విజయవాడ గాంధీ నగర్లో శాంతి సినిమా హాల్ పక్కనే ఓ చిన్న క్లినిక్ ఉండేది . రెండే రెండు గదులు . ముందు చిన్న వరండా..వెనుక డాక్టర్ గారి గది . డాక్టర్ పేరు కృష్ణ . తీసుకునే ఫీజు 30 రూపాయలు
నో టెస్టులు . మందులు కూడా రెండో మూడో రకాలు రాసేవారు . అవి కూడా ఆయన దగ్గరే దొరికేవి . మొత్తం ఓ రెండొందల్లో అయిపోయేది . దీనికన్నా ముందు రోగి చేయి పట్టుకున్న స్పర్శతో పావు రోగం పోయేది ( అంచేతనే చాలామంది ఫలానా డాక్టర్ హస్తవాసి మంచిది అనేవారు అప్పట్లో )
రోగితో రోగం గురించి చెప్పి పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు, ఈ మందులు వాడి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే రోగం పరార్ అని నవ్వుతూ చెప్పటంతో ఇంకో పావు రోగం తగ్గేది . ఇక ఇంటికెళ్ళి డాక్టర్ చెప్పినట్టు చేయగానే రోగం మొత్తం తగ్గిపోయేది . ఇదంతా 1980 ల నాటి ముచ్చట
Ads
రోగులతో కూడా వ్యాపారాలు చేసి కోట్లు గడించవచ్చనే ఫార్ములా ఇంకా కనిపెట్టని అమాయకపు రోజులు . మెల్లిగా రోగాలకు మెడిసిన్ ఫార్ములా కనుక్కునే స్థానంలో రోగుల బలహీనతలతో బిజినెస్ చేసే ఫార్ములాతో కార్పొరేట్ పెద్దలు రంగంలోకి దిగారు . డీ మార్ట్ ల దెబ్బకు కిరాణా కొట్లు ఎలా కొట్టుకుపోయాయో కార్పొరేట్ హాస్పిటల్స్ దెబ్బకు క్లినిక్కులు అలా కొట్టుకుపోయాయి .
రోగాలు అవే , కానీ చికిత్సలు మారిపోయాయి , రోగి కళ్ళు చూసో , నాడి పట్టుకుని పరీక్ష చేసో , స్కెత స్కోపు పట్టుకుని హార్ట్ బీట్ చెక్ చేసో , చేతికి పట్టీ చుట్టి గాలి బెలూన్ నొక్కి బీపీ చెక్ చేసో , రోగ నిర్దారణ చేసే పరిస్థితి నుంచి …
అద్దాల గ్లాసులో కూర్చుని ఎక్సరేలు.. సీటీ స్కాన్ లు.. ఎమ్ఆర్ఐ లు రాసే స్థాయికి చికిత్సలు ఎదిగాయి. ఆ రిపోర్టులు వస్తే కానీ మందులు రాయలేని పరిస్థితులు వచ్చాయ్ . ఎక్కడో తప్ప డాక్టర్.. పేషంట్ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ మాయం అయ్యాయి . గలగలా కబుర్లు చెబుతూ పేషంట్ కి భరోసా కల్పించే డాక్టర్ల నుంచి ఎక్కువ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమోనన్న పొదుపు మాటలు మాట్లాడే డాక్టర్ల కాలం వచ్చేసింది .
డాక్టర్ ని మన డౌట్లు అడగ్గూడదు . అడిగినా సమాధానం చాలా క్లుప్తంగా ఉంటుంది . అంతకు మించి రెండోసారి అడగటానికి కూడా లేదు . అన్నీ పరిమిత టైమ్ స్లాట్ ప్రకారమే ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయ్ . టోకెన్ వెనుక టోకెన్ . పేషంట్ వెనుక పేషంట్ . అంతే . ఆరోజుకి టార్గెట్ రీచ్ అయ్యామా? లేదా ?
