.
ఎవరు జర్నలిస్టు..? తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కీలకమైన ప్రశ్న వదిలాడు… నిజంగానే ఇదుగో జర్నలిస్టులు అంటే వీళ్లు అని నిర్వచించి, వివరించి, వర్గీకరించి చెప్పగలిగేవాళ్లు ఉన్నారా..? నిజమే… అందరిలోనూ ఉంది డౌట్… ఎవరు జర్నలిస్టు..?
సరే, బీఆర్ఎస్ అనేక యూట్యూబ్ చానెళ్లను ఆపరేట్ చేస్తూ… తన మీదకు ఉసిగొల్పుతూ…, వ్యక్తిగా, పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా తనను, తన ప్రభుత్వాన్ని బూతులతో చాకిరేవు పెట్టిస్తుందనే మంట తనలో రగిలిపోతున్నది… సహజం… పైగా అధికారంలో ఉన్నాడు…
Ads
ఒకప్పుడు కేవలం పేపర్లు, మ్యాగజైన్స్, రేడియో… తరువాత టీవీలు… ఇప్పుడు సోషల్ మీడియా, వెబ్ సైట్లు, ఈ-పేపర్లు, యూట్యూబ్ చానెళ్లు… సమాచార మార్గాలు అనేకం, విస్తృతి గణనీయంగా పెరిగిపోయింది… ఇంటికో జర్నలిస్టు… ప్రతి పార్టీకి బోలెడు ఈ-పేపర్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా విభాగాలు…
ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, అబద్ధాలు, అసభ్య సంభాషణలు, అనైతిక పాత్రికేయం… అవన్నీ గుడ్డిగా షేర్ చేసుకుంటూ, ఈ బురద ప్రవాహంలోకి అందరూ… ఇదంతా ఒకెత్తు… టీవీయో, పేపరో అయితే రిజిస్ట్రేషన్లు, విధివిధానాలు, కేంద్ర అనుమతులు ఎట్సెట్రా… యూట్యూబ్ చానెళ్లదేముంది..? ఓ మెయిల్ ఐడీ చాలు, ఏదో ఓ దిక్కుమాలిన పేరుతో చానెల్ స్టార్ట్… చదువు రావల్సిన పని కూడా లేదు… ఏ అర్హతలూ అక్కర్లేదు…
సమాజం మీద పడిపోవడం… వసూళ్లు, బ్లాక్‌మెయిలింగు, యాంటీ సోషల్ యాక్టివిటీస్… ఇసుక, గంజాయి, వ్యభిచారం వాట్ నాట్..? ఖచ్చితంగా సమాజానికి ఇదొక జాఢ్యం… ఈ పెరుగుడు ఏ పాయింట్ వద్ద విరుగుటకో తెలియదు, మరింత పెరుగుటకేనేమో అనే భయసందేహాలూ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రశ్న కీలకమే…
తాను బయటికి చెప్పాడు, బాధితుడు కాబట్టి… కానీ బాధితుడు కాని నాయకుడెవరు వర్తమానంలో..? ఎఐ సాయంతో నాయకుల అమ్మలక్కల్ని కూడా ఫోటోలు మార్ఫ్ చేసి, వీడియోలు ఎడిట్ చేసి బజారుకు లాగుతున్నారు… మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ చానెల్ రేవతి టీమ్ చేయించింది ఇలాంటి బాపతు అత్యంత నీచమైన వీడియోనే కదా…
పైగా ఆమెది జర్నలిజమట… ఎడిటర్స్ గిల్డ్ మద్దతు… అంటే ఇదీ జర్నలిజమే అని ఎడిటర్స్ గిల్డ్ పరోక్షంగా చెబుతున్నట్టా..? పిటీ… వీళ్లు పాత్రికేయానికి దిశను చూపించేది..?!! రాజదీప్ సర్దేశాయ్ వంటి ‘జర్నలిస్టుల’ మద్దతు కూడా… సో, ఎవరు జర్నలిస్టు అనే ప్రశ్న చాలా కీలకమైంది… సంక్లిష్టమైనది… గొట్టమున్న ప్రతి గొట్టంగాడూ జర్నలిస్టేనా..? సోకాల్డ్ గిల్డ్ కూడా ముసుగు జర్నలిజాన్ని సమర్థిస్తోందా..? లేక జర్నలిస్టు అంటే ఎవరో తెలియనితనమా..? సరే, ఇక్కడ రెండు వేర్వేరు అంశాలు… భావ ప్రకటన స్వేచ్ఛ వేరు… ఆ స్వేచ్ఛే ఆధారమైన జర్నలిజం వేరు…
జర్నలిస్టు సంఘాలూ రియల్ జర్నలిస్టుల జాబితాలు ఇవ్వండి, వారి జోలికి రాకుండా.., ఆ జాబితాల్లో లేని వాళ్లను వదిలిపెట్టను.., బట్టలూడదీస్త తోడ్కల్ తీస్త, ఉరికించి కొడతా అంటున్నాడు… సరే, రేవంత్ మార్క్ బూతులు, ఆ బజారు భాషను కాసేపు వదిలేస్తే… తన ఆలోచన తీరులోనే ఓ తేడా ఉంది… జర్నలిస్టు సంఘాలకు ఏం పని.,.? జర్నలిస్టుల జాబితాల్ని రూపొందించడం..!
