అయోధ్యపై ఇన్ని వార్తలు వస్తున్నాయి కదా… అక్కడ ప్రాణప్రతిష్ఠకు ముందే కొన్ని క్రతువులు సాఫీగా, శాస్త్రోక్తంగా సాగిపోతూనే ఉన్నయ్… గుడి పూర్తి కాలేదు, ముహూర్తం సరైంది కాదు, సతిని వదిలేసిన చేతులతో ప్రతిష్ఠ ఏమిటి, రాముడు అయోధ్యలోనే ఉన్నాడా, ఇది బీజేపీ నాటకం వంటి కుళ్లిన పాచి విమర్శల నడుమ ఓ కర్త (యజమాని) నిర్విఘ్నంగా, నిశ్శబ్దంగా ఆ క్రతువులు నిర్వహిస్తూనే ఉన్నాడు… మోడీ కాదు, మోడీ 22న ప్రాణప్రతిష్ఠకు వస్తాడు…
ఈయన పేరు డాక్టర్ అనిల్ మిశ్రా… భార్య ఉషా మిశ్రాతో కలిసి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు నిర్వహించాల్సిన మొత్తం తంతును తనే చేస్తున్నాడు… అసలు ఎవరీయన..? కోట్లాది మంది కలలు గనే ఈ అదృష్టం ఆయనకే ఎందుకు దక్కింది..? వారణాసికి చెందిన ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ప్రారంభమైన ఈ ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రతువుకు అనిల్ మిశ్రా ఎలా యజమాని కాగలిగాడు..?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో ఈయన కూడా ఓ సభ్యుడు… ఈ ట్రస్టే గుడి నిర్మాణం, శాస్త్రోక్త ప్రతిష్ఠ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది… ఈ ట్రస్టు చెప్పిందే ఫైనల్… వాళ్లు చెప్పే శాస్త్రమే ఫైనల్… ద్వేషసంపన్నులైన శంకరాచార్యులు గట్రా జాన్తా నై… ఈయన అయోధ్యవాసే… నాలుగు దశాబ్దాలుగా ఒక హోమియోపతి ఆసుపత్రిని నడిపిస్తున్నాడు… యూపీలోని అంబేడ్కర్ నగర్ జిల్లాలో పుట్టాడు… అయోధ్య ఆలయానికి సంబంధించిన అనేక విషయాల్లో ఆయనే కీలకం…
Ads
గతంలో గోండా జిల్లా హోమియోపతి అధికారి, యూపీ హోమియోపతి బోర్డు రిజిస్ట్రార్… రిటైరయ్యాడు… యాక్టివ్ ఆర్ఎస్ఎస్ సభ్యుడు, ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు… అయోధ్య ఉద్యమకారుడు… 1981లో హోమియోపతి వైద్యంలో గ్రాడ్యుయేటైన ఈయన సతీసమేతంగా ఉపవాస దీక్షలో ఉండి ఈ తంతును నిర్వహిస్తున్నాడు ఇప్పుడు… ట్రస్టు, పూజారులు తననే యజమానిగా ఖరారు చేశారు… అంటే కర్త… వేదపండితుడు గణేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో 121 మంది అర్చకులు ఈ తంతును జరిపిస్తున్నారు…
ఆల్రెడీ కలశస్థాపన కూడా పూర్తయింది… ఇప్పటికే అయోధ్య చేరిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తరలిస్తారు ఈరోజు… దానికి 22న మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది… కర్త సతీసమేతంగా తంతు నిర్వహించాలి కదా అనే సన్నాయినొక్కులకు సమాధానం ఈ పూర్వ తంతు… కీలకమైన ప్రొసీజర్ ఇప్పుడే జరిగేది… 22న మోడీ చేతుల మీదుగా జరిగేది కేవలం దీనికి ముక్తాయింపు ఘట్టం… రాజ్య ప్రధాన పాలకుడు కాబట్టి…!!
Share this Article