.
Rama Mohan R Karnam …. హీరోలెవరు ? సొసైటీకి విలన్లు ఎవరు..?
అమెరికన్ సమాజంలోనూ, మీడియాలోనూ నాకు నచ్చిన విషయం -. సినిమా వాళ్ళని “హీరో” అనరు. లీడ్ యాక్టర్ అంటారు. లీడ్ యాక్టర్ గా ఎంత ఇరగదీసినా “ఫిలిం స్టార్ ” అంటారు అంతే.
Ads
నిజ జీవితంలో స్పూర్తివంతమైన, సాహసోపేతమైన పని చేసి.. కొందరు వ్యక్తుల ప్రాణాలనో, దేశ గౌరవాన్నో కాపాడినవాడిని “హీరో” అంటారు. అది కూడా జీవితకాల బిరుదు కాదు. ఆ సందర్భానికి మాత్రమే.
స్టార్ కీ, హీరోకీ చాలా తేడా ఉంది. స్టార్ అంటే లక్షల నక్షత్రాలలో ఒకటి .. ఆ ఒక్కటి తగ్గినా, మరొక వంద చేరినా ఏమీ తేడా ఉండదు. అది కేవలం ఆకర్షణని మాత్రమే సూచిస్తుంది, సామాజిక ప్రయోజనాన్ని కాదు. కానీ హీరో చర్యలకి సామాజిక ప్రయోజనం ఉంటుంది.
ఉదాహరణకి..సెప్టెంబర్ 11, 2001 న విమానాలని హైజాక్ చేసి కీలక అమెరికన్ భవనాల మీద దాడి చేసినప్పుడు ఒక్క విమానంలో మాత్రం ప్రయాణీకులు ఎదురుతిరిగి “పెంటగాన్” ని కాపాడారు. వాళ్ళని 9/11 హీరోలు అంటారు. ఆ సందర్భానికి మాత్రమే వాళ్ళు హీరోలు. వాళ్ళలో అనేకమంది చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. బిన్ లాడెన్ ని చంపిన ఆరుగురు న్యావీ యోధుల్లో ఒకరిని ఆ తరువాత దుష్ప్రవర్తన కారణంగా ఉద్యోగం నుంచి తీసేశారు. అయినా అతను ఆ సందర్భానికి హీరోనే!
జన జీవితాన్ని మెరుగుపరచే ఒకదాన్ని ఆవిష్కరించిన వారు హీరోలు. పౌరసమాజంలో ఒకరి ప్రాణాలని మరొకరి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టకుండా కాపాడిన వారు హీరోలు. అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళు కాదు. వాషింగ్టన్ రాష్ట్రంలో కొన్నేళ్ళ క్రితం బ్యాంక్ దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగతో కలబడి ఒక బ్యాంకు టెల్లర్ తుపాకీ లాక్కుని అతని మీద దాడిచేసి పోలీసులకి పట్టించాడు. అతన్ని హీరో అనలేదు సరికదా అతని ఉద్యోగం పోయింది.
ఆ క్రీడ కొంచెం తారుమారు అయి ఉంటే బ్యాంక్ లో అందరి ప్రాణాలు పోయి ఉండేవి. అలాంటి పరిస్తితి వస్తే నోరు మూసుకుని వాడు అడిగింది ఇచ్చి తర్వాత పోలీసులకి ఫోన్ చెయ్యాలన్నది ఆ బ్యాంకు ఉద్యోగులు ఫాలో కావాల్సిన మార్గదర్శక సూత్రం.
కాబట్టి నిజ జీవితంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓవర్ యాక్షన్ చేసే వారిని కూడా ‘హీరో’ అనకూడదు. కానీ మనం సినిమాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్రల్ని పోషించే నటుల్ని కూడా “హీరో” అంటాం. ఎంత దౌర్భాగ్యం!