బోలెడు సంఘాలు… యూట్యూబ్ చానెళ్ల వంటి సంఘాలు కూడా… ఎవరు చేయాలి ఈ పని..? పోనీ, ప్రభుత్వ మీడియా అకాడమీయే ఈ పనిచేస్తే సరి అంటారా..? ఎవరు జర్నలిస్టు అనే ప్రశ్నకు మీడియా అకాడమీకి నిర్వచనం తెలుసా..? జర్నలిస్టు అనే పదం పరిధిలోకి వచ్చేవారెవరు..?
రిపోర్టింగ్ చేసేవాళ్లు, ఎడిటింగ్ చేసేవాళ్లు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్, న్యూస్ రీడర్స్ మాత్రమేనా..? మీడియా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరూనా..? వీళ్లు గాక మిగిలిన వారందరూ, అంటే వెబ్ మీడియా, డిజిటల్ మీడియా, ట్యూబ్ మీడియా… ఎట్సెట్రా అందరూ నకిలీ జర్నలిస్టులు అనాలా..? అదెలా..?
అసలు విషయానికి వద్దాం… ప్రభుత్వం గుర్తించిన వాళ్లే జర్నలిస్టులు, మిగతావాళ్లందరూ ఫేక్ అనుకుందాం కాసేపు, రేవంత్ ఆలోచన ధోరణిలోనే… వాళ్లేనా..? సొసైటీకి జాఢ్యంలా మారింది..? సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, టీవీలు కూడా ఏదో ఒక పార్టీకి భజన చేస్తూ, పడని పార్టీ, పడని వ్యక్తులను టార్గెట్ చేస్తూ, బుదర జల్లుతూ, బజారుకు ఈడుస్తున్నాయి కదా… మరి వాటి మాటేమిటి…? అవి తప్పులు చేసినా బారా ఖూన్ మాఫీయేనా..?
వాటిల్లో పనిచేసే సోకాల్డ్ ‘నిఖార్సయిన’ జర్నలిస్టులు కూడా ఫేక్ జర్నలిస్టులను మించి గ్యాంగ్‌స్టర్లుగా, మాఫియా గ్యాంగుల్లాగా తయారు కావడం లేదా..? ఫేక్ జర్నలిస్టులు కూడా జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు సరే, మరి సోకాల్డ్ రియల్ జర్నలిస్టుల కథేమిటి,.?
వీళ్లనైనా ఎందుకు వదలాలి…? వాళ్లకేమైనా ప్రత్యేక హక్కులున్నాయా..? చట్టంలో మినహాయింపులు ఉన్నాయా..? తప్పు ఎవడు చేసినా తప్పే… వ్యక్తులు, సంస్థల మీద అబద్ధాలతో దాడిచేసి, పరువుకు భంగం వాటిల్లజేయడం ఎవడు చేసినా తప్పే, చట్టరీత్యా నేరమే… కొందరికి మినహాయింపు, కొందరికి వర్తింపు అనేది ఉండదు…
జర్నలిస్టులు అంటే కేవలం… గుర్తించిన మీడియా సంస్థల్లో పనిచేసేవాళ్లే కాదు… ఫ్రీలాన్సర్స్ బోలెడు మంది… నిజంగా సొసైటీ కన్సర్న్‌తో ‘ఏ గుర్తింపూ (అక్రెడిటేషన్) లేకుండా పనిచేసే జర్నలిస్టులు కూడా బోలెడు మంది… మరి వాళ్లందరినీ ఫేక్ జర్నలిస్టులు అని ముద్ర వేయడమేనా..? అయ్యా, సోకాల్డ్ సర్కారీ అక్రెడిటేషన్ల వ్యవహారమే పెద్ద లోపభూయిష్టం… అక్రెడిటేషన్లను అమ్ముకునే దందా కూడా ఉంది సారూ… అక్షరమ్ముక్క రానివాళ్లు, తప్పుల్లేకుండా చిన్న వాక్యం రాయలేనివాళ్లు, రాయనివాళ్లు వేనవేలు…
సో, ఈ వర్గీకరణలు, జాబితాలు, మినహాయింపులు ఎట్సెట్రా శుద్ధ దండుగ యవ్వారం… ముసుగేసుకున్న బాపతు, ముసుగుల్లేని బాపతు… ఎవరు తప్పుచేసినా సరే, మామూలు వ్యక్తుల్ని ఎలాగైతే ఏ సెక్షన్ల ప్రకారం విచారిస్తారో వాళ్లనూ అలాగే ప్రాసిక్యూట్ చేయండి… తోడ్కలు తీయడాలు, బట్టలిప్పి ఉరికించి కొట్టడాలు కాదు… ఆ బూతు భాషావేశంతో ఏ పరిష్కారమూ దొరకదు..!!
Share this Article