నిన్న సోషల్ మీడియాలో తెగతిరిగిన ఫోటో మీమ్ ఇది… వరి వేస్తే తాట తీస్తా అన్న కలెక్టర్ ఇప్పుడు ఆకుపచ్చ కండువా వేసుకుని, టీఆర్ఎస్ మహాధర్నాలో కూర్చుని, వరి కొనకపోతే ఖబడ్దార్ అంటున్నాడు అనేది ఈ సెటైర్… ఆయన అలా రాజీనామాలు చేయడం, ఇలా ప్రభుత్వం ఆమోదించడం, ఆ వెంటనే గులాబీ కండువా కప్పేసుకోవడం, ఎమ్మెల్సీ పదవి వరించడం… అలా అలా ఆగమేఘాల మీద కొన్ని పరిణామాలు పరుగులెత్తాయి… అంతకుముందు ఆయన ముఖ్యమంత్రికి జరిపిన బహిరంగ పాదాభివందనాలు, రాజపుష్ప సంస్థ యవ్వారాలు, అదే సిద్దిపేటలో సుదీర్ఘకాలంగా తిష్టవేసిన ఆయనకు ప్రభుత్వ ముఖ్యులతో ఆప్త సంబంధాలు, నైతిక వర్తనల జోలికి పోవడం లేదు ఇక్కడ… ఆయన కూడా ప్రభుత్వ సర్వీస్ అనబడే ఆఫ్టరాల్ వరి పంట నుంచి అద్భుతమైన లాభాలనిచ్చే రాజకీయాల పంట వైపు మళ్లాడు… ఇదే ప్రత్యామ్నాయ పంటల సాగు అంటే…!! సరే, తన ఇష్టం… దేశంలో చాలామంది కేంద్ర సర్వీస్ అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు… ఆ నిర్ణయంలో తప్పుపట్టాల్సింది ఏమీలేదు… అయితే..?
ఆయన రాజీనామా ఆమోదం రూల్స్‌కు విరుద్ధంగా జరిగింది అనేది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ… కాంగ్రెస్ కూడా దీన్ని కాస్త రచ్చ చేసే ప్రయత్నం చేసింది… ఆయన ఎమ్మెల్సీ నామినేషన్‌ను అంగీకరించవద్దని డిమాండ్ చేసింది… అసెంబ్లీ కార్యదర్శికీ, కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోకు కూడా ఫిర్యాదు చేసింది… పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి మాటల్లో చెప్పాలంటే… ‘‘నాలుగు అంశాల్లో మేం వెంకట్రామారెడ్డి ఇష్యూను తప్పుపడుతున్నాం… 1) ఆయన రాజీనామా మీద నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని డీఓపీటీ… వాళ్లు ఆమోదించలేదంటే సర్వీసులో ఉన్నట్టే కదా, మరి నామినేషన్ ఎలా వేస్తాడు..? 2) తన మీద కోర్టుల్లో వేయబడిన పరిహారం కేసులున్నయ్ 3) సర్వీస్ రూల్స్‌కు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా సీఎం కాళ్ల మీద పడటం 4) కోర్టులు చెప్పినా వినను అంటూ న్యాయవ్యవస్థను కించపరచడం’’… కోర్టులో ఇదే అంశం మీద ఒక పిల్ కూడా పడింది…
Ads
అసలు ఒక ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ లేదా రాజీనామా ప్రొసీజర్ ఏమిటని ఆరా తీస్తే… ఇదుగో ఈ కాగితం ఒకటి దొరికింది… ఏపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వీఆర్ఎస్ అయితే హోం మినిస్ట్రీ, ఫారెస్ట్ మినిస్ట్రీల్లోని సంబంధిత విభాగాలు నిర్ణయాలు తీసుకుంటాయి… కానీ ఐఏఎస్ అధికారి అయితే సంబంధిత (తన ఒరిజినల్ కేడర్ స్టేట్) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే సరిపోతుందట… ముప్ఫై ఏళ్ల సర్వీసు లేదా యాభై ఏళ్ల వయస్సు దాటితే చాలు అని ఏదో వీఆర్ఎస్ క్లాజ్ కూడా ఉన్నట్టుంది… రిజిగ్నేషన్కు అదీ అక్కర్లేదు… సో, వెంకట్రామారెడ్డి వీఆర్ఎస్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం అనేది టెక్నికల్‌గా, రూల్స్పరంగా తప్పుకాకపోవచ్చు… అయితే దీన్ని అంతిమంగా ఆమోదించాల్సింది కేంద్రమే…
సదరు అధికారి చెల్లించాల్సిన బకాయిలు ఉంటే, ఎంక్వయిరీలు పెండింగ్‌లో ఉంటే, పబ్లిక్ ఇంట్రస్టుకు వ్యతిరేకంగా ఉంటే డీఓపీటీ వీఆర్ఎస్ను ఆమోదించకుండా తొక్కిపెట్టే చాన్స్ ఉంది… కానీ వెంకట్రామారెడ్డి మీద ఒక కలెక్టర్‌గా కోర్టుల్లో కేసులున్నాయేమో గానీ, వ్యక్తిగతంగా తను ప్రభుత్వానికి బాకీ లేడు, ఎంక్వయిరీస్ కూడా పెండింగ్‌లో ఏమీ ఉన్నట్టు లేవు… ఆయన సర్వీసులో ఉన్నాలేకపోయినా పబ్లిక్కు ఏ ఇంట్రస్టూ లేదు, అనగా ప్రజాప్రయోజనాలతో లింకేమీ లేదు… సో, ఆయన వీఆర్ఎస్ను ఆమోదించకుండా కేంద్రం ఆపలేదు కూడా..! (ఉద్దేశపూర్వకంగా ఆపాలని అనుకుంటే తప్ప)… ఓ కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి మీద అంత కక్ష చూపించాల్సిన అవసరం కేంద్రానికి ఏముంటుంది..?! అయితే… డీఓపీటీ అధికారికంగా ఆమోదముద్ర వేసిందా..? వేయకముందే గనుక నామినేషన్ వేస్తే, దానికి వేలిడిటీ ఉంటుందా..? చెల్లుతుందా..? కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఆ తేదీ ముఖ్యమా..? రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీ ముఖ్యమా..? దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి..? అసలు సదరు అధికారి పోతేపోనీలే అనుకోకుండా ఈ ప్రశ్నలు అవసరమా..? ఇవీ ప్రస్తుతానికి జవాబుల్లేని ప్రశ్నలు…!!
Share this Article