.
చాలామంది పండితులకు, ఘనాపాఠీలకు కూడా సాధ్యం కాని ఒక అద్భుతమైన ఘనతను ఈ మధ్యే ఓ 19 ఏళ్ల కుర్రాడు సాధించి, దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆ కుర్రాడి పేరే మహేష్ రేఖే…
ఇతను సాధించింది మామూలు విషయం కాదు – ప్రాచీన దండక్రమ పారాయణం… అసలు ఈ పారాయణం అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏమిటో చూద్దాం…
Ads
అసలు దండక్రమ పారాయణం అంటే ఏంటి?
-
వేదాలకే కిరీటం…: దండక్రమ పారాయణాన్ని వేద పారాయణాలన్నిటికీ కిరీటంలాంటిదిగా భావిస్తారు…
-
సంక్లిష్టత…: ఇది శుక్ల యజుర్వేదం నుంచి సుమారు 2,000 శ్లోకాలతో కూడి ఉంటుంది… దీనిని మామూలు మంత్ర జపంలా చేయలేరు…
-
నియమాలు…: ఈ శ్లోకాలను పఠించాలంటే శబ్దం (ఉచ్చారణ), శ్వాస (ఊపిరి), జ్ఞాపకశక్తి మీద పూర్తి పట్టు ఉండాలి… కొన్ని చోట్ల శబ్దం చెడకూడదు, లయ క్రమబద్ధంగా సాగాలి, మరికొన్ని శ్లోకాలు పఠించేటప్పుడు ఊపిరి సైతం బిగబట్టాలి… (
ధారణ, సాధన, ఉచ్ఛారణ, నియంత్రణ) -
గుర్తుపెట్టుకోవాలి..: అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శ్లోకాలను సంప్రదాయకంగా కంఠస్థం చేసి, ఎటువంటి కాగితాలు లేదా పుస్తకాలు చూడకుండా అనర్గళంగా పఠించాలి…
గతంలో ఎంతోమంది మహా పండితులు కూడా ఈ దండక్రమ పారాయణం చేయడానికి ప్రయత్నించి, దాని సంక్లిష్టత ముందు విజయం సాధించలేకపోయారు… రికార్డుల ప్రకారం, దాదాపు 200 సంవత్సరాలకు పూర్వం కేవలం ఇద్దరు లేదా ముగ్గురు పండితులు మాత్రమే ఈ ప్రక్రియను సంపూర్ణం చేయగలిగారు..!
మహేష్ రేఖే చరిత్ర సృష్టించాడు!
ప్రాచీన వేద పారాయణ విధానం అంతరించిపోతుందేమో అనుకుంటున్న సమయంలో, మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల మహేష్ రేఖే ఈ ఘనతను సాధించి రికార్డు నెలకొల్పాడు…
మహేష్ రేఖే గురించి..: మహేష్.. వేద బ్రహ్మశ్రీ చంద్రకాంత్ రేఖే కుమారుడు… ఈయన మహారాష్ట్రలో అత్యంత గౌరవనీయ వేద పండితుడు, శృంగేరి పీఠంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ యొక్క ప్రధాన పరిరక్షకుడిగా ఉన్నాడు…
తండ్రి శిక్షణ…: తమ కుమారుడికి తానే గురువై, అంకితభావంతో, క్రమశిక్షణతో ఈ ప్రాచీన విద్యను నేర్పించాడు ఆయన… మహేష్ కూడా తన తండ్రి దగ్గర శిక్షణలో ఎంతో పట్టు సాధించి, తోటి పండితులనే ఆశ్చర్యపరిచాడు…
50 రోజుల్లో రికార్డు…
-
మహేష్ రేఖే తన దండక్రమ పారాయణాన్ని వారణాసిలోని వల్లభ పురం సాలిగ్రామ్ సంవేద్ విద్యాలయంలో అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించాడు…
-
సరిగ్గా యాభై రోజులకు (నవంబర్ 30న) ఎటువంటి అంతరాయం లేకుండా, రెండు వేల శ్లోకాలను అత్యంత ఖచ్చితత్వంతో, వేగంగా పఠించడం పూర్తిచేసి రికార్డు సృష్టించాడు…
-
అక్కడ ఉన్న వందలాది మంది వేద పండితులు అతని ఉచ్చారణ దోషాలు లేని పారాయణాన్ని చూసి చప్పట్లతో అభినందించారు…
ఘన సన్మానం
మహేష్ సాధించిన ఈ అరుదైన ఘనతను దేశం మొత్తం ప్రశంసించింది. శృంగేరి జగద్గురు శంకరాచార్యులు మహేష్‌ను ఆశీర్వదించాడు… వారణాసిలో సాధువులు, పండితులు సంబరాలు చేసుకున్నారు… వేద సంస్థలు అతనికి రూ. 5 లక్షల విలువ చేసే స్వర్ణ కంకణంతో పాటు, రూ. 1,11,116 నగదు బహుమతిని అందించాయి…
వందలాది మంది పండితులు, విద్యార్థులు వెంట రాగా, వారణాసి వీధుల్లో మేళతాళాలతో అద్భుతమైన ఊరేగింపు జరిగింది… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా X (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “అంతరించిపోతుందనుకున్న అత్యంత అరుదైన ప్రాచీన విద్యకు తిరిగి పూర్వ వైభవం సాధించిపెట్టిన మహేష్ రేఖేకు అభినందనలు” అని అభినందించాడు…
మొత్తానికి, మహేష్ రేఖే అనే యువకుడు తన అంకితభావం, ప్రతిభతో రెండు శతాబ్దాలనాటి ఘనతను తిరిగి సాధించి, ప్రాచీన భారతీయ వేద విద్యకు ప్రపంచ వేదికపై గౌరవాన్ని తీసుకొచ్చాడని చెప్పవచ్చు…
Share this Article