ప్రముఖ నటుడు, డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, స్క్రిప్ట్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఈమధ్య కొత్త సినిమాలపై తన అభిప్రాయాలను రాస్తున్నాడు కదా… తాజాగా కాంతార ఓటీటీలో చూసినట్టున్నాడు… సినిమా గురించి నాలుగు మంచిమాటలు చెబుతూనే… ‘‘తల్లి పాత్ర పోషించిన అమ్మాయిని ఎవరితో పోల్చాలో అర్థం కావడం లేదు… అసలు ఆమె సినిమా నటి అంటే ఎవరూ నమ్మరు… అడవిలో ఉండే అమ్మాయితో ఆ పాత్ర చేయించారా అన్నంత సహజంగా చేసింది… హేట్సాఫ్’’ అని ప్రశంసించాడు… ఆమెకు మంచి అభినందనే ఇది…
నిజమే, అందరమూ రిషబ్ శెట్టి గురించే మాట్లాడుతున్నాం గానీ, ఆ తల్లి కమల పాత్రలో చేసింది ఎవరు..? సినిమా మీద ఆమె ముద్ర కూడా ఉంది… ఆమె పేరు మానసి సుధీర్… ఆమెది ఉడుపి… అర్థమైపోయిందిగా రిషబ్ సినిమాలోకి ఎలా వచ్చిందో… మంగుళూరు, ఉడుపి కళాకారులైతే అత్యంత ప్రాధాన్యం… తండ్రి సాహిత్యకారుడు… అందుకే కళల వైపు ప్రోత్సహించాడు… ఆమెకు భరతనాట్యం వచ్చు… కర్నాటక సంగీతం వచ్చు… అనుకోకుండా ఏదో సినిమాకు ఓ పాట పాడి, ఏకంగా సినిమాల్లో పాత్రలు వేయసాగింది…
తనకు ఇష్టం ఉన్న సాఫ్ట్ పాత్రలైతేనే చేస్తుంది… ఎక్కువగా తుళు, భక్తి ప్రధాన పాత్రలు… టీవీ కూడా ఇష్టమైన రంగమే ఆమెకు… ప్రధానంగా రిజర్వేషన్, అమ్మన మనె సినిమాల్లో పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆమెకు… నిజానికి ఆమెకు పెళ్లయ్యాక తన కాన్సంట్రేషన్ మొత్తాన్ని భర్త సుధీర్‌తో కలిసి స్థాపించిన నృత్యనికేతన్ అనే డాన్స్ స్కూల్ పైనే పెట్టింది… తను కూడా భరతనాట్య కళాకారుడే…
Ads
విలక్షణంగా ఉండే పాత్ర దొరికితే నటిస్తాను అంటుంది ఆమె… కరోనా టైంలో లాక్ డౌన్ పీరియడ్‌ను పిల్లల కోసం, భక్తి కోసం వెచ్చించింది… పిల్లలకు ఉపయోగపడే వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది… వాటికి మంచి ఆదరణ రావడంతో దానిమీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చేసింది… అన్నింటికన్నా ఎక్కువగా పాపులరైంది మాత్రం గణేషుడి మీద కన్నడ అచ్చులతో కూడిన ఓ పాట… అది చూస్తే చాలు ఆమె మొహం ఎంత ఎక్స్‌ప్రెసివో అర్థమవుతుంది… (దిగువన ఆ వీడియో ఉంది… మనకు ఆ భాష తెలియకపోయినా దాదాపుగా మొత్తం అర్థం అవుతుంది…) ప్చ్, మన ఆంటీలేమో నవస్త్ర అనే ఓ పిచ్చిపేరు పెట్టి, దేవీనవరాత్రులకు రోజుకొక్క గలీజు డ్రెస్ పరిచయం చేస్తారు… ఇదీ మన టేస్టు… దరిద్రం..!!
రిషబ్ శెట్టికి కొన్నాళ్లుగా ఆమె తెలుసు… తమ ఏరియా డాన్సర్ కమ్ సింగర్ కమ్ యాక్టర్ కమ్ పర్‌ఫార్మర్… రొటీన్ ఫార్ములా పాత్రలు చేయదు… అందుకే ఆ ఇద్దరు దంపతులకు ఈ తల్లి కమల పాత్ర గురించి చెప్పాడు… వాళ్లకు రిషబ్ తెలుసు కాబట్టి వెంటనే అంగీకరించారు… అలా మానసి కాంతార సినిమాలోకి వచ్చింది… కాకపోతే రిషబ్ అనితర సాధ్యమైన క్లైమాక్స్ నటన కారణంగా మానసి నటన కాస్త తక్కువగా అనిపిస్తోంది… అవును కదా, రిషబ్ పెద్ద గీత… ఏదైనా మంచి పాత్ర పడతే మాత్రం మానసి జాతీయ అవార్డు కొట్టడం ఖాయం అని కన్నడ మీడియా కూడా అంటున్నదీ అంటే మానసి మెరిట్ అర్థం చేసుకోవచ్చు…!
Share this Article