.
మనుషుల విజయాలు… మేధస్సు… బయట చెప్పే నీతులు, వ్యక్తిత్వ పాఠాలు వేరు… కొన్నిసార్లు లెజెండరీ స్టేటస్ ఉన్న ప్రముఖులు సైతం అనాలోచితంగా తమలోని వికృత కోణాన్ని… తమ రాతలు, చేతలకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ… అభిమానులు కూడా అసహ్యించుకునేలా చేస్తారు… బయటి తమ ఘనతలను బట్టి వాళ్ల నిజతత్వాలను బేరీజు వేయలేం…
కటువుగా ఉన్నా… యండమూరి అభిమానులకు రుచించకపోయినా సరే… ఇది నిజం… తన పాపులర్ నవలల మాటెలా ఉన్నా, వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో లక్షల మందికి ‘విజయానికి ఐదు మెట్లు’ వంటి బోలెడు పాఠాలు చెప్పిన ఆయన ఓ నిజసందర్భంలో ఏం మాట్లాడాడో తెలుసా..?
Ads
సందర్భం :: అమరావతి- ఆవకాయ్ ఉత్సవాలు…
స్థలం :: విజయవాడ…
శాపనార్థాల సాహిత్య సెషన్!
విజయవాడ భవాని ద్వీపంలో జరిగిన ‘ప్యూర్ ఈవిల్’ (సినిమాల్లో విలన్ పాత్రలు) అనే చర్చా కార్యక్రమంలో యండమూరి పాల్గొన్నాడు… అక్కడ చర్చ జరుగుతుండగా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో చప్పట్లు కొట్టలేదన్నది ఆయన అసహనం…
వెంటనే ఆయన తనలోని వికృత కోణాన్ని బయటపెడుతూ— “నేను కాకినాడలో సరస్వతీ దేవి గుడి కట్టిస్తున్నాను.. చప్పట్లు కొట్టని వారి కుటుంబాలు నాశనం అయిపోవాలని ఆ దేవిని కోరుకుంటా” అని వ్యాఖ్యానించాడు… ఒక ప్రఖ్యాత రచయిత నోట రావాల్సిన మాటలేనా ఇవి? తనను చూడటానికి వచ్చిన వారిని, వారి కుటుంబాలను శపించడం ఏ రకమైన సంస్కారం?

ప్రశ్నించిన సామాన్యురాలు.. పలాయనం చిత్తగించిన మేధావి
సాధారణంగా మేధావులు ఏం మాట్లాడినా జనం భరిస్తారనే భ్రమలో ఉంటారు… కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది… ఒక సామాన్య గృహిణిjకి కడుపు రగిలిపోయింది ఆ మాటలతో… వేదిక వద్దకు వెళ్లి ఆయన్ని నేరుగా నిలదీసింది…
“మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో వస్తే, మా కుటుంబాలు నాశనం కావాలని కోరతారా..?” అని ఆమె అడిగిన ప్రశ్న ముందు యండమూరి అహం ఒక్కసారిగా చిన్నబోయింది… కనీసం మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పే సంస్కారం కూడా ప్రదర్శించకుండా, “ఓకే.. ఓకే..” అంటూ నిర్లక్ష్యంగా వేదిక దిగి వెళ్లిపోయాడు…
ముగింపు: మేధస్సు కన్నా సంస్కారమే మిన్న
పుస్తకాల్లో గొప్ప విషయాలు రాయడం వేరు, వాటిని జీవితంలో ఆచరించడం వేరు… ఎంత గొప్ప రచయిత అయినా, బహిరంగ వేదికల మీద నాలుక మీద అదుపు లేకపోతే ఇలాగే అభాసుపాలవుతారు… చప్పట్లు కొట్టలేదన్న చిన్న కారణంతో సామాన్యుల జీవితాలను శపించే స్థాయికి దిగజారడం ఆయనలోని అహాన్ని, వికట ధోరణిని బయటపెట్టింది… మేధస్సు ఎంత ఉన్నా, తోటి మనిషిని గౌరవించే గుణం లేనప్పుడు ఆ విజయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే!
తన మీద ఎన్ని ఆరోపణలు రాలేదు… అప్పట్లో జ్యోతి అనే మహిళ మరణం నుంచి నవలల కాపీ, ఇతర భాషల్లో అక్రమ తర్జుమాలు గట్రా బోలెడు విమర్శలు… ఐనా సరే, ఏ పాఠకుడూ తను నాశనం కావాలని కోరుకోలేదు... ఏ సరస్వతీ దేవిని ప్రార్థించలేదు... తన రాతల్ని అభిమానించింది తెలుగు పాఠకలోకం... కానీ ప్చ్, యండమూరీ... యు ఆర్ టోటల్లీ రాంగ్..!!
Share this Article