ఒక వార్త… రణబీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా నటించే రామాయణం సినిమా చిక్కుల్లో పడింది అని..! దాదాపు ఐదారువందల కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున ప్రతిష్ఠాత్మకంగా తీయబోయే ఈ సినిమాకు నితిష్ తివారీ దర్శకుడు… రావణుడిగా నటించడంతోపాటు కన్నడ హీరో యశ్ ఈ సినిమాలో డబ్బు కూడా పెట్టుబడి పెడుతున్నాడట…
ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారుల రెమ్యునరేషనే వంద కోట్ల దాకా ఉండనుందనే కథనాలు వచ్చాయి గానీ అందులో నిజానిజాలు ఎవరూ కన్‌ఫరమ్ చేయరు కాబట్టి దాన్నలా వదిలేద్దాం… కానీ ఈ సినిమాకు వచ్చిన చిక్కులేమిటి..?
కొన్ని హిందీ సినిమా సైట్ల కథనాల మేరకు… అల్లు మంతెన మీడియా వెంచర్స్ ఎల్‌ఎల్‌పి ఒక పబ్లిక్ నోటీసును జారీ చేసిందట… అదేమిటంటే..? తమ ‘ప్రాజెక్ట్ రామాయణం’ ఆధారంగా స్క్రిప్ట్ ఉపయోగించుకుంటూ ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ సినిమా ప్రారంభించిందట, కానీ కాపీ రైట్ బాపతు చర్చలు ముగియలేదనీ, చెల్లింపులు జరగలేదనీ కాబట్టి ఇవేవీ జరగకుండా ఎవరైనా ఈ స్క్రిప్టు ఆధారంగా సినిమా ప్రారంభిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేది ఆ నోటీసు సారాంశం…
Ads
ఈ మొత్తం లీగల్ నోటీసులు, చెల్లింపులు, ఒప్పందాలు, మన్నూమశానం పక్కన పెడితే… అసలు రామాయణం మీద పేటెంట్ హక్కులేమిటి నాన్సెన్స్ అనిపిస్తుంది కదా… ఈ జాతి వేల ఏళ్లుగా పారాయణం చేస్తున్న పురాణగాథ అది… కొన్ని వేల కళారూపాల్లో కొన్ని లక్షల రకాల సృజన జరిగింది… జాతికి తరతరాలుగా ఆదర్శంగా నిలుస్తున్న రాముడి కథ అది…
పద్యాలు, గద్యాలు, శ్లోకాలు, సినిమాలు, భాగవతాలు, హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, నాటకాలు, సీరియళ్లు కథల నుంచి తోలుబొమ్మలు, యానిమేషన్ సీరీస్ దాకా… వాట్ నాట్..? ప్రపంచంలోని ఏ కళారూపమైనా సరే రామాయణాన్ని టచ్ చేయనిది ఉందా..? ఆ కథకు మేధోహక్కులేమిటి..? అది విశ్వసంపద… రామభక్తులందరి సంపద…
సరే, ఒకవేళ ఎవడో ఓ స్క్రిప్టు రాశాడూ అనుకుందాం… దానికి సరిపడా చెల్లింపులు చేయలేదనే అనుకుందాం… వందల కోట్ల ఖర్చుతో సినిమా తీసే ప్రబుద్ధులు తమకు అనువైన ఓ స్క్రిప్టును కొత్తగా రాయించుకోలేరా..? అసలు చాలామందికి ఆదిపురుష్ అనే భ్రష్ట సినిమా అనుభవం చూశాక ఈ హిందీ నిర్మాతలు ఈ కొత్త రామాయణాన్ని ఇంకెలా తీస్తారో అనే డౌట్ ఉండనే ఉంది…
పౌరాణికాల్ని జనరంజకంగా తీయగల ఇండస్ట్రీ టాలీవుడ్… అనేకసార్లు ప్రూవ్ చేసుకుంది… సకల గుణాభిరాముడి చరితాన్ని సకల జన రంజకంగా తీయగల వాళ్లున్నారు, రాయగలవాళ్లున్నారు… టాలీవుడ్ సహకారం తీసుకుంటే తప్పేమిటి..? ఆల్రెడీ సీత పాత్ర, రావణ పాత్రలను మన సౌత్ నటులే చేస్తున్నారు… సీతారాముల ఫస్ట్ పిక్స్ కూడా లీకయ్యాయి… స్థూలంగా బాగానే కనిపిస్తున్నారు…
సరే, వాళ్ల బాధ వాళ్లది, అన్ని అడ్డంకులను దాటుకుని మన వరకూ వస్తే నచ్చితే చూస్తాం, అంతే కదా… ఎటొచ్చీ రామాయణంపై పేటెంట్స్, చెల్లింపులు, కేసులు అనే దగ్గరే ఆగిపోతుంది ఆలోచన మొత్తం… ఎందుకిలా..?!
నిజానికి రామాయణాన్ని వందల రకాల కళారూపాల్లో చెప్పడం, చూపడమే కాదు… చాన్నాళ్లుగా తార, వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, మండోదరి, లక్ష్మణుడు, ఊర్మిళ తదితర కీలక పాత్రల కోణాల్లో పునఃసృజనలు కూడా జరిగాయి… (సరే, రంగనాయకమ్మ వంటి కేరక్టర్లు విషవృక్షాలు కూడా రాశారు, అది వేరే సంగతి…) చాలా ప్రయోగాలు, మెప్పు పొందాయి కూడా… (ఆమధ్య ఎవరో మలయాళ నిర్మాతలు భారతాన్ని భీముడి కోణంలో చెప్పడానికి ప్లాన్ చేశారు, కానీ ప్రాజెక్టు ఎందుకో గానీ ముందుకు పడలేదు…) సో, ఎవరో ఏదో క్లెయిమ్ చేస్తే ఎడాపెడా చెల్లింపులు చేయడం ఏమిటో అర్థం కాదు… కొత్త తరహా ఆలోచనలు కొరవడటం ఇది..!!
Share this Article