చట్టబద్ధమైన హక్కులు… న్యాయబద్ధం, ధర్మబద్ధ హక్కులు అనేక రకాలు… అలాగే చిన్న పిల్లలకూ హక్కులుంటాయి మనం గుర్తించం గానీ… పిల్లలు తమ ప్రేమను సంపూర్ణంగా, స్వచ్ఛంగా చూపించడానికి అనువైన వాతావరణం, అవకాశం పొందే హక్కు కూడా ముఖ్యమే… పాశ్చాత్య దేశాల్లో పిల్లల ప్రేమ అనేక బంధాల సమీకరణాల్లో చిక్కి బహుముఖంగా, ఒకింత గందరగోళంగా ఉంటుంది…
బయోలాజికల్ పేరెంట్స్, అడాప్టెడ్ పేరెంట్స్ తేడాలు మాత్రమే కాదు… రెండో అమ్మ, మూడో అమ్మ, రెండో నాన్న, మూడో నాన్న… ఎవరిని మనస్పూర్తిగా ఆమోదించి తమ స్వచ్ఛమైన ప్రేమను చూపించాలో, పంచాలో పిల్లలకు ఎప్పుడూ ఓ పరీక్షే… అందుకే మేజర్ కాగానే వాడిని వాడే ప్రేమిస్తాడు… లేదా అపోజిట్ సె- ప్రేమలో పడిపోతాడు… అదీ ఎన్నాళ్లో వాళ్లకే తెలియదు…
సరోగసీ పుణ్యమాని మన దేశంలో కూడా ఇలాంటి గందరగోళపు మాతృప్రేమలు, పితృప్రేమలు, బయోలాజికల్ ప్రేమలు, అడాప్టెడ్ ప్రేమలు గట్రా రకరకాల లెక్కలు పిల్లల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి… ఓ తాజా కేసు చూద్దాం… పఠనా సౌలభ్యం కోసం పేర్లు మార్చి చెప్పుకుందాం…
Ads
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ… సరే, పేరు అమల అనుకుందాం… భర్త పేరు ఏ అప్పారావో అనుకుందాం… వాళ్లకు చాలాకాలం వరకూ పిల్లల్లేరు… దాంతో అద్దెకడుపు ద్వారా పిల్లల్ని కనాలని భార్యాభర్తలిద్దరూ సంకల్పించారు… పిచ్చిది, తన రక్తమే కదానుకుని భ్రమపడి, తన చెల్లెలి (పేరు కమల అనుకుందాం) అండం తీసుకుని, తన భర్త వీర్యం ద్వారా సరోగసీ పద్ధతిలో 2019 ఆగస్టులో ఇద్దరు కవల పిల్లల్ని సొంతం చేసుకుంది… సొంతం అయ్యారా..? అదే ట్విస్టు కథలో…
సో, అమల అక్క, కమల చెల్లె… విధికి మనిషి బతుకంటేనే ఆట కదా… ఆ చెల్లెలి మొగుడు, కుమార్తె 2021 మార్చిలో ఏదో ప్రమాదంలో చనిపోయారు… సో, ఆ చెల్లెలు కమల ఒంటరిదైపోయింది… ఈలోపు అక్క అమల కాపురంలో కూడా కలతలు చెలరేగి… ఆ సరోగేట్ పిల్లల్ని తీసుకుని సదరు అప్పారావు భార్య అమలను వదిలేసి, ఎక్కడికో పోయి ఉండసాగాడు…
సో, అమల ఒంటరి… కమల ఒంటరి… అప్పారావు పిల్లలతో కూడిన ఒంటరి… పిల్లలకు అమ్మ కావాలి, తనకూ తోడు కావాలని సదరు అప్పారావు మళ్లీ బయట వ్యక్తులు ఎందుకులే అనుకుని… ఒంటరిదైపోయిన తన మరదలు, అనగా తన పిల్లలకు అండాన్ని ఇచ్చిన ఆ కమలను చేరదీసి, సొంతం చేసుకున్నాడు… తన మొదటి భార్య, అనగా కమల అక్క అమలను కనీసం పిల్లల్ని చూడటానికి కూడా వీల్లేకుండా ఆంక్షలు పెట్టేశాడు…
ఈమె కడుపు రగిలిపోయింది… పిల్లల్ని ఇవ్వలేని కడుపు కదాని ప్రేమకు కొరత ఉంటుందా..? నాన్సెన్స్, నా చెల్లెలు కేవలం అండాన్ని ఇచ్చింది, అంతేతప్ప తనేమీ మోయలేదు, అద్దె కడుపు తీసుకున్నాం, అద్దె చెల్లించాం, సో, చెల్లెలికి ఏ హక్కూ లేదు, ఆ పిల్లలు నావాళ్లు, వాళ్లను చూడకుండా ఆంక్షల్ని తొలగించాలని కోర్టుకెక్కింది అక్క… న్యాయమైన కోరికే కదా…
నో, నో,అండ దానం చేసింది నేనే, బయోలాజికల్ తల్లినీ నేనే అని చెల్లెలు కోర్టులో వాదించింది… ఇది బాంబే హైకోర్టు దాకా వచ్చింది… కోర్టు రీసెంటుగా తేల్చేసింది… అండం, వీర్యం దానం చేయడం స్వచ్చందం, అంతేతప్ప ఏ హక్కులనూ కల్పించవు… చట్టబద్ధమైన హక్కులేవీ ఆ పిల్లలపై ఆ దాతలకు వర్తించవు అని చెప్పేసింది… సో, ప్రతి వారంతంలో ఆ పిల్లలు అక్కతో మూడు గంటలు గడిపేందుకు అనుమతి ఇస్తున్నాం అని ప్రకటించింది తీర్పు… పిల్లలకు క్లారిటీ వచ్చింది… ఈమె బయోలాజికల్ తల్లి, కని పెంచుతున్న తల్లి, వారం వారం వచ్చే ఆమె కనిపించుకున్న తల్లి… మరి అద్దె కడుపు ఇచ్చిన తల్లి..? ఆమె అదృష్టవశాత్తూ ఈ కథలోకి రాలేదు, అక్కడికి పిల్లలు అదృష్టవంతులు..!!
Share this Article