.
అమ్మానాన్నలూ, తప్పక చదవండి! { – Ravi Teja Boppudi }
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత… ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి.
అమ్మానాన్నలుగా మన priorities ఏంటి?
మనుషులుగా మన priorities ఏంటి?
Ads
ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం.
హాస్పటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి –
1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు.
2. మేము పుష్ప అని పిలుస్తాము
3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము
4. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద
ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే Blank slate తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా?
అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే.
ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ… ఇక్కడ మనం అర్థం చేసుకుంటే… ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప… పుష్ప అని పిలిచారు.
పుష్ప 1 సినిమాకి U/A 13+ rating ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా?
అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా)
– Heroism
– Elevations
– Punch dialogs
– Obscenity
– Rules break చెయ్యడం
ఇవేగా?
చిన్న పిల్లల మెదడు sponge ముక్కల్లాంటిది. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది.
పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది.
సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు?
ఇంట్లో పిల్లల్ని… సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు?
సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి?
ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి?
“సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?”, అంటూ మాట్లాడితే…
పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బబ్బో అని మాట్లాడితే… పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. Aggressive గా ఉంటేనే హీరో అనుకుంటారు. Reckless గా మాట్లాడితేనే style అనుకుంటారు.
కాదా?
అలా కాక… మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరంలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే…
Yes, Hero అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా?
ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం.
అమ్మానాన్నలు,
1. ఇంట్లో “ఫ్యాన్” అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి.
2. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత have a meaningful discussion about it. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి.
మనం మారితేనే… పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు.
Share this Article