.
ద్యూయ్ షేన్ : అతడే మన లెనిన్ #Lenin #సామాన్యశాస్త్రం
గడిచిన జీవితంలో అల్తినాయ్ సులైమానోవ్న మాదిరి మీకు కూడా ఇలాంటి ఒక స్ఫూర్తి దాత ఉండే ఉంటారు. అవి పోప్లార్ చెట్లు కావచ్చు, చింత చెట్ల నీడ కావచ్చు, అక్కడ ఒక బడిలో మిమ్మల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు కూడా ఉండే ఉంటారు. ఇప్పటికి కూడా జీవించి ఉండవచ్చు. గుర్తు చేసుకుందాం.
Ads
( కందుకూరి రమేష్ బాబు )
ఎప్పుడు యాదికి వచ్చినా ఇప్పటికీ నేను విస్మయానికి గురవుతూనే ఉంటాను. చింగిజ్ ఐత్ మోతొవ్ రాసిన తొలి ఉపాధ్యాయుడు గురించి, అందులో ప్రధాన పాత్ర ఐన ద్యూయ్ షేన్ గురించి.
అసలు ద్యూయ్ షేన్ ఎవరో చెప్పడం ఓం ప్రథమం అనుకుంటే, నిజానికి దాన్నొక అపురూప చిత్రంగా వేసి చూపాలి. కానీ అయన ఎవరో లీలగా కూడా మనం గుర్తు చేసుకోవడానికి కాస్తంత ఉపోద్గాతం అవసరం.
ఆయన ‘తొలి ఉపాధ్యాయుడు’ నవలలోని ప్రధాన కథానాయకుడు. ఇది తెలుగు అనువాద పుస్తకం. 1962లో రాసిన ఈ ఆంగ్ల మూలం పేరు ‘First teacher’. ఆ పుస్తకం పేరు గుర్తు చేసుకున్నా కండ్లు సజలాలు అవుతాయి.
సోవియట్ సమాజ నిర్మాణం కోసం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ విలువలను కాదని, తొలినాళ్ళలో విప్లవాత్మకమైన ఎన్నో పనులకు పూనుకున్న ఒక తొలి తరం ఉపాధ్యాయుడి కథ ఇది. బయట ప్రపంచపు విజ్ఞానాన్ని, విద్యను ఒక కుగ్రామానికి తెచ్చి, ఒక్క ఉపాధ్యాయుడిగానే కాక బహుముఖ పాత్రలెన్నో పోషించి తమ గ్రామాన్ని మార్చిన తొట్ట తొలి గురువు గురించిన పుస్తకం ఇది.
అది ఈ పుస్తకం వస్తువు అనుకుంటే, ఆ గురువు కారణంగానే చదువుకుని, పట్నం వెళ్లి, ప్రఖ్యాతి వహించిన మహిళామణిగా ఎదిగిన ఆమె ఈ పుస్తకానికి శిల్పం అనాలి. ఈ వస్తుశిల్పాలను రచయిత ఒక యువకుడి ఒక అపురూపంగా చిత్రించడానికి పూనుకోవడం ఆధారంగా కథ చెబుతాడు.
అన్నట్టు ఆ విద్యార్ధి నేడు యూనివర్సిటీలో తత్వశాస్త్ర ప్రొఫెసర్. ఆ విభాగానికి అధిపతి కూడా. ఆమె పేరు అల్తినాయ్ సులైమానోవ్న. తమ గ్రామ పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానం అందుకుని ఆమె స్వగ్రామానికి వెలుతుంది. సభ పూర్తయ్యే లోపల తన గురువుగారు ఇంకా ఉన్నారని, ఉత్తరాలు బడ్వాటా చేసే పనిలో ఇంతకుముందే బడికి వచ్చారని తెలుసుకుంటుంది.
ఒక్క పరి ఆతడు యాదిలోకి రావడంతో ఆమె ఉద్రేక పడుతుంది. ఆమెను విచారం అలుముకుంటుంది. తానూ తన గురువు గారు నాటిన పోప్లర్ల వైపు ఆమె దీర్ఘంగా చూస్తుంది. అదేమిటో గానీ స్త్రీకి సహజమైన క్లేశంతో చూస్తుంది. చూస్తుంటే, ఆమె ఆకడమీషన్ సులైమానోవ కాదనిపిస్తుంది.
ఆమె ఒకలాంటి ఆనందాన్ని అనుభవించుతున్నట్టూ, దుఖాన్ని భరించుతున్నట్టూ ఉన్న ఒక సామాన్యురాలుగా కానరావడం ఒక విశేషం. నిజమే. ఆమె ఒక మామూలు ఖిర్జీజ్ స్త్రీగా అనిపిస్తుంది. ఆమె మెల్లగా యాది తెచ్చుకుంటుంది.