బేసికల్ గా మనకి హీరోకీ , వేషగాడికీ నడుమ తేడా తెలియదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? వీరిలో ఎవరు పెద్ద హీరో ? నా కొడుకుని హీరో చెయ్యాలి, మా ఇంట్లో అందరూ హీరోలే.. ఇలాంటి మాటలు వేషగాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడ్డం వ్యాకరణ రీత్యా బండ బూతు. జనం ఈ వేషగాళ్ళని నిజంగానే హీరోలు అనుకుంటున్నారు కాబట్టి డబ్బున్న ప్రతోడూ వేరే ఏ పనీ చేతగాని తమ కుమార రత్నాల్ని స్వంత డబ్బులతో ‘హీరో’ చెయ్యడం మన సమాజానికి పట్టిన పీడ.
.
పోనీ, ఆ ‘హీరో వేషగాడై’నా కనీసం సినిమాల్లోనయినా హీరోయిక్ పనులు చేస్తున్నాడా? కనీసం “నటన” అనే కళనైనా మనల్ని మురిపించే విధంగా ప్రదర్శిస్తున్నాడా? కోపం వస్తే ఆ బ్యాంక్ టెల్లర్ లాగా ఎవరిని బడితే వారిని చితక బాదే (అది కూడా డూప్ ని పెట్టుకుని ) స్థాయికి హీరో వేషాన్ని దిగజార్చాం.
కనీసం నటనలోనయినా నిష్ణాతులా? వాడికంటే వందరెట్లు ట్యాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ నుంచి కొంత డ్యాన్సూ, వాడికంటే వందరెట్లు ట్యాలెంట్ ఉన్న ఫైట్ మాస్టర్ నుంచి కొంత ఫైటూ, వాడికంటే వందరెట్లు ట్యాలెంట్ ఉన్న గాయకుడి గాత్రమూ, మేకప్ మ్యాన్, డైరెక్టర్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్.. లాంటి అనేకమంది నుంచి కొంచెం కొంచెం ట్యాలెంట్ ని డబ్బులతో కొనుక్కుని తాత్కాలికంగా అతికించుకుని మన ముందు ప్రదర్శించే వాడిని మనం “హీరో” అంటున్నాం.
కనీసం వాడు స్టార్ కూడా కాకూడదు. ఈ వేషగాళ్లతో కొన్ని నెలలు రూమ్ మేట్ గా ఉంటే చాలు, మళ్ళీ జీవితంలో వాళ్ళ మొహం చూడకూడదనిపించేటంత జుగుప్సాకర ప్రవర్తన కలిగి ఉంటారు చాలామంది.
అయితే సమాజంలో హీరోలు లేరా ? ఉన్నారు. బోలెడంత మంది ఉన్నారు. దాదాపు ప్రతి ఊర్లో ఉన్నారు. మరి మనకి “హీరో వేషగాళ్ళు” తప్ప హీరోలు పెద్దగా కనిపించరు ఎందుకు?
మొదటి కారణం – మన సమాజంలో “హీరో” అనేవాడు చచ్చినట్టు జీవితమంతా హీరోయిక్ పనులే చేస్తూ ఉండాలి. వాస్తవ జీవితంలో అది సాధ్యం కాదు. కే.పి.యస్ గిల్ అనే పోలీస్ బాస్ పంజాబ్ టెర్రరిజాన్ని అణచివేసిన హీరో. ఆయనే ఒక సీనియర్ లేడీ IAS ఆఫీసర్ పట్ల దుష్ప్రవర్తన కేసులో దోషి. ఒక సందర్భంలో హీరో, మరొక సందర్భంలో విలన్.
మొదటి విషయంలో అభిమానిస్తూనే రెండవ విషయంలో అసహ్యించుకోవచ్చు. కాని మన సంస్కృతిలో ఉంటే పూర్తి హీరోగానూ, లేదా పూర్తి విలన్ గానూ ఉండాల్సిందే. ఈ జీవిత కాలపు “ బ్రాండింగ్ “ వేసే అలవాటు జనాల్లో వేళ్ళూనుకుని ఉండడం వల్ల “పని ఆధారిత” అభిప్రాయాలు కాకుండా “వ్యక్తి ఆధారిత” అభిప్రాయాలు రాజ్యమేలుతూ ఉన్నందువల్ల, చిరకాలం హీరో పనులు చెయ్యడం సినిమాల్లోనే సాధ్యం గనుక హీరో వేషగాళ్లనే హీరోలుగా చూపించే వ్యసనాన్ని మీడియా అలవరచుకుంది.
