అందరికీ అర్థమవుతూనే ఉంది… లక్షల మందికి కరోనా సోకుతోంది… లక్షణాలు కూడా లేకుండానే నయం అయిపోతోంది… కొంతమందిలో మాత్రమే లక్షణాలు బయటికి కనిపిస్తున్నాయి… మరీ తక్కువ మందికి మాత్రమే హాస్పిటల్ చికిత్స అవసరమవుతోంది… అధికశాతం హోం క్వారంటైన్‌తోనే సరిపోతోంది… ఇదంతా ఎలా సాధ్యమైంది..? వేక్సిన్ లేదు, ఏమీ లేదు… సహజసిద్ధమైన మన రోగనిరోధకశక్తి వల్ల… క్రమేపీ మన సమాజంలో వ్యాప్తి చెందిన హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల…! అయితే మన దేశంలో ఇప్పటికే ఎంతమందికి కరోనా సోకి, వెళ్లిపోయి ఉంటుంది..? ఇదీ ప్రశ్న… దీనికి జవాబు 100 కోట్లు…!!
నమ్మేట్టు లేదు కదా… కానీ మేథమెటికల్ మోడ్, సీరలాజికల్ లెక్కలు చెబుతున్నది అదే… ఈ విధానంలో పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్న థైరోకేర్ సంస్థ ఫౌండర్ ఎ.వేలుమణి ఏమంటాడంటే..? ‘‘సైలెంటుగా ప్రకృతి మన దేశంలోని 70 శాతం మందిని ఆ కరోనా నుంచి విముక్తం చేసేసింది’’
Ads
అంటే సుమారు 100 కోట్లు..! అయితే ఆ శాస్త్రీయ అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చుగాక… ఇప్పుడు సమస్య ఏమిటంటే..? వేక్సిన్ ముందుగా ఎవరికి..? మొత్తం జనాభాకు ఇప్పటికిప్పుడు వేక్సిన్ వేయలేం… మరి ఎవరికి ముందుగా వేయాలి..? ప్రధాని కూడా అంటున్నాడు, బాబూ, ఎగబడకండి అని..! నిజం… ఫస్ట్ ఆఫ్ ఆల్… ఎగబడేది ఎవరంటే..? రాజకీయ నాయకులు, వారి అనుచరగణం, సిబ్బంది, బంధుగణం, ఉన్నతాధికారులు… నిజానికి వేయాల్సింది ముందుగా ఆరోగ్యసిబ్బందికి… డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ మొత్తం… దీనికి ప్రభుత్వం రెడీ అయిపోయింది… 210 రూపాయల చొప్పున వేక్సిన్ కొని, ఫ్రీగా వేయించబోతోంది… గుడ్…
ఆ తరువాత పోలీసులు, పారిశుధ్య సిబ్బంది వచ్చి క్యూలలో నిలుచుంటారు… సమాజాన్ని ప్రభావితం చేసే సెక్షన్స్ లాయర్లు, జర్నలిస్టులు గట్రా తదుపరి వచ్చేస్తారు… ప్రంట్ లైన్ వారియార్స్ అనే ఓ భ్రమాత్మక పదం దీనికి ప్రాతపదిక… కానీ నిపుణుల అభిప్రాయం వేరు… ప్రపంచం మొత్తమ్మీద 99 శాతం మరణాల రేటు ఉన్నది 70 ఏళ్లు పైబడిన వాళ్లలో… అంతేకాదు, బీపీ, సుగర్, ఆస్తమా వంటి వ్యాధులున్నవాళ్లలో… అదుగో వాళ్లకు ముందుగా వేక్సిన్లు అవసరం… ఆ దిశగా ప్రభుత్వ ఆలోచనలు నిర్దిష్టంగా లేవు… ప్రధాని 50 ఏళ్ల వయస్సు దాటినవాళ్లకు వేక్సిన్ అంటున్నాడు… ఫ్రీయా..? కాదా..? క్లారిటీ లేదు… 18 ఏళ్లలోపు పిల్లలకు వేక్సినేషన్ అవసరం లేదట… ఎందుకంటే, వేక్సిన్ ట్రయల్స్ ఆ వయస్సు కేటగిరీలో చేయలేదు కాబట్టి… మరి వాళ్లకు వేక్సిన్ అవసరం లేదా..?
ఇక్కడ ఓ ప్రధానమైన సమస్య వేరే ఉంది… ఆల్రెడీ కరోనా నుంచి కోలుకున్నవారికి వేక్సిన్ వేస్ట్… నేచురల్ రోగనిరోధకశక్తి ద్వారా కోలుకున్న వారికి టీకా వేయడం వృథా మాత్రమే కాదు, కొన్నిసార్లు సహజమైన రోగనిరోధక సామర్థ్యాన్ని బలహీనపరిచినట్టు అవుతుంది… మరి ఇప్పుడు ఈ 100 కోట్ల మందికీ టీకా వేస్టేనా..? దీనిపై ఓ నిశ్చితమైన ఫోకస్, ధ్యాస ప్రభుత్వం వైపు నుంచి కనిపించడం లేదు… అసలు చాలామందికి లక్షణాలు కూడా లేకుండానే, వాళ్లకు తెలియకుండానే కరోనా వచ్చి పోతే… మరి ఎవరు విముక్తులో కాదో ఎలా తెలిసేది..? అంతమందిలోనూ యాంటీబాడీస్, టీసెల్స్, బీసెల్స్ ఉనికిని గుర్తించే కోట్ల పరీక్షలు చేయడం సాధ్యమేనా..?
ప్రయారిటీ అనే అంశం దగ్గర ఇంకో చిక్కు ఉంది… పట్టణాలు, నగరాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువ… అదీ కొన్ని రాష్ట్రాల్లోనే… తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ… వాటిని కాదని పశ్చిమ, దక్షిణ రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యమేనా..? ఒక వైరస్ ఉనికిని మనం పూర్తిగా నిర్మూలించలేం… బహుశా స్మాల్ పాక్స్ మాత్రమే పూర్తిగా నిర్మూలన జరిగిందేమో… దానికీ దశాబ్దాలు పట్టింది… వచ్చీపోయే వైరసులకు సమాజమే ఇమ్యూనిటీ సాధిస్తోంది… అదే అత్యుత్తమం… అందుకని వేక్సినేషన్ మీద అనవసర హంగామా, ప్రణాళికలేమి అదనపు నష్టమే అనేది నిపుణుల అభిప్రాయం… ఐనా వినేవాళ్లెవరు..? వేక్సిన్ వేయించుకోవాల్సిందే అనే తొందరపాటు కూడా వైరస్‌లా వ్యాపిస్తుందేమో…!!
Share this Article