మీరు గమనించారో లేదో , కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ ని కలిసి ఆయన రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని బయటికి రాగానే ఓ లేడీ నవ్వుతూ ఎదురొచ్చి ‘ ఓ సారి ఆ ప్రిస్క్రిప్షన్ ఇలా ఇస్తారా ? అని మన చేతిలో నుంచి తీసుకుని పక్కనే గ్లాస్ చాంబర్లోకి వెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చి ”డాక్టర్ గారు రాసిన టెస్తులు చేయించుకోవాలంటే అలా లెఫ్ట్ కి వెళ్ళండి.. అక్కడ ల్యాబ్ ఉంటుంది ‘ అని మన ప్రిస్క్రిప్షన్ తిరిగి మన చేతిలో పెడుతుంది.
ఇంతకీ ఆ లేడీ ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకుని ఏం చేస్తుందో తెలుసా ? ఛాంబర్లో ఉన్న స్కాన్ మిషన్ ద్వారా ఒక కాపీ ఎండీకి.. ఇంకో కాపీ ఫైనాన్స్ జీఎం కి పంపిస్తుంది . అక్కడ అందులో డాక్టర్ కి ఇచ్చిన టార్గెట్ ప్రకారం టెస్టులు రాసారా? లేదా ? అని చెక్ చేస్తారట . ఈ డాక్టర్లందరూ విజిటింగ్ డాక్టర్లే . కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం నిర్ణయించిన టార్గెట్ ప్రకారం టెస్టులు.. మందులు రాయాల్సిందే .
అందుకు గానూ విజిటింగ్ డాక్టర్లకు ఫీజు రాయల్టీతో పాటు కొంత కమిషన్ కూడా ముడుతుంది . కార్పొరేట్ మెడికల్ మాఫీయా మీద వ్యవస్థల కంట్రోల్ చాలా తక్కువ . ఒకవేళ ఉన్నా కోట్లలో చేసే వ్యాపారం కనుక ‘మ్యానేజ్ ‘ చేయబడతాయి . ఏతావాతా నష్టపోయేది రోగులే . లాభపడేది మెడికల్ మాఫీయానే …
చాన్నాళ్ళ క్రితం మా అమ్మగారిని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడి డాక్టర్ ఏవో మందులు.. టెస్టులు రాసి మేము బయటికి వచ్చేటప్పుడు గబుక్కున ఓ విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టి బయటికి వెళ్ళాక చూడమని సైగ చేసాడు . బయటికి వెళ్లి చూస్తే అది ఆ డాక్టర్ పర్సనల్ క్లినిక్ విజిటింగ్ కార్డ్ . వెనుక ప్లీజ్ కమ్ టుమారో అని రాసుంది . మర్నాడు ఆ కార్డ్ పట్టుకుని ఆ డాక్టర్ గారి క్లినిక్ కి వెళ్తే అసలు విషయం ఆ డాక్టర్ గారే చెప్పారు . ‘ ఎందుకో మీ అమ్మగారిని చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది.. అపోలో హాస్పిటల్ కు కాకుండా నా క్లినిక్ కు ఎందుకు రమ్మన్నానంటే అక్కడ నేను అవసరం ఉన్నా లేకపోయినా నాకిచ్చిన టార్గెట్ ప్రకారం కంపల్సరీ గా టెస్టులు రాయాల్సి ఉంటుంది.. నిజానికి అమ్మకి టెస్తులతో పనిలేదు.. మందులు చాలు.. అందుకే క్లినిక్ కి రమ్మన్నాను ‘ అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు …
డాక్టర్ల లో మెడికల్ మాఫీయా చేతిలో పడి అరాచకాలు చేస్తున్నవాళ్ళూ ఉన్నారు. రోగుల ప్రాణాలు కాపాడ్డంలో నిస్వార్ధంగా సేవ చేస్తున్న వైద్యులూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తూ మొదటి కేటగిరీకి చెందిన డాక్టర్లు మన సమాజంలో ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. రెండో కేటగిరీకి చెందిన డాక్టర్లు కొద్దిమందే ఉన్నా వారి సేవలు ఎంతో మంది రోగుల పాలిట వరం. అటువంటి వృత్తి పట్ల నిబద్ధత ఉన్న డాక్టర్లకు వందనాలు, ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా నిస్వార్ధంగా సేవ చేసే వైద్య నారాయణులకు శుభాకాంక్షలు……. by పరేష్ తుర్లపాటి
Share this Article