్తలు నిర్ధారించారు..? నిజానికి పుష్కలంగా భూగర్భజలాలు ఉండే, నదీప్రాంత నేలలు బెటర్… ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది సరే… కానీ ఒక్కసారి గెలల్ని కట్ చేస్తే, గంటల్లో ప్రాసెసింగ్ ప్లాంటుకు చేరాలి… మనకు ఎన్ని ఉన్నయ్..? ఎన్ని కావాలి..? వస్తాయా..? అవీ అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తాయా..? ఓ సమగ్ర ప్రణాళిక అవసరం… హడావుడిగా సన్నధాన్యం వేయించినట్టు కాదు…
ఇక మరో అంశం పత్తి… ఓసారి ఈ వార్త చదవండి…
మన పత్తి సూపర్ అట… స్టేపుల్ పొడవు మరీ ఎక్కువ అట… అంటే, దూది పింజ లేదా దారం… అందుకని మస్తు నాణ్యత అట, మస్తు ధర వస్తుందట… జస్ట్, తెలంగాణ పత్తి అనే బ్రాండింగ్ జరిగితే చాలునట… అసలు ఎవరు చెప్పిస్తున్నారు కేసీయార్‌తో ఇవన్నీ… అసలు తను చెబుతున్నాడా..? తన పేరిట ప్రెస్ నోట్లు వచ్చేస్తున్నాయా..? లేకపోతే ఏమిటిది..? తెలంగాణలో పత్తి వేస్తే పెద్ద స్టేపుల్ వస్తుందా..? లేక పత్తి రకాలను బట్టి స్టేపుల్ పొడవు ఉంటుందా..? మళ్లీ సన్నధాన్యాల తప్పే ఇదీ…
నిజానికి పప్పులు, నూనెలు ఇప్పుడు రైతుకు లాభదాయకం… ప్రభుత్వం చెప్పినట్టు మక్కలు తగ్గించినా సరే… కంది, పెసర, శెనగ ఎంకరేజ్ చేయాలి… ఆయిల్స్… అంటే పల్లి, ఆముదం, నువ్వులు… అన్నింటికీ మించి పొద్దుతిరుగుడు బెటర్… వీటికి ఎప్పుడూ కొనుగోళ్ల సంక్షోభం రాదు… కేంద్రం గానీ, రాష్ట్రం గానీ చేతులు కాల్చుకునే పని కూడా ఉండదు… వాటిల్లో మన సైంటిస్టులు రీసెర్చ్ శ్రమ తక్కువ… ఎక్స్టెన్షన్ వర్క్ అసలే కనిపించదు… గుడ్డి నియంత్రిత విధానం కాదు… ఆలోచనాత్మక విధానం అవసరం… ప్చ్, అదే లోపిస్తోంది…
Share this Article