మధురమ్మ చనిపోయిందట… ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే… అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం… నక్సలైట్ల ఉద్యమంలో తెగిన పేగులు బోలెడు… పుస్తెపోగులు బోలెడు… కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి వచ్చిపోతే బాగుండననే ఎదురుచూపులు… ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు… కానీ మధురమ్మది కాస్త భిన్నమైన అనుభవం…
నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే… ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే ఏడుపులు… ఇక ఎవరూ రారు అని మళ్లీ మనసు నిమ్మలం చేసుకుని ముసుగుతన్ని పడుకోవడం… ఈమె ఎవరంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతిల తల్లి… ఆమె మంగళవారం కన్నుమూసింది… ఇదీ వార్త… ఆమె గురించి తెలిసినవాళ్లకు ఓ విషాదం…
అప్పట్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం… భర్త వెంకటయ్య రజాకార్లతో పోరాడుతున్న సందర్భంలో భర్త కోసం రజాకార్లు వచ్చి వేధించేవాళ్లు… ఓరకమైన నిర్బంధం, ఆమె మీద నిఘా… రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన రెండురకాల పోరాటాల్లో ఆమె వేదన ఉంది… భిన్నమైన అనుభవముంది… ఆమె పడిన కష్టముంది… అవమానాలున్నయ్… ఆనాడు అవస్థలపాలైనా స్వాతంత్య్ర సమరయోధుడి భార్యగా ప్రభుత్వం నుంచి సన్మానం అందుకుంది… ప్రతి గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాన గౌరవాన్ని పొందుతూనే ఉంది… ఆమధ్య నాలుగేళ్ల క్రితం కావచ్చు పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు పాదాభివందనం కూడా చేసింది… ఇంతా చేస్తే ఆమె భర్త రాజ్యానికి, అనగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవాడే…
Ads
కట్ చేస్తే… కడుపున పుట్టిన కొడుకులు అడవి బాట పట్టారు… నక్సలైట్లయ్యారు… ఉద్యమానికి నేతలయ్యారు… కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు… వాళ్లు కూడా రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్లే… తండ్రి నెత్తురే… వాళ్ల ఆచూకీ కోసం మధురమ్మను పోలీసులు అనేకసార్లు వేధించారు… సేమ్, అప్పట్లో రజాకార్లు వేధించినట్టుగానే…
ఆ ఇద్దరి ఆచూకీ కోసం తల్లి, తండ్రి, సోదరుడైనా ఆంజనేయ శర్మకు వేధింపులు తప్పలేదు… వాళ్ల సోదరుడు అక్కడే పౌరోహిత్యం చేసుకుంటాడు… 1987లో డీఎస్పీ బుచ్చిరెడ్డి హత్య జరిగింది… ప్రతీకారంగా పోలీసులు వందల ఇళ్లను కూల్చేశారు… అందులో మధురమ్మ ఇల్లు కూడా కూలిపోయింది… దాంతో నాలుగైదేళ్లు ఓ పూరి గుడిసే దిక్కయింది ఆమెకు…
అగ్రస్థానాల్లో ఉన్న నక్సలైట్లు ఎవరినైనా చూడటానికి రావాలంటే ఎంత కష్టమో ఆమెకు తెలుసు… ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు అనుకుంది… కానీ పెద్ద కొడుకు కోటేశ్వరరావు 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు… ఆమె కుంగిపోయింది… చిన్న కొడుకైనా బాగుంటే చాలు అనుకుంది… సహజం కదా…
ఆ సోదరులు ఓసారి అమ్మకు బహిరంగ లేఖ రాశారు… ‘‘అమ్మా, మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు… కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేం ఈ విప్లవబాట ఎంచుకున్నాం, తిరుగుబాటు నాన్న రక్తం నుంచే వచ్చింది…’’ ఇలా సాగిపోయింది ఆ లేఖ… అప్పట్లో ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ లేఖ లక్షలమందిని చదివించింది… దాదాపు నూరేళ్లు బతికిన ఆమె ఇక జీవనాన్ని చాలించింది… మంగళవారం కన్నుమూసింది… కిషన్‌జీ, అమ్మ వస్తోంది, ఇప్పుడైనా కళ్లారా చూసి, ఆమె కన్నీటిని తుడువు కామ్రేడ్…!
Share this Article