Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాక్షసుడు సినిమాలో ఆ ముసలోడి పాత్ర గుర్తుందా..? ఎవరాయన..?!

February 7, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala …… రాక్షసుడు ముసలోడి కథ… రుద్రవీణ సినిమాలో చుట్టూపక్కల చూడరా కుర్రవాడా అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు.

ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన అపరిచితులు అనే కన్నడ డబ్బింగు సినిమాలోనూ వాసుదేవరావు తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Ads

అపరిచిత అనే కన్నడ సినిమాను ఆ తర్వాత రోజుల్లో ఓ మోస్తరు బూతు చిత్రాల దర్శకుడుగా నటుడుగా పాపులర్ అయిన కాశీనాథ్ డైరక్ట్ చేశాడు. ఇది నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. వింత శోభనం, జాక్ పాట్, పొగరుబోతు పెళ్లాం లాంటి టైటిల్స్ తో వచ్చిన బూతు హాస్య చిత్రాల దర్శకుడు కాశీనాథ్ తీసిన తొలి చిత్రం అపరిచిత తెలుగు ప్రేక్షకుల అపూర్వ ఆదరణకు నోచుకుంది.

పోస్టర్ల మీద వాసుదేవరావు, శోభ నటించిన అనీ , చిక్ మంగళూరులో జరిగిన ఓ యదార్ధ గాధ ఆధారంగా తీసిన చిత్రం అనీ వేశారు. శోభ అప్పటికే మనవూరి పాండవులు, ముల్లు- పువ్వు చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్ కు తెల్సిన నటి.

ఎమర్జన్సీ అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాయ్ బరేలీ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ ఓడిపోయి రాజ్ నారాయణ్ గెల్చారు. అప్పుడు ఇందిరమ్మను పార్లమెంటుకు పంపడానికి కర్ణాటకలోని చిక్ మంగలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచీ అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో గెలిచిన డి.బి చంద్రె గౌడ అనే ఎంపీ రాజీనామా చేశారు.

అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఇందిరాగాంధీ పోటీ చేశారు. ప్రత్యర్ధి జనతాపార్టీ అభ్యర్ధి వీరేంద్ర పాటిల్ మీద గెలుపొందారు. అలా చిక్ మంగళూరు కూడా అప్పటికి కాంగ్రెస్ ఫోల్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చాలా పాపులర్.

ఇందిర గెలుస్తుందా లేదా అని చాలా మంది ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన రోజు నిద్ర మాని రేడియోలకు అంటుకుపోయారు. ఇలా చిక్ మంగళూరు అని పోస్టర్ల మీద వేయగానే జనం ఇదేదో పొలిటికల్ మూవీయేమో అనుకున్నారు కూడా.

అలాగే వాసుదేవరావు అంటే ఆ సినిమాలో హీరోయేమో అనుకున్నారు. కానీ ఆ సినిమాలో హీరో పేరు సురేష్ హెల్బికర్. వాసుదేవరావు అంటే ఆ సినిమాలో తరచు కనిపించే ఓ వృద్దుడన్నమాట. ఆ వృద్దుడే ఆ తర్వాత రోజుల్లో రాక్షసుడు, రుద్రవీణ చిత్రాల్లో కనిపించిన వాడు.

నిజానికి అప్పటికే వాసుదేవరావు తెలుగులో స్ట్రెయిట్ మూవీలో యాక్ట్ చేశారు. ఆ సినిమా పేరు ఒక ఊరి కథ. దర్శకుడు జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడుగా పలుసార్లు అవార్డులు పుచ్చుకున్న బెంగాలీ మృణాళ్ సేన్. ప్రేమ్ చంద్ కఫన్ కథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో వాసుదేవరావు , నారాయణరావు తండ్రీ కొడుకులుగా నటించారు.

వాసుదేవరావు ఎంత అద్భుతంగా నటించాడో ఆ సినిమాలో. పెద్దోడు పేదోళ్ల శ్రమను దోచీ దోచీ బలుస్తాడు. పేదోడు పనిచేసీ చేసీ సత్తాడు. అంటే…. పనిచేయడం అనేది ఓ బలిసినోణ్ణి మరింత బలిసేలా చేయడమే. అందుకని పనిచేయడం తప్పు అనేది ఈ సినిమాలో వాసుదేవరావు ఫిలాసఫీ.

మరి పనిచేయకపోతే తిండి ఎలా అంటాడు కొడుకు. దారిదోపిడీలు చేసుకుంటూ తిందాం అంటాడు తండ్రి.
మృణాళ్ సేన్ దృష్టిలోకి వాసుదేవరావు ఎలా వచ్చాడు..? ఆ పాత్ర అతనితోనే ఎందుకు చేయించాడు అని ఆలోచిస్తే .. వాసుదేవరావు చరిత్రలోకి వెళ్లాలనిపిస్తుంది.

