Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహేశ్ కత్తి..! నిజంగా ఈసడించుకోవాల్సిన కేరక్టరేనా..? ఎందుకు తను భిన్నం..?!

July 10, 2021 by M S R

ఆనందయ్య ఇచ్చే మందుకు నేను మద్దతుదారు… వేలమంది నమ్మారు, లైన్లు కట్టారు… కానీ మహేష్ కత్తి బద్ద వ్యతిరేకి… పరంపరగా మనకు సంక్రమించిన అద్భుతమైన మూలికావైద్యాన్ని కొన్ని రోగాలకు సంబంధించి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనేదే నా నమ్మిక, నా భావన… అది ఆనందయ్య కావచ్చు, మరొకరు కావచ్చు… వ్యక్తులు కాదు ముఖ్యం… గుడ్డిగా ఎందుకు వ్యతిరేకించాలి అనేది నా కోణం… సాధారణంగా వేరేవాళ్ల పోస్టుల్లోకి జొరబడే తత్వం కాదు మహేశ్‌ది… కానీ ఆనందయ్య మందు పోస్టుల్లోకి వచ్చి, ఒకటీ రెండుసార్లు అసహనంతో కామెంట్స్ పెట్టి వ్యతిరేకించాడు తను… తరువాత ఓరోజు ఇన్‌బాక్సులోకి వచ్చాడు… పరస్పరం గౌరవించుకునే పరిణతి ఉంది… పరిచయమూ ఉంది… పుష్కరం క్రితం… తెలుగులో ఫేస్‌బుక్ పాపులర్ అవుతున్న కొత్తలోనే తను ఆ మీడియా ద్వారా తొలి పరిచయం…

