.
వైవిధ్యమైన భారతావనిలో… భిన్న కులాలు, మతాలు, ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులెలానైతే కనిపిస్తారో… ఆ రీతిలో ఇతర దేశాల్లో మనకు ఆ భిన్నత్వం సాధారణంగా కనిపించకపోవచ్చు.
పైగా మన దేశంలో పెరిగిన ప్రాశ్చ్యాత్య ధోరణులతో పోలిస్తే… మన సంప్రదాయాలను ఆచరించే సమాజాలు వేళ్లమీదే కనిపిస్తాయి. కానీ, అక్కడో ఇక్కడో మన మూలాలనూ ఆచరించేవారూ, గొప్పగా చూసేవారు, అంతకంతకూ ప్రచారం కల్పించేవారూ ఉంటారు. అదిగో అలాంటి ఓ వ్యక్తి గురించే మనం చెప్పుకుంటున్నాం. అందుకు మనమోసారి బ్రెజిల్ వెళ్లొద్దాం.
Ads
జోనాస్ మాసెట్టి… ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. ఎందుకంటే, ప్రధాని మోడీ జోనాస్ మాసెట్టి ఉరఫ్ విశ్వనాథన్ ను బ్రెజిల్ లో కలిశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు తర్వాత నేరుగా మాసెట్టిని కలిసిన మోడీ… సంస్కృతంలో మాసెట్టి రామాయణాన్నీ కనులారా వీక్షిస్తూ కాస్సేపు విన్నారు.
ఈ సందర్భంగా తాను గతంలో మన్ కీ బాత్ ప్రోగ్రాంలో జోనాస్ మాసెట్టి గురించి ప్రస్తావించినట్టు పేర్కొంటూ.. మళ్లీ Xలో కొన్ని మాసెట్టిని తాజాగా కల్సిన ఫోటోలతో పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతి వ్యాప్తి చెందుతుండటంపై పీఎం మోడీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అందుకే, ఇప్పుడు మళ్లీ జోనాస్ మాసెట్టి పేరు పతాకశీర్షికలకెక్కింది.
ఎందుకంటే, బ్రెజిల్ లో పుట్టి, పెరిగిన జోనాస్ మాసెట్టి ఇప్పుడక్కడ భారతీయ పురాణాలు, వేదాంతంతో పాటు.. భవద్గీతను ప్రచారం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని గతంలో మన్ కీ బాత్ లో భాగంగా 2020, నవంబర్ 29న మోడీ ప్రశసించారు. దాంతో మాసెట్టి పేరు అప్పట్నుంచే వార్తల్లోకెక్కింది.
జోనాస్ మాసెట్టి ఓ మెకానికల్ ఇంజనీర్. కొంతకాలం ఉద్యోగం చేసిన మాసెట్టి.. భారతీయ సంస్కృతికి ఆకర్షించబడ్డాడు. ముఖ్యంగా ఇక్కడి హైందవ గ్రంథాలు అతడిపై అమితమైన ప్రభావాన్ని చూపాయి. అందులోని వేదాంతం వైపు అడుగులు పడ్డాయి.
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోనాస్ కొంతకాలం స్కాక్ మార్కెట్ కు సంబంధించిన ఓ కంపెనీలో పనిచేశాడు. తనే ఓ కన్సల్టెన్సీనీ నడపాడు. అలాగే, కొన్ని టాప్ మేనేజ్ మెంట్ కంపెనీలతోనూ పనిచేశాడు. ఆ సమయంలోనే అన్నీ ఉన్నా ఏదో అసంతృప్తి తనను వెంటాడేదని.. అందుకే, ఆ సంతృప్తి భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉందని నమ్మాడు.
అలా భారతీయ ఆధ్యాత్మికత వైపు అతడి అడుగులు మరింత బలంగా పడటానికి కోయంబత్తూరులోని ఆర్ష విద్యా గురుకులంలో శిక్షణ మరింత ఊతమైంది. ఆ తర్వాత జోనాస్ మాసెట్టి కాస్త విశ్వనాథ్ గా తన పేరు కూడా మార్చుకున్నాడు. ఇప్పుడేకంగా తను విశ్వవిద్య పేరిట బ్రెజిల్ రాజధాని నుంచి గంట ప్రయాణం చేస్తే చేరుకునే పెట్రోపోలిస్ కొండల్లో ఓ ఇనిస్టిట్యూషనే నడుపుతున్నాడు.
గత ఏడేళ్లలో లక్షా 50 వేల మందికి పైగా విద్యార్థులకు తన ఉచిత ఓపెన్ కోర్సును బోధించారని ప్రధాని మోడీ కూడా తన ప్రసంగంలో పేర్కొన్నాడు. తన గయానా పర్యటనకు ముందు మోడీ జోనాస్ ను కలిశారు.
మాసెట్టికి ఎందుకంత ప్రజాదరణ.. ?
రియో సమీపంలోని తన విశ్వ విద్య ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు బోధించడమే కాకుండా.. మాసెట్టి తన రోజువారీ పోడ్‌కాస్ట్స్ తో.. వేదాంత క్యాస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో వేలాది మందికి, అలాగే యూట్యూబ్ ద్వారానూ తన బోధనలను వినిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక, యోగా, వేదాలకు సంబంధించిన వీడియోస్ జోనాస్ యూట్యూబ్ లో కనిపిస్తాయి.
ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్ లో కూడా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కల్గి ఉన్న జోనాస్.. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో తన బ్రెజిల్ లో ఏకంగా ఓ విద్యాలయాన్నే ఏర్పాటు చేయడంతో పాటు.. తన బోధనలు వివిధ మీడియమ్స్ ద్వారా జనానికి చేరవేస్తున్నాడు.
ముఖ్యంగా భవద్గీతకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నాడు. మొత్తంగా ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించిన తర్వాత ఎవరీ జోనాస్ మాసెట్టి అని కొంత క్యూరియాసిటీ కల్గించిన విశ్వనాథ్.. ఇప్పుడు మళ్లీ బ్రెజిల్ లో మోడీతో కలిశాక వార్తల్లో మరింత ముందుకొచ్చాడు…… ( రమణ కొంటికర్ల )
Share this Article