ఆ విద్వాంసురాలు తన యవ్వనాన్ని , ఎంతటి ఉన్నత పర్వత శిఖరంపై నిలబడి పిల్చినా తిరిగి రానట్టి యవనాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకుంటున్నదేమో అనిపిస్తుంది. ఆమె పోప్లార్ల కేసి చూస్తూ ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ వెళ్ళిపోతుంది.
“నామీద నాకే కోపం వస్తుంది” అనుకుంటూ వెళ్ళిపోతుంది. రైలెక్కి మాస్కో నగరానికి వెళుతుంది. వెళ్లి ఒక ఉత్తరం రాస్తుంది. మరచిపోయిన స్పూర్తిదాతను అపురూపంగా గుర్తు చేసుకుంటూ, తన మనసును తిరిగి అక్షరాల్లో పెట్టి తన గ్రామానికి చెందిన ఆ అబ్బాయికి ఉత్తరం రాస్తుంది.
ఆ ఉత్తరమే ఈ నవలలోని ముఖ్య భాగం. అది అందరికీ చదివి వినిపించాలి అంటుంది. తనను అయన క్షమించవలసిందని మనవి చేసుకుంటుంది కూడా.
ఆ ఉత్తరం మొత్తం ఒక విశాలమైన గాథ. ద్యూయ్ షేన్ ఎలా తన గ్రామంలో ఒక గుర్రపు శాలను బడిగా మార్చినదీ, తాము బడికి వెళ్లేందుకు ఎట్లా కుటుంబాలను ఒప్పించిందీ, ఆ క్రమంలో అయన పడ్డ కష్టాలను కళ్ళకు కడుతుంది. చావును సైతం ధిక్కరించి ఎలా ఈ బాలికను ఇంతంటి విద్వాంసురాలిగా మార్చినాడో, తనవంటి ఎందరినో ఉన్నతులుగా ఎలా మలిచినాడో వివరిస్తుంది.
ఇంతకూ ఆ ఉత్తరంలో చివరగా ఆమె ఏం రాసిందో చెప్పాలి. అదే ఈనాటి వ్యాసానికి కీలకం. అదే ఈ వ్యాసానికి మూలం.
చాలా సుదీర్గమైన ఆ ఉత్తరంలో చివరి పేరాల్లో ఉటంకించిన పాదాలు ఇవి. “…ఇది ఇక్కడ ఒక్కచోటనే జరిగిన సంగతి కాదు. ఇతర చోట్ల కూడా ఇలాంటివి జరగడం చూశాను. అందుకనే నేను అడుగుతున్నాను: లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?”
ఇది కీలకమైన ప్రశ్న. ఒక రకంగా పుస్తకం మొత్తం ఆ ప్రశ్నకు సమాధానం. మనం లెనిన్ ని, మార్క్స్ ని లేదా గొప్ప గొప్ప నేతలను మాత్రమే గౌరవిస్తున్నాం. ఆ దీపం కింది నీడలను చూడ నిరాకరిస్తున్నాం.
లెనిన్ వంటి మహానేతల ఆదర్శాలను కొనియాడుతున్నాం. కానీ వాటిని సఫలం చేసిన సామాన్య వ్యక్తులను గౌరవించడం లేదు. లేదా సామాన్య వక్తుల ఆశయాలను సఫలం చేసిన వారినే గౌరవిస్తున్నాం గానీ సాధారణ వ్యక్తుల కృషిని అగౌరపరుస్తున్నాం.
తొలి ఉపాధ్యాయులుగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మొట్టమొదటి స్ఫూర్తిదాతలను మరిచిపోతున్నాం “లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?”
- ఇది ఆ పుస్తక సారాంశం. బలమైన ప్రశ్న కూడా. “ఎప్పుడు పోగొట్టుకున్నాం?” అని అనడంతో అది ప్రశ్నగా కన్నా ఆత్మ విమర్శగా కూడా మనల్ని బలంగా తాకుతుంది.
ఈ రోజు లెనిన్ పుట్టినరోజు. తమ మానాన తాము పని చేసిన ఇలాంటి ద్యూయ్ షేన్ లను గుర్తు చేసుకోవడమే లెనిన్ కు అసలైన నివాళి.
మరొక్క మాట. గడిచిన జీవితంలో అల్తినాయ్ సులైమానోవ్న మాదిరి మీకు ఇలాంటి ఒక స్ఫూర్తి దాత ఉంటారు. అవి పోప్లార్ చెట్లు కావచ్చు, చింత చెట్ల నీడ కావచ్చు, అక్కడ ఒక బడిలో మిమ్మల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఉంటారు. ఇప్పటికి కూడా జీవించి ఉండవచ్చు. గుర్తు చేసుకుందామా? మిత్రులారా…అతడే మన లెనిన్….
Share this Article