ఎవరైతే బెటర్..? ఇప్పుడు దేశంలో ఉన్న పాపులర్ తారల్లో ఎవరు సీత పాత్రకు బాగా సూటవుతారు..? అబ్బే, అందులో పెద్దగా చర్చించడానికి ఏముంది..? ఎవరైనా చేయగలరు..? ఎందరో తారలు సీత పాత్రల్ని పోషించలేదా..? న్యాయం చేయలేదా..? నాటి టీవీ రామాయణంలో దీపికి చికలియా నుంచి బాపు రామరాజ్యం నయనతార వరకు బోలెడు మంది సీత పాత్రల్ని పోషించారు.., ఇలాగే అనుకుంటాం కదా… కానీ నెటిజనంలో ఈ చర్చ జరుగుతోంది రెండు రోజులుగా… తలైవి, మణికర్ణిక పాత్రల్ని పోషించిన కంగనా రనౌత్ అయితే బెటరని కొందరు… అసలు ఇప్పుడు సీత పాత్రకు ఆలియా భట్ భలే సూటవుతుందని ఇంకొందరు… పద్మావత్ చూశాం కదా, దీపిక పడుకోన్ అయితే సీత పాత్రలో అదిరిపోతుందని మరికొందరు… ఇలా రకరకాలుగా సలహాలు ఇస్తూనే ఉన్నారు… కొందరు మరీ కరీనాకపూర్ పేరును, కొందరు నిత్యామేనన్ పేరును కూడా సూచించారు… ఎవరి అభిమానం వాళ్లది, ఎవరి అంచనా వాళ్లది… అసలు ఈ చర్చ ఎందుకంటారా..?
రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ తెలుసు కదా… తను కథ రాస్తే అది భారీ ప్రాజెక్టే… బాహుబలి, మణికర్ణిక, తలైవి, ఆర్ఆర్ఆర్… ఇలా చాలా… ఇప్పుడు తను సీత- ఓ అవతారం అనే సినిమాకు కథ రాస్తున్నాడు… దీనికి అలౌకిక్ దేశాయ్ దర్శకుడు… బాహుబలి తరహాలోనే భారీ గ్రాఫిక్స్ ఉంటాయట… పాన్ ఇండియా ప్రాజెక్టు… అంటే తెలుగు, తమిళ, మళయాళ, హిందీ, కన్నడ గట్రా చాలా భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారట… మరి పాన్ ఇండియా ప్రాజెక్టు అన్నప్పుడు నిత్యా మేనన్, కీర్తి సురేష్, కృతి శెట్టి, పూజా భట్, లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్, సాయిపల్లవి గట్రా సరిపోరు కదా… పాపులర్ హిందీ నటి అయితే బెటరట… అదీ చర్చ…
Ads
ఇప్పుడు ట్రెండ్ ఏమిటీ అంటే… పురాణాలను అన్ టోల్డ్ స్టోరీస్ పేరిట… వాటిల్లో ఎవరో ఓ పాత్రధారి కోణంలో కథను మళ్లీ చెప్పడం… అంతేతప్ప, అవేమీ అన్ టోల్డ్ కాదు… కాకపోతే ప్రచారం కోసం అలా చెబుతుంటారు… నవలల్లో ఈ ట్రెండ్ బాగా పెరిగింది… అది సినిమాలకూ వ్యాపించింది… ఆమధ్య ఓ భారీ నిర్మాత భీముడి కోణంలో మహాభారతం నిర్మించాలని ముందుకొచ్చాడు… అదెందుకో ఆగిపోయింది… ప్రభాస్ ఆదిపురుష్ కూడా రామాయణమే… తను ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో కదా, ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియాయే… తన పక్కన అనుష్క సీతగా నటిస్తుంది అని తెగ ప్రచారం చేశారు మొదట్లో… ఊర్వశి రౌతేలా పేరు కొన్నిరోజులు… చివరకు కృతి సనన్ పేరు దగ్గర ఆగిపోయారు… సేమ్, చర్చ ఇప్పుడు కొత్తగా ప్రకటించిన విజయేంద్ర ప్రసాదుడి సీత కోసమూ సాగుతోంది… ఇదీ కథ…
Share this Article