ముందుగా ఓ డిస్‌క్లెయిమర్ :: ప్రభుత్వంలో ఎవరున్నా సరే టీటీడీ అనేది ఓ రాజకీయ పునరావాస కేంద్రం… జగన్మోహన్‌రెడ్డిది మాత్రమే తప్పులేదు… అసలు ఓ ప్రపంచ ప్రసిద్ధ హిందూ దేవాలయం పెత్తనాలు ప్రభుత్వం చేతుల్లో ఎందుకు ఉండాలి..? ఏ మత సంస్థల మీదా సర్కారుకు పెత్తనాలు చేతకావు గానీ కేవలం హిందూ ఆచారాలు, వ్యవహారాలు, గుళ్లు, ఆస్తులు, చివరకు పూజల విషయంలోనూ ప్రభుత్వాలు, కోర్టుల మితిమీరిన పెత్తనాలు దేనికి..? ఇది ఒక చర్చ… ఒడవదు, తెగదు… ఏ ప్రభుత్వానికీ దీనికి భిన్నంగా పోవడం చేతకాదు, చివరకు సోకాల్డ్ బీజేపీ ప్రభుత్వానికి కూడా…! సో, అసలు రాజకీయ నియామకాలే పెద్ద పాపకార్యం, అందులోనూ నేరచరితులున్నారు, పారిశ్రామికవేత్తలున్నారు, అన్యమతస్తులున్నారు అనే చర్చే శుద్ధ దండుగ యవ్వారం… కానీ జగన్ దీన్ని మరో లెవల్‌కు తీసుకుపోయాడు… ఏకంగా 80 మందిని ఏదో ఓ పేరుతో ఇరికించేశాడు… ఇవేమైనా పనికిమాలిన ప్రభుత్వ కార్పొరేషన్లా ఇష్టారాజ్యంగా నియమించేసి చేతులు దులుపుకోవడానికి..?
కోర్టులో ఓ పిల్ పడింది… అసలు నేరచరితులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఏమిటని..? ఈ జంబో జెట్ పాలకమండలి దేనికని..? ఆ పిల్ వేసింది మాజీ టీటీడీ సభ్యుడు ప్లస్ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి… తన ఉద్దేశాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు, కాకపోతే అసలు హిందూ గుళ్ల మీద సర్కారు పెత్తనాలు ఏమిటనే పిల్ వేస్తే విచారణ మరింత బహుళ ప్రయోజనకారిగా ఉండేది… నేరచరితులు విషయంలో కేతన్ దేశాయ్ అనే సభ్యుడి చరిత్ర వివరించేసరికి కోర్టుకు అర్థమైపోయింది… బోర్డులో నియమితులైన 18 మందికి ప్లస్ సర్కారుకు నోటీసులు జారీ చేసింది… సరైన స్పందనే… అయితే… ఎవరీ కేతన్ దేశాయ్..?
Ads
మోస్ట్ నొటోరియస్ కేరక్టర్… ఓ యూరాలజిస్ట్… మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు గతంలో అధ్యక్షుడు, అంతేనా..? వరల్డ్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓసారి… అవినీతికి, అక్రమాలకు నిలువెత్తు రూపం… మనమేమీ చెప్పడం లేదు, కోర్టులు చెప్పాయి… ఏదో పాటియాలా మెడికల్ కాలేజీకి అక్రమంగా అనుమతులు ఇప్పించాడనే సాకుతో ఓసారి సీబీఐ దాడి చేస్తే కిలోన్నర బంగారం, 80 కిలోల వెండి దొరికాయి, ఒక లాకర్ ఓపెన్ చేస్తే 35 లక్షలు… ఇది పదకొండేళ్ల క్రితం మాట… సారు గారికి 35 లాకర్లున్నాయట… దేశవ్యాప్తంగా 400 ప్రాపర్టీస్ ఉన్నాయట… ఢిల్లీ హైకోర్టు ఆయన్ని మెడికల్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని ఆదేశించింది… తన డాక్టర్ గిరీని కూడా సస్పెండ్ చేసింది ఎంసీఐ ఓ దశలో… తెలియని కథలెన్నో…! (తను బీజేపీకి దగ్గరే… ఐనా ఇక్కడ బీజేపీ అధికార ప్రతినిధి తన కథంతా కోర్టులో ప్రస్తావించడం విశేషమే…) (అప్పట్లో చెన్నై శేఖర్‌రెడ్డి టీటీడీ సభ్యత్వంపై రచ్చ చేసిన పార్టీయే తరువాత కాలంలో ఆయన్నే టీటీడీ సభ్యుడిగా వేసింది, అది వేరే కథ… ఓ ఫార్మా కంపెనీ అధినేత ఇంట్లో ఐటీ ఇటీవల సోదాలు చేస్తే వందల కోట్ల కట్టలు బీరువాల్లో దొరికాయి…) (అసలు ఆ సభ్యత్వాలన్నీ పైరవీల బాగోతాలే కదా… ధర్మనిరతి, స్వామిసేవ అనే పదాలు వాళ్లందరికీ ఉత్త డొల్ల మాటలు…)
ఈమధ్య ఓ సభ్యుడు శిలువ మోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి… హిందూ ధర్మప్రచారం కోసం ఉద్దేశించిన సంస్థ పాలకమండలిలో అన్యమతస్థులు..? ఆ కొలువుల్లో అన్యమతస్తులు..? అంతా అరాచకం… ఎవరూ మాట్లాడటానికి లేదు… (హిందూ గుళ్లతో నడిచే ఏ సంస్థలోనూ హైందవేతరులకు కొలువులు ఇవ్వబడవు అని తమిళనాడు చట్టం… మద్రాస్ హైకోర్టులో ఈమధ్యే ఓ కేసు నడుస్తోంది…) ఇప్పుడిక నేరచరితులతోపాటు 80 మంది అధికారిక పటాటోపంతో, అనుచరగణంతో తిరుమలలో విహరిస్తారన్నమాట… స్వామివారికి నిత్యశిరోముండనం… ఫాఫం, ఆయనెవరికి చెప్పుకోవాలి..? నిజానికి ఇక్కడ ఓ చిన్న తిరకాసు… సాక్షాత్తూ ఎన్నికల సంఘమే నేరం నిరూపణ అయితే గానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమలు చేయడం లేదు… మన న్యాయవ్యవస్థలో దశాబ్దాల తరబడీ కేసులు తేలవు, కింద నుంచి పైదాకా ఏళ్ల తరబడీ కేసులు నడుస్తూనే ఉంటయ్, ఎటూ తేలవు… మరి ఎవరు నేరచరితులు అవుతారు..? ఎవరు నిందితులు మాత్రమే అవుతారు..? ఎవరికి స్వామివారి సేవాప్రాప్తం దక్కొచ్చు..? ఎవరిని గుడిమెట్లు ఎక్కనివ్వొద్దు..? తేలేదెలా..? తేల్చేదెలా..? అసలు ఈ కేతన్ దేశాయ్ వంటి కేరక్టర్లను జగన్ ఎవరు చెబితే నియమించాడు..? ఎందుకోసం..? ఏమో, ఆ దేవదేవుడికి కూడా అర్థం కాదేమో…!!
Share this Article