వాసుదేవరావు 1975లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు పుచ్చుకున్న నటుడు. అదీ తొలి చిత్రంతోనే. ఆ సినిమా పేరు చోమనదుడి. శివరామ్ కారంత్ రాసిన నవలను బి.వి.కారంత్ సినిమాగా తీశారు.
అందులో చోమ పాత్రలో నటించిన వాసుదేవరావు ను చాలా గొప్ప నటుడుగా పరిశ్రమ విశ్లేషకులు కూడా ఏక కాలంలో గుర్తించారు.

అసలు ఈ వాసుదేవరావు ఎవరు?
దక్షిణ కర్ణాటకలోని ముడిబిద్రెలో 1920 లో వాసుదేవరావు జన్మించారు. వాసుదేవరావు తండ్రి నారాయణరావు స్కూలు టీచరు. జీతాలు సరిగా రాకపోవడంతో పిల్లల్ని పెద్ద చదువులు చదివించలేకపోయారు. అయితే తన క్లాసు పిల్లలతో కొన్ని నాటకాలు వేయించేవారు. అలా రంగస్థలంతో అలవాటైన వాసుదేవరావు అప్పటి కర్ణాటక ప్రఖ్యాత రంగస్థల సంస్ధ గుబ్బిలో సభ్యుడయ్యాడు.

రంగస్థలం మీద భీష్ముడు, కుంతి, అభిమన్యుడు ఇలా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో జీవించేయడం ప్రారంభించాడు. పదేళ్ల వయసులోనే ఆయన ప్రొఫెనల్ కళాకారుడుగా మారిపోయాడు. స్టేజీ మీద పాపులర్ అయిన వాసుదేవరావుకు సినిమాల మీద ఎందుకో కొంత వ్యతిరేకత ఉండేది. కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చినా కాదన్నారు. ఆయన చోమనదుడిలో నడించే సమయానికి వయసు యాభై ఆరేళ్లు.

చోమనదుడి దర్శకుడు బి.వి.కారంత్ కు గుబ్బి కంపెనీతో సంబంధాలుండేవి. అలా వాసుదేవరావుతో కారంత్ కు స్నేహం ఉండేది. చోమనదుడి చిత్రంలో చోమ పాత్ర వాసుదేవరావుతో చేయించాలనుకున్న విషయాన్ని కారంత్ హంసగీతె నిర్మాత జి.వి. అయ్యర్ తో చర్చించారు. ఆయన ఓకే అనగానే వాసుదేవరావును అప్రోచ్ అయ్యారు.

కారంత్ తో ఉన్న స్నేహం కొద్దీ వాసుదేవరావు అంగీకరించారు. అలా ఆయన బాలనటుడుగా రంగస్థలం మీద కాలుపెట్టినా నడివయసులో సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కన్నుమూసే వరకు అంటే 2002 మార్చి నెల వరకు ఆయన ఆరోగ్యం సహకరించినంత వరకు నటన గురించే ఆలోచించారు.

సినిమాకు ఆయన ఎప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరైనా పిలిస్తే చేశారు. మణిరత్నం దర్శకత్వంలో ఒకటి రెండు సినిమాల్లో కనిపిస్తాడు. వాటిలో బొంబాయి ఒకటి. నాయకుడు సినిమాలోనూ కనిపిస్తారాయన.

అలాగే రాక్షసుడు, రుద్రవీణ చిత్రాలు. అలాగే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ లో కూడా ఉన్నారు ఆయన. అందుకే వాసుదేవరావు అనగానే థియేటర్ ఆర్టిస్టుగానే గుర్తొస్తాడు. కన్నడంలో మాత్రం కాస్త ఎక్కువ చిత్రాల్లోనే నటించారు.

ఆయన నటన గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఒక ఊరి కథ చూడాలి. మృణాళ్ సేన్ తో పాటు శ్యామ్ బెనగల్ సినిమాల్లో కూడా ఆయన నటించారు. వాసుదేవరావు నటించిన చిత్రాలన్నీ దాదాపు వాస్తవిక చిత్రాలే కావడం విశేషం. ఆయన పెద్దగా మేకప్ వేసుకోరు. తను ఎలా ఉంటే ఆలా నటించేయడమే తప్ప …

పాత్ర కోసం ప్రత్యేక కసరత్తులు చేయడం కనిపించదు. ఒక్క రాక్షసుడులో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో మాత్రం మేకప్ తో కనిపిస్తారు. అదీ కొద్ది సేపే. భారతీయ సినిమా రంగంలో గుర్తు పెట్టుకోవాల్సిన నటుడు వాసుదేవరావు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions