‘‘ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైనా ఓ ఉన్నతాధికారి హఠాత్తుగా బదిలీ అయ్యారంటే సదరు అధికారి అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డుపడినవారు ఐఉండాలి… అంతకుమించి వేరే కారణం ఏమీ ఉండదు’’…. ఇదీ ఓ మిత్రుడి విశ్లేషణ… స్వీపింగ్ కామెంట్‌లాగా అనిపించినా సరే, పాలన తీరు అలాగే ఉంది…
ప్రత్యేకించి రెవిన్యూ, పోలీస్ తదితర శాఖల్లో కూడా ఎమ్మెల్యేలు చెప్పినవారికే పోస్టింగులు… వాళ్ల అడుగులకు మడుగులొత్తకపోతే బదిలీలే… కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలే ప్రజాప్రతినిధుల చల్లని కరుణ కోసం పాకులాడాల్సిన దురవస్థలోకి తెలంగాణ వ్యవస్థ నెట్టేయబడింది…
‘‘నక్సలైట్ల ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఊళ్లు వదిలేసి బతుకుజీవుడా అని పారిపోయిన బడా భూస్వాములు ఇప్పుడు మళ్లీ ఊళ్లకు వచ్చి పెద్ద పెద్ద గడీలు (భవనాలు) కట్టుకున్నారు, పూర్వ వైభవం కాదు, అంతకుమించిన వైభవం అనుభవిస్తున్నారు’’ అన్న ఓ మిత్రుడి వ్యాఖ్య పదే పదే కలుక్కుమంటూనే ఉంది…
Ads
యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని అర్థంతరంగా బదిలీ చేశారనీ, 600 కోట్ల విలువైన 400 ఎకరాల్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన అధికార పార్టీ బడా నేతలు ప్రయత్నించే కాందిశీకుల భూమి కబ్జాకు అడ్డుపడినందుకే ఆమెను బదిలీతో సర్కారు గొప్పగా సత్కరించిందనీ, మునుగోడులో ఉపఎన్నికవేళ అధికార పార్టీకి అన్నిరకాలుగా సాయపడిన ఓ అధికారిని ఆర్డీవోగా తెచ్చిపెట్టుకున్నారనీ, ఈ బదిలీల వెనుక మర్మమిదనీ ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీ వార్త చదివాక ఈ ఉపోద్ఘాతమంతా చకచకా టైపయిపోయింది…
ఇలాంటివి బోలెడు… ఇంతకీ ఎవరీ పమేలా సత్పతి..? ఆమె గురించి చదువుతుంటే ఆసక్తికరంగా అనిపించింది… ఒడిశా, కోరాపుట్‌కు చెందిన ఈమె పేద కుటుంబం నుంచి వచ్చింది… 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి… బీటెక్, పీజీ… 51వ ర్యాంకు… తండ్రి డీఆర్డీవో అధికారి… తను ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది… తన కొడుక్కి పెట్టుకున్న పేరు నైతిక్… ఆ పేరు కూడా ఆమె నడతలాగే బాగుంది… పైన ఫోటో ఆమే ఫేస్‌బుక్‌లో పెట్టుకుంది… తన మూలాల్ని చెప్పుకుందిలా…
కొడుక్కి 35 నెలల వయస్సున్నప్పుడు అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేయించింది… భద్రాచలం ఈవోగా, వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా పనిచేసి తరువాత యాదాద్రి కలెక్టర్‌గా చేరింది… ఇప్పుడు అక్రమాలకు తను నమ్మిన ‘నైతిక్’ సూత్రాలతో అడ్డుపడటంతో బదిలీ అయిపోయింది… జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు, అంటే ప్రస్తుతం ఖాళీ… మరి నిజాయితీగా ఉంటే ‘శిక్షింపబడాల్సిందే’ కదా…
1988లో పుట్టిన ఆమెకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అధికారిగా పేరుంది… చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అధికార పార్టీతో గోక్కోవడం దేనికని ఎక్కడికక్కడ రాజీపడిపోతుంటే… కొందరు అక్రమాలకు సై అంటుంటే ఇదుగో ఇలాంటి వాళ్లు ‘ఇమడలేక’ బాధితులవుతున్నారు…!
Share this Article