.
( రమణ కొంటికర్ల ) .. ….. మన దేశంలో మనవాడు ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అవ్వడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు ఇతర దేశాల్లో ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రుల పోటీల్లో మనవాళ్లు రేసుగుర్రాలవ్వడం విశేషం.
అందులో మాతృభాషపై చర్చ జరుగుతున్న వేళ… భాషాభిమానంపై తమిళులను పొగిడే కాలాన.. అలాంటి మాతృభాషా ప్రేమికుడు.. కెనడా చట్టసభలో తన కన్నడ మాతృభాషలో ప్రసంగించిన కన్నడీగుడు చంద్ర ఆర్య.. కెనడా ప్రధాని రేసులోకొచ్చి మరోసారి వార్తల్లో వ్యక్తయ్యాడు.
Ads
ఇప్పటికే పంజాబీ తల్లి, అనెస్థేషియన్ సరోజ్ డి రామ్, తమిళ తండ్రి ఆండీగా పిల్చుకునే ఎస్వీ. ఆనంద్ కూతురైన అనితా ఆనంద్ కూడా కెనడా ప్రధాని రేసులోకొచ్చి చర్చనీయాంశమైంది. అయితే ఆమె తప్పుకోవడంతో… ఇప్పుడు చర్చంతా చంద్ర ఆర్య గురించే.
అందులోనూ గత ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశం పట్ల వ్యవహరించిన తీరు, ఖలీస్తానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై తీవ్ర ఆరోపణలెదుర్కొన్న నేపథ్యంలో.. ట్రూడో సపోర్టర్ గా ఉంటూనే, ఆయన విధానాలను పూర్తిగా వ్యతిరేకించిన చంద్ర ఆర్య, అందులోనూ భారతీయ కెనడియన్ అవ్వడంతో ఆయన లైఫ్ జర్నీ గురించి సహజంగానే ఆసక్తి నెలకొంటుంది.
ఇంతకీ చంద్ర ఆర్య మూలాలేంటి.. ఆయనెలా కెనడా ప్రధాని బరిలోకొచ్చాడో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం.
కెనడా ఓటర్స్ అభిప్రాయం, పార్టీలోని అంతర్గత కలహాల నేపథ్యంలో జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత.. లిబరల్ పార్టీ నాయకత్వం కెనడా ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన నాయకుడు చంద్ర ఆర్య.
చంద్ర ఆర్య నేపియన్ పార్లమెంట్ సభ్యుడు. 2025 మార్చ్ 9వ తేదీన కొత్త నాయకుడిని ప్రధానిగా ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైనందున.. లిబరల్ పార్టీ నాయకత్వం చంద్ర ఆర్యను తమ ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. లిబరల్ పార్టీ అధికారిక ప్రకటనకు ముందే.. చంద్ర ఆర్య కూడా తానే ప్రధాని అభ్యర్థినంటూ కూడా ఓ ప్రకటన చేశారు.
తన సోషల్ మీడియా ఖాతా X వేదికగా ఓ పోస్టులో ఆయన పేర్కొన్న సందేశం కూడా పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. మన దేశాన్ని పునర్నిర్మించడానికి, భవిష్యత్ తరాల శ్రేయస్సు, భద్రత కోసం.. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని నడిపించేదుకు నేను ప్రధానమంత్రి రేసులో ఉండబోతున్నానేది ఆ సందేశం.
తన ఆలోచనాత్మక నిర్ణయాలతో సమస్యలను పరిష్కరించి సుస్థిరమైన పాలననందిస్తాని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్న విధానం కెనడాపై తనకున్న మమకారాన్ని చెప్పింది. ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి కఠినమైన నిర్ణయాలకూ తాను వెనుకాడనంటూ కెనడా భవిష్యత్తుపై తానెలా నమూనా కాబోతున్నాడో చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా కెనడాను గణతంత్ర రాజ్యంగా మారుస్తానని శపథం చేస్తున్నాడు. అలాగే, పాలస్తీనాను దేశంగా గుర్తిస్తాననీ చెబుతున్నాడు. మొత్తంగా రీబిల్డ్ కెనడా ఇప్పుడు చంద్ర ఆర్య నినాదం.
అసలెవరు ఈ చంద్ర ఆర్య…?
కన్నడీగుడు. కర్నాటకలోని తుంకూరు జిల్లా ద్వార్లు గ్రామానికి చెందిన చంద్ర ఆర్య .. కర్నాటక ధార్వాడ్ లోని కౌసాలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి తన ఎంబీఏ పూర్తయ్యాక.. పట్టా పుచ్చుకుని 2006లో కెనడా వెళ్లాడు. ఇంజనీరింగ్ అండ్ ఫైనాన్స్ నేపథ్యం కల్గినవాడు. 2015 నుంచి నేపియన్ ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు. గతంలో ఓ హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో పెట్టుబడి సలహాదారుగా, ఎగ్జిక్యూటివ్ గా కూడా పనిచేశాడు.
అయితే, అంతకంటే విశేషమేంటంటే… కెనడియన్ హిందూ సమాజానికి గొంతుకగా చంద్ర ఆర్య క్రేజ్ సంపాదించుకున్నాడు. వివాదాలకు దూరంగా జరిగి నాకెందుకులే అనుకునే తత్వం కాకపోవడం… ఫైటింగ్ స్పిరిట్ ఆర్యలో ప్రత్యేకతలు. తన సొంత పార్టీ సభ్యులతో కూడా తరచూ ఘర్షణ పడ్డ నేపథ్యమూ చంద్ర ఆర్యది.
భారత్-కెనడా సంబంధాలపై… ఖలీస్తానీ తీవ్రవాదం వంటి సమస్యలపైన తన అభిప్రాయాలను చట్టసభల ద్వారా, అలాగే ప్రజాక్షేత్రంలోనూ బలంగా వినిపిస్తూ వస్తున్నాడు. జస్టిన్ ట్రూడోకు ముందు మద్దతుదారుడిగా ఉన్న చంద్ర ఆర్య.. ఖలీస్తానీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండంటపై ట్రూడోతోనూ విభేదించడం మొదలుపెట్టాడు.
బ్రాంప్టన్ లో కెనడా న్యూడెమక్రటిక్ పార్టీ లీడర్ జగ్మీత్ సింగ్ ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ లో హిందూ ఆలయాలపై జరిగిన దాడి ఘటనలు, నిరసనలను తీవ్రంగా విభేదించాడు. ఆ సమయంలో జగ్మీత్ సింగ్.. చంద్ర ఆర్య నిప్పుకు మరింత ఆజ్యం పోస్తున్నాడంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టాడు.
అయినా, చంద్ర ఆర్య వెనక్కి తగ్గలేదు సరికదా.. ఖలీస్తానీ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా తన గళం వినిపించాడు. అదే సమయంలో కెనడియన్ పార్లమెంట్ ముందు కాషాయరంగు జెండాను రెపరెపలాడించి కెనడాలో హిందువుల రిప్రజంటేషన్ ను బలపర్చేందుకు పిలుపునిచ్చాడు. కెనడియన్ హిందువులు రాజకీయశక్తిగా మారకపోతే జరిగే ప్రమాదాన్నీ అక్కడి హిందూ సమాజానికి గుర్తుచేసే యత్నం చేశాడు.
2022లో చంద్ర ఆర్య హౌజ్ ఆఫ్ కామన్స్ మెంబర్ గా కన్నడంలో ప్రసంగించాడు. భారతదేశం వెలుపల ఒక చట్టసభలో తమ మూలాలను ప్రదర్శిస్తూ భాషపైనున్న అభిమానంతో మాట్లాడిన మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా కూడా ఆర్య ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
తను కన్నడలో ప్రసగించిన వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన మాతృభాష ఎంతో అందమైందంటూ పొగడ్తలు గుప్పించాడు. 5 కోట్ల మంది మాట్లాడే తన కన్నడభాషకు గొప్ప చారిత్రక నేపథ్యముందంటూ కెనడియన్ హౌజ్ ఆఫ్ కామన్స్ లో కన్నడను ప్రత్యేకంగా నిలిపాడు.
తన ప్రభుత్వ క్యాబినెట్ కూర్పులోనూ రిజర్వేషన్ కోటా కంటే కూడా.. మెరిట్ కే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్న నాయకుడు చంద్ర ఆర్య. ప్రభావవంతమైన ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే అది తప్పనిసరన్న బలమైన విశ్వాసంతో అడుగులేస్తున్నవాడు. గత ఏడాది భారత్ కు వచ్చిన చంద్ర ఆర్య ప్రధాని మోడీతో భేటీ అయ్యాడు. అయితే, కెనడా ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన మోడీని కలవడం కెనడా గ్లోబల్ అఫైర్స్ శాఖలోనూ చర్చనీయాంశమైంది.
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ పోటీ నుంచి వైదొలిగాక ఆర్య రేసులోకి వచ్చాడు. పోటీ కూడా వేడెక్కింది. ట్రూడో రాజీనామా తర్వాత కెనడాలో నెలకొన్న నాయకత్వ శూన్యతను భర్తీ చేయడానికి ఆర్య ఎంతవరకూ సమర్థంగా ముందుకెళ్తారన్నది ఇప్పుడక్కడి పొలిటికల్ సర్కిల్స్ నిశితంగా పరిశీలిస్తున్నాయి.
లిబరల్ పార్టీకి చెందిన చంద్ర ఆర్యకు ట్రూడో రాజీనామాతో కెనడా ప్రధాని పీఠాన్ని అధిరోహించే రేసులోకి ఎంటరయ్యే అవకాశం దక్కింది. మరి మన భారతీయుడు, కన్నడీగుడు చంద్ర ఆర్య ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తాడా.. అదే ఫలిస్తే, ఆయన నాయకత్వంలో కెనడా రాజకీయాలెలా ఉండబోతాయన్నది మరింత ఆసక్తికరం…
Share this Article