Murali Buddha ………… డర్టీ డజన్ మంత్రులు – థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ …. జ్ఞాపకాలు….
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు … నాయకులు చెప్పేది ఆ క్షణం వరకే తప్ప గతం లో ఏమన్నారు ? భవిష్యత్తులో ఏమంటారు అనే దానితో సంబంధం ఉండదు, ప్రస్తుత మాటనే ముఖ్యం . 94-95 లో మీడియాలో , రాజకీయ నాయకుల్లో చాలా ఎక్కువ సార్లు వినిపించిన మాట డర్టీ డజన్…
ఫేస్ బుక్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ మీద జరుపుతున్న ఒంటరి పోరాటం చూశాక పాత సంగతులు జ్ఞాపకం వచ్చాయి … బుచ్చయ్య చౌదరి ఏం మాట్లాడినా 30 ఇయర్స్ అనుభవంతో చెబుతున్నా తమ్ముడూ అంటూ మొదలు పెట్టేవారు .. సినీ నటుడు పృద్వి ఏదో సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే డైలాగు బాగా పాపులర్ అయింది . చివరకు ఆ నటుడిని పేరుతోకన్నా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే పేరుతోనే పిలవడం మొదలైంది . ఆ సినిమాలో కన్నా ఎన్నో ఏళ్ళ ముందే బుచ్చయ్య థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తాను చెప్పదలిచింది చెప్పేవారు ..
Ads
ఇప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ , ఫేస్ బుక్ పోస్ట్ లు చూస్తే బాబుకు గట్టి మద్దతుదారు అనిపిస్తుంది . కానీ ఒకప్పుడు ఆయన బాబుకు సింహస్వప్నం . ఎన్టీఆర్ వెన్నుపోటుపై బాబుకు వ్యతిరేకంగా కోర్ట్ కు కూడా వెళ్లి చికాకు పెట్టారు . ఎన్టీఆర్ తోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైభోగం ముగిసిపోయింది . ఎన్టీఆర్ చివరి రోజుల వరకు ఎన్టీఆర్ తోనే ఉన్నారు .
94-95 లో పన్నెండు మంది మంత్రులను డర్టీ డజన్ అని పిలిచేవారు . డర్టీ డజన్ అనే మాట మీడియాకు బాబు సూచించారో , బాబు కోసం మీడియా ఖాయం చేసిందో కానీ బాబుకు మద్దతుగా , వీరికి వ్యతిరేకంగా మీడియాలో డర్టీ డజన్ అంటూ కథలు కథలుగా వార్తలు వచ్చేవి . గాలి ముద్దు కృష్ణమ నాయుడు , బుచ్చయ్య చౌదరి , ఇంద్రారెడ్డి , మోత్కుపల్లి నర్సింహులు , బివి మోహన్ రెడ్డి , దాడి వీరభద్రరావు , ప్రణయ భాస్కర్ , కోడెల శివ ప్రసాద్ గుర్తున్న పేర్లు . మొత్తం పన్నెండు మంది ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి సన్నిహితులు డర్టీ డజన్ అని బాబు వర్గం మీడియా విమర్శించేది .
ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లగా మిగిలిన వారంతా అనంతర పరిణామాలతో చంద్రబాబుకు గట్టి మద్దతుదారులుగా నిలిచారు . వెన్నుపోటుపై బాబుకు వ్యతిరేకంగా కోర్ట్ కు వెళ్లిన బుచ్చయ్య ఇప్పుడు బాబుకు గట్టి మద్దతుదారు . తన రాజకీయ జీవితంలో మొదటి నుంచి బాబు వ్యతిరేకి అయిన ముద్దు కృష్ణమ నాయుడు ఎన్టీఆర్ మరణం తరువాత కాంగ్రెస్ నుంచి ఒకసారి mla అయ్యారు . తరువాత టీడీపీలో చేరి చివరివరకు బాబుకు గట్టి మద్దతుదారుగా నిలిచారు . వీరంతా 82-83 లో రాజకీయాల్లోకి వచ్చిన వారే కానీ బుచ్చయ్య ఏం చెప్పినా 30 ఇయర్స్ అని చెప్పేవారు .
