.
Raghu Mandaati
……. మనిషికి నరదిష్టి, నరగోష భయంకరమైనది అని నాకు చెప్తున్నప్పుడల్లా, చిన్నప్పుడు మా అమ్మ నా ఎడమ కాలికి పాదం కింద మధ్యలో కాటుక చుక్క పెట్టి పౌడర్ వేసినప్పుడు కాసేపు దాకా ఆ కాటుక చుక్క చెరిగిపోతే ఎలా అని ఆ అడుగు నెమ్మదిగా వేసే రోజులు గుర్తొచ్చేవి…
ఉదయం లేవగానే ఊపిరి తీసుకుంటున్నానంటే అదే ఆ రోజుకు మొదటి విజయం. నేను ఉన్నా లేకున్నా ఏది ఎవరికోసం ఆగదు అని తెలిసి, నీ మనసు ఎప్పుడైతే అన్నింటికీ సిద్ధం అవ్వుద్దో… అప్పటి నుండి ఎవరి మీద, ఎవరి భావజాలం మీద ఎలాంటి ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఏర్పరుచుకోవడం మానేసాను..
Ads
నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నన్ను కూడా తన కొడుకుగా భావించింది.., సినిమాటిక ఎక్స్పో కార్యనిర్వహణ సిబ్బందిలో నేను ఒక భాగం… ఆ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ గారి ప్రోగ్రాం కోసం ఏర్పాట్లలో ఉండగా అందరు కాల్ చేస్తుంటే, నాకు తెలిసిన వాళ్లకి తెలియని వాళ్లందరికి, అడిగిన ప్రతి ఒక్కరికి పాసెస్ ఇచ్చాను ఆ ప్రోగ్రాం చూస్తాను అంటే…
ఆ రకంగా అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి నానా… అని నాకు దిష్టి తీసి, ఒక నిమ్మకాయ జేబులో పెట్టుకో… సూట్ ఏసుకుంటే సరిపోదు, మనకు సూట్ అయ్యో రక్షణ కూడా పెట్టుకోవాలి అని ప్రేమగా జేబులో నిమ్మకాయ పెట్టింది,,. ఇది ప్రోగ్రాం అయ్యేంత వరకు తీసేయ్యకు అని గట్టిగా వార్నింగ్ మాదిరి ఇచ్చింది,,.
మాటల వల్ల కాదు కానీ, మన బాగోగులు మనకన్నా ముందే గుర్తించే హృదయం వల్లే మనం బతుకుతాం.
నిజంగా నేను ఆ రోజంతా వందల మందిని కలిసాను. రోజంతా కలియ తిరుగుతూనే ఉన్నా నిమ్మకాయని జేబులో పెట్టుకొనే… నిమ్మకాయ అని కాస్త విడ్డురం అనిపించినా… ఆ నిమ్మకాయలో నాకు ఏం కాకూడదనే దీవెన దాగి ఉంది. మనిషి నమ్మకం దాగి ఉంది…
- అంతకు మించి మనల్ని కనకపోయినా మన కలల్ని వారి కలలుగా, మన ఎదుగుదలని వారి ఆనందాలుగా స్వీకరించే మంచి మనసు ఉంది. ఒక చిన్న నిమ్మకాయ చుట్టూ ఇంతటి మనో బలాన్ని అల్లుకొని నా వెంట ఉన్నప్పుడు. చిన్న నిమ్మకాయలో ఇంత ప్రేమ దాగున్నప్పుడు… నమ్మకం ఏ రూపంలో వచ్చినా, దాన్ని హేళన చేయడం కన్నా హృదయంతో ఆమోదించడం గొప్ప పూజ అని తెలుసుకున్నాను.
పెళ్లి తంతు తర్వాత సత్యనారాయణ వ్రతం ఉంటుంది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా కొన్ని వందలసార్లు పూజ తంతును వ్రత కథను చూస్తూ రికార్డు చేసాను. బహుశా పంతుళ్ళ తర్వాత అన్ని ఎక్కువ సార్లు పాల్గొనే అవకాశం మా ఫోటోగ్రాఫర్లకు మాత్రమే ఉంటుందేమో…
శివాలయంలో అభిషేకంలో పాల్గొన్నప్పుడు, గంగాజలం శిరస్సుపై పడినప్పుడల్లా పాపాలు కరిగిపోతున్నాయన్న భావన.
హనుమాన్ మందిరంలో పప్పు బెల్లం వెన్న ముద్దతో కలిపిన ప్రసాదం గుండా భక్తుల నమ్మకాల్లో నేనూ ఒక్కడిని…
దర్గాలో మొక్కు తీర్చుకున్నాక కొబ్బరి కాయ కొట్టడం, అందులో గులాబి రేకులను వేసి కోవా బిళ్ళ పెట్టి ఇవ్వడం నా మనసులోకి వెళ్లే మార్గాలు.
హిమాలయాల్లో ఓ సన్యాసి చేతిలో వున్న రుద్రాక్ష నాకిచ్చి, ఇది నిన్ను పిలిచింది కాబట్టే ఈ నిమిషం ఇక్కడ ఉన్నావ్ అనే మాటలు, అప్పుడు ఆ గాలి మధ్య ఏదో ఓ బలమైన పిలుపు విన్నట్టే అనిపించింది.