mahesh kathi

ఒకరిద్దరు సంస్కారహీనులు కమ్ ఎదవలు చట్నీ, సాంబారు అని ఒక మూలికా మందును మూర్ఖంగా చీదరించడం సరిగ్గా లేదు, ఆ మందును నమ్మి లైన్లలో నిలబడిన వేల మంది ప్రజల్ని, రోగుల్ని, వారి నమ్మకాన్ని అపహాస్యం చేయడమే… పోనీ, మందుతో ఫలితం లేకపోతే వాళ్లే వదిలేస్తారు కదా, నష్టమైతే లేదు కదా… అసలు ఈ అల్లోపతి లేని కాలంలో కూడా భారతీయ మూలికావైద్యం ఈ దేశంలో తరతరాలుగా రోగుల్ని ఆదుకుంది, స్వాంతన చేకూర్చింది, ఇప్పుడు ఆనందయ్య మందు మీద సాగుతున్న చర్చ కాస్తా క్రమేపీ దేశీయ వైద్యానికి వ్యతిరేకంగా పోతోంది, అది నచ్చడం లేదు నాకు… అల్లోపతీ కానిదంతా సైన్స్ కాదు అనే భావన ఏమిటసలు..? అసలు సైన్స్ అంటే ఏమిటి..? యునాని, ఆయుర్వేదం, హోమియో అక్కరకు రానివా..? అల్లోపతి నమ్మకమైన వైద్యవిధానమే కావచ్చుగాక, కానీ అది నయం చేయలేని సమస్యలు బోలెడు… అలాగని నేను ఆనందయ్యకు గుడ్డి మద్దతుదారుని కాదు, దేశీయవైద్యానికి మాత్రం బలమైన సమర్థకుడిని అన్నాను…
నిజమే, ఈ చర్చ బాగా పక్కదోవ పడుతోంది… ఫలితాలపై ఏ శాస్త్రీయ ధ్రువీకరణా లేని ఆనందయ్య మందును నేను వ్యతిరేకిస్తాను కానీ దేశీయ వైద్యాన్ని నేను స్థూలంగా నిరాకరించడం లేదు, ఆ ఆనందయ్య మందు వైద్య ప్రమాణాల పరీక్షలకు నిలబడాలి, కొత్త ప్రమాదాలకు కారణం కాకూడదు, నేను కోరేది అదే అన్నాడు… ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నానూ అంటే…. మహేష్ కత్తి అడమెంట్ కాదు… తన అవగాహన, తన అధ్యయనం, తన చదువు రేంజ్ వేరు… ఎటొచ్చీ తన భావాల్ని వ్యక్తీకరించడంలో కాస్త దూకుడు కనిపిస్తుంది… కానీ అవసరమైనప్పుడు ఎదుటివాడు చెప్పింది సాంతం వింటాడు, అవసరమైతే ఏకీభవిస్తాడు, లేదా తన మనస్సు అంగీకరించకపోతే వ్యతిరేకిస్తాడు… ఆ ఫ్లెక్సిబులిటీ ఉంది తనలో… కానీ పైకి కనిపించడు అలా…
.
రాముడు దగుల్బాజీ, రావణుడైతే సీత ఎక్కువ సుఖపడేది అనే స్థాయి రూడ్ వ్యక్తీకరణ తీరు తప్పు… నీ నమ్మకాలు రామవ్యతిరేకం కావచ్చుగాక, నాస్తికమే నీ పంథా కావచ్చుగాక… కానీ ఆస్తికుల విశ్వాసాలను కించపరచడం కరెక్టు కాదు… అసలు మీ దృష్టిలో రామాయణమే పుక్కిటి పురాణం అయినప్పుడు ఇక ఆ పాత్రల విశ్లేషణ దేనికి..? అది చరిత్ర కాదు, ఆ పాత్రలు గతంలో కూడా సజీవం కావు అనేదే నీ వాదనైతే కావచ్చుగాక… నువ్వు దూరంగా ఉండు, కానీ దగ్గరగా ఉండేవాళ్ల మనోభావాల్ని నొప్పించే హక్కు నీకెక్కడిది..? వ్యతిరేకించు, కానీ దానికీ ఓ పద్ధతి ఉంది… ఈ మాట ఎవరన్నా సరే తను ఖండిస్తాడు… నా నమ్మకాన్ని చెబితే తప్పేమిటి అంటాడు… వ్యతిరేకించేందుకూ ఓ పద్ధతి ఉంది అంటే ఒప్పుకోడు… సరే, అది తన తత్వం… నిజానికి ఆ రామాయణకాలం నాటి శంభూకుడి నుంచి మొన్నమొన్నటి పెరియార్ దాకా బోలెడు మంది నాస్తికులు… మహేష్ ఆ భావ పరంపరలో ఉన్నాడు, తప్పులేదు కానీ తన వాదన ఎదుటోడిని చివుక్కుమనిపించేలా ఉండేది… అంతే… కానీ ఓ మామూలు సినిమా క్రిటిక్, ఓ చిన్న దర్శకుడు ఈ రేంజులో వార్తల్లో వ్యక్తి అయ్యాడంటేనే విస్మయం కలుగుతుంది…
.
దళిత సమస్యలపై, అస్థిత్వ ఆత్మగౌరవ పోరాటాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉంది… అయితే చాలామందిలా ఆ సమస్యలకు పరిష్కారం క్రిస్టియానిటీలో ఉందని నమ్మేవాడు కాదు తను… స్థూలంగా తను మతానికి వ్యతిరేకి… దేవుళ్లు అనే భావనకు వ్యతిరేకి… దళితవాదానికీ, హిందూ వ్యతిరేకతకు నడుమ తేడా తెలియనివాడు కాదు మహేష్… ఈ మతం నన్ను అవమానిస్తోంది కాబట్టి, ఆ కోపంతో ఇంకేదో మతాన్ని ఆశ్రయిస్తాను అనే టైపు కాదు… నాస్తికుడైనా సరే, హిందువుగానే ఉన్నాడు.,. తను అర్థం కావాలంటే కూడా ఓ లెవల్ అవసరం… ఆ చర్చ వదిలేస్తే… రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహేశ్ ఒక్కడే ఒక ఉప్పెన స్థాయిలో ఎదురైన ట్రోలింగుకు గురైన సోషల్ బాధితుడు, కానీ నిలబడ్డాడు… పారిపోలేదు… అజ్ఞాతంలోకి వెళ్లిపోలేదు… సో, తనను ప్రిజుడిస్ భావాలతో ఈసడించుకోవద్దు… అంతే… మరణానిదేముంది..? తనకూ వచ్చింది, మనకూ వస్తుంది… ఎవరమూ శాశ్వతం కాదు… (ఒక వ్యక్తి మీద మన అభిప్రాయాలు వేరు, మన సంబంధాలు వేరు… వార్తల విషయానికొస్తే అవన్నీ అప్రస్తుతాలు… ఆ వ్యక్తితో మన సంబంధాలు, జ్ఞాపకాలు వార్తాంశాలు కానేకావు… కానీ ఎందుకో మహేశ్ మీద రాయాలనిపించింది… ఎందుకో అలా అనిపించింది…)

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions