అదేదో సినిమాలో… బ్రహ్మానందం తనే భాస్కర్ అవార్డులు ప్రవేశపెట్టి, వాటిని స్వీకరించి, మురిసిపోతాడు గుర్తుందా..? పోనీ, మన ఫిలిమ్ క్రిటిక్స్ అసిసోయేషన్ లేదా ఫిలిమ్ జర్నలిస్టుల అసోసియేషన్ గ్లోబల్ ఎలిఫెంట్ అవార్డులు లేదా ఇంటర్నేషనల్ క్యాట్ అవార్డులు అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది..? పోనీ, మన ప్రభుత్వ శాఖలు డబ్బులు పెట్టి కొనుక్కునే స్కోచ్ అవార్డుల సంగతి తెలుసా మీకు.? కనీసం పైరవీలతో, లాబీయింగ్‌తో దక్కించుకునే జాతీయ అవార్డుల గురించైనా తెలుసా లేదా..?
ఎస్… గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు అంతకుమించిన విలువేమీ లేదు… అవి ఇంటర్నేషనల్ ఫిలిమ్ సర్కిళ్లలో ఆఫ్టరాల్ అవార్డులు… కానీ అలాంటి అవాార్డులనూ స్వీకరించే ఆర్ఆర్ఆర్ టీంకు, ప్రత్యేకించి నాటు నాటు సినిమా పాటకు గాను కీరవాణి అభిరుచికి అభినందనలు… డబ్బుదేముంది, వచ్చిపడిన 1000 కోట్లలో కొంత ఖర్చయితే కానివ్వండి… అసలు ఏమిటీ గ్లోబల్ అవార్డులు..? అసలు వాటికి విలువేమైనా ఉందా..?
హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) అని అక్కడి సినిమా వార్తల్ని రిపోర్ట్ చేసే జర్నలిస్టులు (?) ఓ సంఘం పెట్టుకున్నారు… వాళ్లు ఈ గ్లోబల్ గ్లోబ్ అవార్డులు ఇస్తుంటారు… మన లాబీయింగ్, మన పేయింగ్ కెపాసిటీ ఎంత ఉంటే అంత…! ఇవే కాదు, అక్కడే తిష్ట వేసి, కార్డులు గీకేకొద్దీ న్యూయార్క్ క్రిటిక్స్ అసోసియేషన్, వాషింగ్టన్ ప్రెస్ అవార్డులు ఎట్రెట్రా బోలెడు… ఇప్పుడైతే ఏకంగా ఆస్కార్‌కే నామినేషన్లు పంపించుకుని, జాబితాలోకి ఎక్కి, ప్రచారం పొందవచ్చు…
Ads
ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఏకంగా పది సినిమాలు పోటీపడుతున్నయ్ ఇప్పుడు… నిజం చెప్పాలా… అందులో చెల్లెషో అనే గుజరాతీ సినిమా మాత్రమే అఫిషియల్ ఎంట్రీ… మిగతావన్నీ లాబీయింగుతో ఆ నామినేషన్ల జాబితాలోకి ఎక్కాయి… అందులో కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్, విక్రాంత్ రోణ, , గంగూభాయి కతియావాడి, మి వసంతరావ్, తుజ్యా సాథీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్ నిళల్ కూడా ఉన్నాయి… ఫైనల్ నామినేషన్ లిస్టును 24న ప్రకటిస్తారు… అప్పటివరకూ మీ ఇష్టం, ఏమైనా ప్రచారం చేసుకొండి…
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విషయానికొద్దాం… ఆస్కార్ కోసం 9000 మంది, ఎమ్మీస్ అవార్డు కోసం 20 వేలు, బ్రిటిష్ అకాడమీ అవార్డు కోసం 6 వేల మంది వోట్లు వేస్తారు… కానీ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి జస్ట్ 105 మంది… ఇక మీరే అర్థం చేసుకొండి… లాబీయింగ్ బలం ఎంత ఉంటే అంత… లేకపోతే ఈ సినిమాలన్నీ చూసి, మెరిట్ ఉన్న వాటికే వీళ్లు గ్లోబల్ గ్లోబ్ అవార్డులు ప్రకటిస్తున్నారని భ్రమపడుతున్నారా ఏం..?
ప్రెస్ క్లబ్‌లో సమావేశమైన మన టాలీవుడ్ ఎలిఫెంట్ అవార్డుల కమిటీ ఏమైనా ప్రకటించిందీ అనుకొండి… వాటికీ గ్లోబల్ గ్లోబ్ అవార్డులకు ఉన్నంత విలువ ఉంటుంది… లోకల్ కదా, కాస్త ఎక్కువగానే ఉంటుంది… చాలు కదా…!! కృషి ఉంటే మనుషులు రుషులవుతారట, మహాపురుషులవుతారట… కీరవాణికి బొడ్డు రాఘవేంద్రుడి ప్రశంస… సారూ, బంగారంలో కాకిబంగారం, వన్ గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ గోల్డ్ అని రకరకములు ఉండును… ఈ గోల్డెన్ గ్లోబ్ ఏ కేటగిరీ సారూ..?
Share this Article