రెండవ కారణం – నిజమైన హీరోల్లో అనేకమంది ఊరి స్థాయి, జిల్లా స్థాయిలో అనాకర్షణీయంగా ఉంటారు . మన మీడియా హీరోనీ, హీరోయిక్ పనినే కాకుండా హీరో కుటుంబం మొత్తాన్నీ, పుట్టుపూర్వోత్తరాలనీ, చిన్నప్పటి ఫోటోలనీ, కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్స్ నీ మొత్తం బయటికి లాగి మసాలా కూర్చి ప్రోగ్రామ్ చెయ్యాలి కాబట్టి, ఆ రూరల్ హీరోల విషయంలో అలాంటి మసాలా అరుదు కాబట్టి, జనానికి పేలవంగా అనిపిస్తాయి కాబట్టి మీడియా ఈ నిజ హీరోలని పట్టించుకోదు.
మరి నిజం హీరోలకి అస్సలు గుర్తింపు దొరకదా అంటే.. కొందరికి మాత్రమే దొరుకుతుంది. సమాజం మీద ఉపేక్షించలేనంత ప్రభావం చూపించిన వారిని మాత్రమే అదనపు మసాలా లేకపోయినా మీడియా అక్కున చేర్చుకుంటుంది. ఉదాహరణకి సైంటిస్ట్ హీరో అబ్దుల్ కలాం, పౌరహక్కుల హీరో బాలగోపాల్, RTI చట్టం హీరో అరుణా రాయ్, కొందరు పోలీస్ హీరోలు , అత్యాచారాల బాధితురాళ్ల షీరో సునీతా కృష్ణన్ , అమూల్ వ్యస్థాపకుడు కురియెన్ లాంటి కొందరు మీడియా ప్రచారానికి నోచుకున్నా మనం పార్ట్ 1 లో చెప్పినట్లు “పని ఆధార” బ్రాండ్ కాకుండా “వ్యక్తి ఆధార” బ్రాండ్ వేసి వాళ్ళ జీవితం మొత్తాన్ని స్క్రూటినీలో పెట్టేస్తారు. ఎక్కడ చిన్న తప్పు చేసినా ఇమేజ్ ఏమయిపోతుందోనన్న ఇమేజ్ ట్రాప్ లో వాళ్ళు బంధించబడతారు.
మరి కొందరు వాళ్ళ హీరోయిక్ పనులకి గుర్తింపురాకముందే ఆ పనుల వల్ల సమాజంలో కొందరు బలిసిన వారి ప్రయోజనాలకి భంగం కలగడం వలన చంపెయ్యబడి తెరమరుగవుతారు. సత్యేంద్ర దూబే అనే IIT engineer వాజ్ పేయి హయాంలో జాతీయ రహదారుల ఆధునికీకరణ ప్రాజెక్ట్ లో పనిచేస్తూ అక్కడి అవినీతిని రహస్యంగా PMO కి చేరవేస్తే, ఆ విషయం PMO నుంచి డైరెక్ట్ గా సదరు కాంట్రాక్టర్లకే లీక్ అయింది. కొద్ది రోజులకి సత్యేంద్ర అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. వాజపేయి లాంటి మంచి ప్రధాని హయాంలో ఒక IIT ఇంజనీర్ కే ఆ పరిస్తితి వస్తే మామూలు హీరోలు బతికి బట్టగట్టేదెలా ?
కడప జిల్లాలో ఫ్యాక్షన్ ని చాలా వరకు నిర్మూలించిన హీరో ఉమేష్ చంద్ర 32 ఏళ్ళకే చనిపోవాల్సి వచ్చింది.
ఇలా ఎందరో. ఇలాంటి వాళ్లందరినీ తీసేయ్యగా చాలా తక్కువ మంది మాత్రమే మీడియాలో మిగులుతారు. వాళ్లలో చాలామందికి మీడియా ఫోకస్ నచ్చదు……. with నాగరాజు మున్నూరు
Share this Article