.
( రమణ కొంటికర్ల ) .. …… క్షమాసావంత్.. ఇప్పుడు ఈమో హాట్ టాపిక్. భారతీయ మూలాలున్న అమెరికావాసి క్షమాసావంత్ కు వరుసగా భారత్ వీసా రిజెక్ట్ చేయడంతో ఇప్పుడీమె మళ్లీ వార్తల్లో ప్రధాన వ్యక్తైంది.
అసలు క్షమాసావంత్ ఎవరు..? అమెరికాలోని సియాటిల్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్ గా, హక్కుల కార్యకర్తగా క్షమాసావంత్ సుపరిచితురాలు. అంతకుమించి భారత ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై సావంత్ చేసిన బహిరంగ విమర్శలు ఆమెను వివాదాస్పద వ్యక్తిగా మార్చాయి.
Ads
పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ, అలాగే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఎన్ఆర్సీ వంటి వాటిని క్షమాసావంత్ తీవ్రంగా వ్యతిరేకించింది. 2020లో ఏకంగా సియాటిల్ కౌన్సిల్ లో తాను మెంబర్ గా ఉన్నప్పుడు.. సీఏఏను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది.
పైగా దానికి అక్కడి కార్మిక, విభిన్నమతాలకు సంబంధించిన సంఘాల మద్దతును కూడగట్టింది. కులవివక్షపై పోరాడే మొట్టమొదటి నగరంగా అమెరికాలో సియాటిల్ ను నిలపడంలో సావంత్ కీలక పాత్రధారి.
అయితే, ఆమె భారత్ లోని మోడీ ప్రభుత్వ విధానాలపైన మాత్రమే కాదు.. సియాటిల్ నగర కౌన్సిల్ లో మెంబర్ గా ఉన్నప్పుడు కార్మికులకు గంటకు 7.25 డాలర్స్ గా ఉన్న వేతనాన్ని 20.76 డాలర్స్ గా పెంచాలంటూ ఫైట్ చేసింది.
కరోనా కోరలు చాచిన కాలంలో బిలియన్ డాలర్స్ కంపెనీలైన అమెజాన్ వంటివాటికి పన్నులు పెంచి.. ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బును కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ గా ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. అలాగే, భారత ప్రభుత్వం తీసుకురావాలనుకున్న వ్యవసాయ చట్టాలనూ ఖండిస్తూ తీర్మానాలను కౌన్సిల్ లో ప్రవేశపెట్టింది. వాటిపైన విస్తృతస్థాయిలో నిరసనలు చేపట్టి వార్తల్లో నిల్చింది.
వరుసగా వీసా నిరాకరణతో మళ్లీ వార్తల్లోకి క్షమాసావంత్!
భారతదేశంలో ఉన్న తన తల్లి ఆరోగ్యపరిస్థితి బాగాలేకపోవడంతో క్షమాసావంత్ తల్లిని చూడ్డానికి ఇండియాకు రావాలనుకుంది. అందుకోసం ఆమె అత్యవసర పరిస్థితి కింద తనకు వీసా మంజూరు చేయాలని కోరినా ఆమెకు వీసా రిజెక్ట్ కావడంతో ఇప్పుడు భారత ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడుతోంది.
అప్పటికే ఆమెకు రెండుసార్లు భారత వీసా కోసం అప్లై చేసినా తిరస్కరించడంతో.. తన తల్లి ఆరోగ్యం కోసం మెడికల్ ఎమర్జెన్సీ కింద డాక్టర్ సర్టిఫికెట్స్ వంటివీ అటాచ్ చేసి పంపినా వీసా రిజెక్టైనట్టు రావడం.. ఎందుకు తిరస్కరించారో కారణాలు పేర్కొనకపోవడంతో సావంత్ ఇండియన్ గవర్నమెంట్ తీరుపై ఫైర్ అవుతోంది. ఈ విషయాన్ని తన X ఖాతాలోనూ పోస్ట్ చేసింది.
అత్యవసర పరిస్థితిని వివరించినా రాజకీయాలా అని ప్రశ్నిస్తున్న సావంత్!
సావంత్ వీసా కోసం మొదట 2025 మేలో దరఖాస్తు చేసుకుంది. అప్పుడూ ఆమె వీసా తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత 2024 జూన్ లోనూ మళ్లీ అప్లై చేసినా అదే పరిస్థితెదురైంది. ఇక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట తన 82 ఏళ్ల తల్లికి ఎదురైన వ్యాధుల తీవ్రతను వివరిస్తూ తాను తప్పక వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితిని పేర్కొన్నా వీసా రిజెక్ట్ కావడం, కారణాలేంటో వెలిబుచ్చకపోవడంతో పాటు… ఆమె భర్త కాల్విన్ ప్రీస్ట్ కు మాత్రం వీసా మంజూరు కావడంపై ఆమె ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా తనపైన రాజకీయ కక్షసాధింపు చర్యేనన్నది క్షమాసావంత్ చెబుతున్న మాట.
పదేళ్లు తాను సియాటిల్ నగర కౌన్సిల్ మెంబర్ గా ఉన్న సమయంలో తనపై ప్రతీకారం తీర్చుకుంటే వ్యతిరేకత వస్తుందేమోననుకున్నవారు.. ఇప్పుడు తను అధికారంలో లేని సమయంలో ఇలా వీసా రిజెక్షన్ తో కక్షసాధింపుకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేస్తోంది సావంత్.
అయితే సావంత్ కేసు ఒక్కటే ఇప్పుడు ప్రత్యేకమైనదేం కాదు. సావంత్ తరహాలో భారత ప్రభుత్వ విధానపరమైన ఆసక్తికర అంశాలపై ఎవరు విమర్శలు గుప్పించినా ఇలాంటి సవాళ్లనెదుర్కోవాల్సి వస్తోందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.
అలాంటివారిలో స్వీడన్ లో నివసించే అశోక్ స్వైన్ భారత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం, తన ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డ్ ను రద్దు చేయడంపై ఆయన పెద్ద పోరాటమే చేస్తున్నారు. సేమ్ సావంత్ లాగే స్వైన్ కు కూడా ఓ వృద్ధ తల్లి భారత్ లో ఉండటం..
ఆయన రావాలనుకున్న సమయంలో వీసా రిజెక్ట్ కావడంతో ఇలాంటి కేసులన్నీ ఇప్పుడు మరింత చర్చకు వస్తున్నాయి. భారత ప్రభుత్వంపై అసమ్మతివాదులను నిశ్శబ్దపర్చేందుకు రాజకీయ ప్రేరేపిత కక్షసాధింపు చర్యలుగా అభివర్ణించబడుతున్నాయి….
Share this Article