హమ్మయ్య… తెగ రాసేశారుగా అందరూ… చివరకు మెహబూబ్, సొహెల్ కలిసి ఆడిన డ్రామా గురించి కూడా విస్తృతంగా రాసేశారు కదా… మొత్తం బిగ్‌బాస్ ప్రేక్షకులందరినీ ఆ ఇద్దరూ బకరాలను చేశారనే విమర్శ అబద్ధం… అక్కడ సొహెల్ చాలా తెలివిని ప్లే చేశాడు… ఆఫ్టరాల్ అది గేమే కదా… గేమే ప్లే చేశాడు… సరే, సొహెల్‌కు మెహబూబ్ ‘నువ్వు మూడో ప్లేసులో ఉన్నావురా, వాళ్లు డబ్బులిస్తామని అంటారు, తీసుకుని వచ్చెయ్’ అన్నట్టుగా మూడు వేళ్లు చూపించి, హింట్ ఇచ్చాడు సరే… కానీ..?
నేను సూట్ కేసు తీసుకుని వెళ్లిపోతాను అన్నప్పుడు… ప్రైజ్ మనీ నుంచే 25 లక్షలు కత్తిరిస్తాం అన్నప్పుడు… అభిజిత్, అఖిల్ ఎందుకు ఒప్పుకున్నట్టు..? అకస్మాత్తుగా సొహెల్ ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని ఎందుకు సందేహించలేదు..? అభిజిత్ ఈ వంద రోజులూ మస్తు తెలివిని చూపించాడు కదా… ఇక్కడ లాజిక్కులన్నీ వదిలేసి, బ్లాంకుగా ఎందుకు నిలబడిపోయాడు… ఎవరైనా గెలవనీ, కానీ ఫుల్ ప్రైజ్ మనీ ఇవ్వాలి, ఈ కత్తెర కరెక్టు కాదు అని ఎందుకు అనలేకపోయాడు… గెలుపు దగ్గరలో తగాదా దేనికని భయపడ్డాడా..? తనెందుకు బదనాం కావడం అని వెనక్కి తగ్గడా..? తను గనుక నో అని ఉంటే…. ‘‘కథ వేరే ఉండేది…’’ సొహెల్, మెహబూబ్ ప్లాన్ రివర్స్ కొట్టేది…
Ads
సరే, నాకు ట్రోఫీ ముఖ్యం, 25 లక్షలు పోతేపోనీ, విజేతగా నిలవడం ముఖ్యం అనుకుని రాజీపడ్డాడు అనుకుందాం… మరి అఖిల్ ఎందుకు డౌట్ పడలేదు సొహెల్పై…. ఫాఫం, తన కోసం ఏదయినా త్యాగం చేసే సొహెల్, అర్థంతరంగా వదిలేసి వెళ్తున్నాడు అంటే దాని వెనుక ప్లాన్ ఏమిటి అని ఎందుకు సందేహించలేదు..? ఇప్పుడు నేను బకరా అయ్యాను అని చింతించడం దేనికి..? ఆటలో, సరైన క్షణంలో సరైన నిర్ణయం తీసుకున్నవాడే విజేత… ఆ పని సొహెల్ చేశాడు… మెహబూబ్‌ను కూడా వాడుకుని మొత్తం గేమ్ హైజాక్ చేశాడు… అసలు బిగ్‌బాస్ గేమే పెద్ద అనైతికమైన అడ్డదిడ్డం ఆట… ఇక అందులో తప్పేముంది.., ఒప్పేముంది..?
పేరుకు యాభై కెమెరాలున్నయ్… ప్రతిక్షణం ఆట మీద నిఘా ఉంటుంది… అంతకుముందే కొన్ని టాస్కుల్లో అఖిల్, సొహెల్ ఇండివిడ్యుయల్ ఆట గాకుండా… కలిసి ఆడారు… మెహబూబ్, సాహెల్ దోస్తీ అందరికీ తెలుసు… హౌస్‌లోకి మెహబూబ్ వచ్చినప్పుడు ఫీడ్‌ను మరి బిగ్‌బాస్ ఒకటికి నాలుగుసార్లు ఎందుకు పరిశీలించలేదు…? బిగ్‌బాస్ టీం ఎలాగూ పనికిమాలినది అని తెలుసు కాబట్టే సొహెల్, మెహబూబ్ వాడేసుకున్నారు..,
50 లక్షలు వస్తే చెరి 25 లక్షలు అని ఒప్పందం అట… అఖిల్‌తో కుదిరిందీ, నిజమే అనుకుందాం… అభిజిత్ దానికి ఒప్పుకోడు కదా… మరి సొహెల్ చెప్పిన కారణాన్ని నాగార్జున ఎలా నమ్మినట్టు..? అక్కడే ఉన్న అభిజిత్ దాన్ని ఎందుకు సందేహించలేదు..? అసలు మొత్తం షో అంతా బిగ్‌బాస్ టీం వైఫల్యం కనిపించడం లేదా..?
సరే, సరే… వోట్లేసినవాళ్లు, బిగ్‌బాస్ టీం, అభిజిత్, అఖిల్… అందరూ బకరాలయ్యారు సరే… కానీ ఈ షో మొత్తం మీద అసలు బకరాలు అయిపోయింది చిరంజీవి, నాగార్జున… సొహెల్ అప్పటికప్పుడు చెప్పిన ఏదో కాారణాన్ని నమ్మేసి… 25 లక్షలు తీసుకుని, ఆట వదిలేసిన నిర్ణయం అద్భుతం అనుకుని, సొహెల్‌ను ఎత్తుకుని, తనూ 10 లక్షలు ప్రకటించిన నాగార్జున… కనీసం ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించలేదు… సూట్‌కేసు తీసుకునేటప్పుడు 10 లక్షలు అనాథలకు ఇస్తానన్న సొహెల్, బయటికి రాగానే వెంటనే మాట మార్చేసి, అందులో మెహబూబ్‌కు 5 లక్షలు ఇస్తానంటున్నాడు ఏమిటని ఆలోచించలేదు… ఇంటి నుంచి మటన్ తీసుకొచ్చిన చిరంజీవి కూడా ఇదంతా విని, ఉప్పొంగిపోయి తనూ 10 లక్షలు అన్నాడు… 25 అనుకుంటే ఏకంగా 45 లక్షలు వచ్చిపడ్డయ్… సో, ఏ కోణం నుంచి చూసినా ముగ్గురే నిఖార్సయిన బకరాలు… సారీ, బాధితులు… చిరంజీవి, నాగార్జున, అఖిల్…!!
Share this Article