30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా తెలంగాణ రాదు
30 ఏళ్ల అనుభవం నాది, ఏ పార్టీ అయినా గెలిస్తే మొదటిసారే గెలవాలి . మొదటిసారి తప్పితే రెండోసారి రాదు . Ysr కాంగ్రెస్ అధికారంలోకి రాదు . కాంగ్రెస్ లో కలిపేస్తారు . చెన్నారెడ్డితోనే తెలంగాణ సాధ్యం కాలేదు కెసిఆర్ తో అవుతుందా ? తెలంగాణ ఇవ్వరు …. బుచ్చయ్య చౌదరి 30 ఏళ్ళ అనుభవంతో చెబుతున్నాను అని చెప్పిన వాటిలో ఇలాంటి మాటలు కొన్ని …
Tdlp వద్ద సుదీర్ఘ చర్చలు జరిపే వాళ్ళం .
చెన్నారెడ్డి హయంలో రాలేదు కాబట్టి కెసిఆర్ హయంలో రాదు అనేది అర్థం లేని వాదన . ఇందిరాగాంధీ హయం లో ఎన్టీఆర్ ను దించేస్తే … విఫలమయ్యారు .అదే బాబు విజయవంతంగా ఎన్టీఆర్ ను దించేశారు . అలా అని ఇందిరాగాంధీ కన్నా బాబు శక్తి వంతుడు అంటామా ? 69 పరిస్థితులు వేరు, ఇప్పటివి వేరు అని నా వాదన వినిపించా… జగన్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారు అని రోజూ టీడీపీ వాళ్ళు మీడియా సమావేశాల్లో చెప్పేవారు …
బుచ్చయ్యకు రోజూ అదే పని, ఓ రోజు ఎప్పుడు కలుపుతారో చెప్పండి అని పట్టుపడితే డిసెంబర్లో అన్నారు . ఇప్పటికి పది డిసెంబర్ లు గడిచి పోయాయి . ఓ సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు కూడా ఇలానే థర్టీ ఇయర్స్ అనుభవం అంటూ జగన్ కాంగ్రెస్ లో పార్టీని కలిపేస్తారు అనేవారు … ఈ వాదనకు ఏదైనా ఆధారం ఉండాలి కదా అంటే …. నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత చెప్పి ఇదే ఆధారం అన్నారు .
కొత్త పార్టీ తొలిసారి అధికారం రాకపోతే ఇక రాదు అనే థర్టీ ఇయర్స్ సమయం వాదన కూడా అర్థం లేనిదే … ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న పార్టీ (బీజేపీ), తెలంగాణను ఏలుతున్న పార్టీ , ( బిఆర్ఎస్ ) ఆంధ్రలో అధికారంలో ఉన్న పార్టీ ( ysr కాంగ్రెస్) ఈ మూడు పార్టీలు కూడా పార్టీ పెట్టగానే తొలిసారే అధికారంలోకి వచ్చిన పార్టీలు కాదు . రెండు శాతం ఓట్లు వచ్చిన కాంగ్రెస్ లోకి అధికారానికి చేరువగా ఉన్న ( అప్పుడు ) పార్టీని కలిపేస్తారు అని థర్టీ ఇయర్స్ సీనియర్స్ చెప్పడం మీడియా రాయడం విచిత్రమే .
తెలంగాణ ఉద్యమ సమయంలో బుచ్చయ్య చౌదరి టీడీపీలో ఉంటూనే ఆంధ్ర సమితి పేరుతో ఒక పార్టీ ఏర్పాటు గురించి కూడా ప్రకటించారు .
94-95 లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీస్ కు కైనటిక్ స్కూటర్ పై వచ్చేవారు . బాబుకు ఎంత విధేయులుగా ఉన్నా బుచ్చయ్యకు కాలం కలిసి రాలేదు . ఎన్టీఆర్ తోనే వైభవం ముగిసింది . సబ్జెక్ట్ ముఖ్యం కానీ సీనియార్టీది ఏముంది ? థర్టీ ఇయర్స్ సీనియారిటీ అని రాజకీయాల్లో వినిపిస్తే ఇవన్నీ గుర్తుకు వస్తుంటాయి …
Share this Article