.
Rajasekhar Paruchuri ……. తిలాపాపం – తలా పిడికెడు
ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతూంది ఆహారంగా… చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది.
Ads
అదే సమయానికి, గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా… ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్ల భామ… ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు, తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా, ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేసేడు. పితృ శేషం తిన్న బ్రాహ్మణుడూ మరణించాడు. పాము ముందే మరణించింది, గొల్లభామ, గద్ద కూడా మరణించారు.
ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమయింది, ఈ బ్రహ్మ హత్యాపాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాసేడు చిత్రగుప్తుడు… బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు చిత్రగుప్తుడు… అప్పుడు బ్రాహ్మణుడు, ధర్మ ప్రభో! ఇది అన్యాయం, ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు, నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టేను తప్పించి, ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు, అందుకు తప్పు నాది కాదు కనక పాపం నాది కాదన్నాడు.పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు, గొల్ల భామను విచారించాలి ప్రభో అన్నాడు.
గొల్ల భామను పిలిచి ఈ పాపం నీ ఖాతాలో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మేవు కనక, అదీకాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేసేవు కనక అంటే, బాబోయ్! నాది తప్పు కాదండి, నేను పాలు పెరుగు అమ్ముకుంటాను, నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు, తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా, నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పేను. గాలికి ఎగిరిపోతే తప్పునాది కాదు, అందుకు నాది తప్పు కాదు, కనక పాపం నాకు సంబంధం లేదంది.
గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదే తప్పనుకుని గాలిని పిలిచారు. గాలి వచ్చి దేవా! వీచడం నా లక్షణం, నా ధర్మం, నేను స్థంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం? అని పిలిచారు పాముని…
పాము ధర్మ ప్రభూ! నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్ళలో ఉన్నాను, ఏమి జరుగుతున్నది నాకే తెలియని స్థితి, ఎక్కడ విషం వదలిపెడుతున్నదీ కూడా చూడగల సమయం కాదు కనక, తప్పు నాది కాదు, ఈ బ్రహ్మ హత్యా పాతకం నాది కాదని మొర పెట్టుకుంది.
అప్పుడు, ఇక మిగిలింది గద్ద కనక, గద్దను పిలిచారు, ఈ పాపం నీదేనా? అన్నారు. మహాప్రభో! పాము నా అహారం, గగన విహారం నా లక్షణం, పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు, అందుచేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ ఈ బ్రహ్మ హత్యా పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మ రాజుకు కూడా బోధ పడలేదు, సమవర్తి అయివుండి కూడా…
అప్పుడు సమవర్తి చిత్రగుప్తుడిని ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ! భూలోకంలో ప్రజలు ఈ విషయంమీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒకరు, గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్ల భామ తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణునిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ! అని నివేదికలో సంగతి చెప్పేడు.
మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనక, తప్పు ఎవరిదో ఇదమిద్ధంగా తేలలేదు కనక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసీ, తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు.
అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు. అందుకే ఏ సంగతయినా పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు. ఏదయినా పాపం పంచుకోవడమే.
పుష్ప2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాట దుర్ఘటన కూడా దాదాపుగా పైన ఉదహరించిన కథ మాదిరిదే. ఆ పాపం ప్రీమియర్ షోకి కుటుంబంతో వెళ్ళిన తల్లిదండ్రులది, అప్రమత్తంగా లేని థియేటర్ యాజమాన్యానిది, ప్రమాదాన్ని ఊహించని హీరో సహా సినిమా యూనిట్‌ది, ప్రిమియర్ షోస్‌కి పర్మిషన్ ఇచ్ఛి చేతులు దులుపుకున్న ప్రభుత్వానిది, మొదటి రోజు మొదటిషోనే చూడాలనుకునే వెర్రి ప్రేక్షకుడిది…
Share this Article