వాయానాడ్ లో వర్షం పడుతున్న రాత్రి నెత్తి మీద కొబ్బరికాయ నీళ్లు ఆశీర్వాదంగా పోసి, దెయ్యం వెళ్లిపోతుందంటూ ఓ పండితుడు చేసిన క్రతు, కాశ్మీర్ లో ఓ బౌద్ధ సన్యాసి ఇది శూన్యం కాదు బేటా, ఇది నిన్ను నువ్వు మళ్ళీ కనుక్కోడానికి దారి అన్న మాట.
భూటాన్లో జ్వరం తగ్గితే నూట ఎనిమిది పొడవాటి రెప రెపలాడే జెండాల్ని పాతిపెట్టడం. ప్రతి ఇంటి దగ్గర ఓ గొట్టం లాంటి గుండ్రటి ప్రార్థనా చక్రం పెట్టుకుంటారు. ప్రతి తిప్పు ఓ ప్రార్థనగా భావిస్తారు. పర్వతాల మధ్య ఓ మోనాస్టరీ వద్ద ఓ సన్యాసి అన్నాడు మీరు మౌనంగా ఉన్నప్పుడే మీరు నిజంగా ప్రార్థిస్తున్నట్టు అని.
కంభోడియా అన్కోర్ వాట్ దేవాలయంలో, ఉదయం మొదటి కిరణం శిఖరం మీద పడే క్షణం కోసం మిలియన్ల మంది వేచి చూస్తారు. వాళ్ల నమ్మకం ఒక్కటే,
ఈ కిరణం మన గత జన్మలను తాకుతుంది, ఆ కిరణం జన్మను పునీతం చేస్తుందని నమ్మకంతో…
నేను ఒక తామర పువ్వుతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంటే..
ఒక వ్యక్తి నా చేతిలో ఉన్న తామరను చూసి అన్నాడు
ఆ కమలం నీ నుండి పుట్టింది. ఆ పుట్టిన కమలం నుండే నీ ప్రపంచం మొదలయ్యింది. నువ్వెవరో తెలిసిన నాడు నీకు దేవుడు అవసరం ఉండదు ఎందుకంటే అప్పటికి దేవుడు నువ్వు వేరుగా లేవని గ్రహిస్తావు అని.
మలేషయా థైవుసమ్మి పండుగలో,
తమిళ హిందువులు తమ శరీరాన్ని సూదులతో గుచ్చుకుని, భక్తితో నడుస్తారు.
ఒక భక్తుడు చెప్పిన మాట ఇంకా గుర్తు. వేదన ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి, ఆత్మతో సంభాషించాలి.
వియత్నాంలో, చిన్న గుడిసెల ముందు చిన్న బుద్ధ విగ్రహం, పక్కన వేడి వేడి ఉడకబెట్టిన నారింజ లేదా కొబ్బరిని నైవేద్యంగా పెడతారు మరణించిన వాళ్లకు వేడి ఆహారం సాంత్వననిస్తుంది. వారి సాంత్వన మనకు ఆశీర్వాదం అని నమ్మకం.
మసాయ్ గిరిజనులు తమ పిల్లలకి చిన్నప్పుడే రక్తం కళ్ళ చూపించి గ్రామ దేవతల ముందు పరుగెట్టిస్తారు.
అప్పుడే మనిషిలో భయం తొలగుతుంది. భయం లేని మనిషే దైవానికి దగ్గరవుతాడని వారి నమ్మకం.
కజకిస్థాన్ ఉజ్బెకిస్థాన్ తజికిస్తాన్
ఇస్లామిక్ మతాచారాలు అక్కడ ప్రేమగా నింపబడ్డాయి.
ఓ మజీదులో ఒక ముసలి మౌల్వి ఒక మాట అన్నాడు.
దేవుడు వింటాడని కాదు, మనం మన మనసుని మనస్ఫూర్తిగా మోకరిల్లి తన ముందు పరచడమే ప్రార్థన.
ఫిలిప్పీన్స్ క్రైస్తవ దేశం అయినప్పటికీ, అక్కడి ప్రజలు స్తో నీనో అనే చిన్న యేసు విగ్రహాన్ని చిన్న పిల్లలుగా కొలుస్తారు. ఓ వృద్ధ మహిళ కన్నీళ్ళతో చెప్పింది
ఈ బొమ్మ నా కొడుకు లాంటిది, నేను దీనికి తినిపించి, నిద్రపుచ్చి, ప్రేమిస్తాను అని..
జార్జీయా చర్చిల్లో ప్రార్థన అంటే పాట. పాట లేకుండా ప్రార్ధన ఉండదు. ఓ యువతి నా భుజాన్ని తట్టి నన్ను ఆ పాటలో గొంతు కలపని సైగ చేసింది. అవసరమొస్తే భాష కాదు, అనుభూతే పూజగా మారుతుంది.
ఇక్కడ దేవుడు రూపమైతే, అక్కడ స్పర్శ.
అక్కడ ప్రార్థన శబ్దమైతే, ఇక్కడ మౌనం.
ప్రతి ఆచారం వెనుక నమ్మకం ఉండకపోవచ్చు. కానీ ప్రతి నమ్మకానికి ఒక కథ మాత్రం ఉంటుంది.
నువ్వు ఎక్కడ పడ్డావో కంటే. నిన్నెవరెవరు అక్కున చేర్చారో గుర్తు పెట్టుకో. అదే నిజమైన దేవతల పలుకు.
నా విజయానికి కారణం దేవుడు కావొచ్చు, కాకపోవచ్చు కానీ నా వైఫల్యాల్లోనూ నన్ను పట్టుకున్న వాళ్ళే నా ధైవాలు…
.
.
రఘు మందాటి
Share this Article