మేఘాలయకు రెండోసారి ముఖ్యమంత్రిగా కొన్రాడ్ సంగ్మా ప్రమాణం చేయబోతున్నాడు… గెలిచింది 26 సీట్లే అయినా, పాత మిత్రులు కలిసి రావడంతో మెజారిటీ వచ్చేసినట్టే… తను ఎవరు…? గతంలో సోనియాను ధిక్కరించి, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన పీఏసంగ్మా కొడుకు… ఢిల్లీలో స్కూలింగ్, లండన్- అమెరికాల్లో ఏంబీఏ, బీబీఏ ఉన్నత చదువులు…
కుటుంబం మొత్తం రాజకీయాలే… సోదరి అగాథా సంగ్మా గతంలో 29 ఏళ్లకే యంగెస్ట్ ఎంపీ, పైగా కేంద్ర మంత్రి… బ్రదర్ జేమ్స్ సంగ్మా కూడా పొలిటిషియనే… మొన్నటిదాకా మేఘాలయ మంత్రివర్గంలో కీలకసభ్యుడు… తండ్రి మరణం తరువాత కొన్రాడ్ కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి దిగాల్సి వచ్చింది… తన స్వస్థలం తుర నుంచి ఒక టరమ్ ఎంపీ… 45 ఏళ్ల వయస్సు వచ్చేనాటికే ఓసారి ఎంపీ, ఓసారి రాష్ట్రమంత్రి, ఎమ్మెల్యేగా ఓసారి ఓటమి, తరువాత గెలుపు, సీఎం, ఇప్పుడు రెండోసారి సీఎం…
ఇవన్నీ చదువుతుంటే తన భార్య మెహతాబ్ చండీ పేరు అక్కడక్కడా కనిపిస్తుంది మనకు… ఎప్పుడూ రాజకీయ తెర మీద మాత్రం కనిపించదు… రాజకీయాల్లోకి రాదు… రావాలనే అభిలాష కూడా లేదు… కుటుంబంలో అందరూ రాజకీయాల్లో మునిగితేలుతున్నా ఆమె మాత్రం జస్ట్, గృహిణి… అంతేనా..? ప్రతి దశలోనూ సంగ్మాకు చేదోడువాదోడు ఆమే… ఆమె చిరునవ్వే తనను నడిపిస్తూ ఉంటుంది… ఆమె ఆలోచనల్ని, మాటల్ని వింటాడు, తనూ ఆలోచిస్తాడు… ఆచరణలో పెడతాడు…
Ads
ఆమె చదువూసంధ్యా లేనిదేమీ కాదు… ప్రొఫెషనల్ డాక్టర్ ఆమె… కొన్రాడ్ రాజకీయాల్లోకి దిగాక తను ట్రస్టు బాధ్యతలన్నీ తనే పైన వేసుకుంది… కొన్రాడ్ ఏర్పాటు చేసుకున్న బిజినెస్ కంపెనీని కూడా ఆమే చూసుకునేది… దాంతో సంగ్మా ఫుల్ టైమ్ రాజకీయాలకే వెచ్చించాడు… తీరిక దొరికితే తనకు ఇష్టమైన ఎలక్ట్రిక్ గిటార్ వాయిస్తూ సేద తీరతాడు… సంగీతం అంటే క్రేజ్ తనకు…
చిన్న రాష్ట్రమే… కానీ రాజకీయాలు ఎక్కువ… ఉన్నవి అరవై సీట్లే… అసెంబ్లీలో ఎప్పుడూ అనిశ్చితి, చంచలత్వం… కొందరు ఇటువైపు అటు దూకితే చాలు, ప్రభుత్వమే కూలిపోతుంది… ఈ స్థితిలో కొన్నాళ్లు యూపీయేతో దోస్తీ… తరువాత ఎన్డీయేతో దోస్తీ… మొన్న ఎన్నికల ముందు బీజేపీతో పొరపొచ్చాలు వచ్చినా సరే… విడిగానే పోటీచేద్దాం, రిజల్ట్స్ వచ్చాక ఆలోచిద్దాం అన్నాడు…
అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నాడు… మెజారిటీకి కాస్త దూరం ఉన్నాడు, బీజేపీ సాయం తీసుకున్నాడు… మళ్లీ ఎన్డీయే జెండా రాష్ట్ర అధికార పీఠంపై ఎగిరింది… ఇదంతా జరుగుతున్నా సరే మెహతాబ్ చండీ అన్నీ చూస్తూనే ఉంది కానీ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు… NPP పార్టీ అడుగులపై ఆమె ఆలోచనలు, సలహాల ప్రభావం ఉంటుంది… కానీ ఆమె మాత్రం తెరమీదకు రాదు… రాదు…!!
Share this Article