‘‘వెనుజులా దేశానికి జగన్ లాంటి వాడే అధ్యక్షుడై ప్రజలకు డబ్బు పంచిపెట్టాడు. ఫలితంగా సిరిసంపదలతో తులతూగిన ఆ దేశం ఇప్పుడు అప్పులపాలై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పొట్టకూటి కోసం మహిళలు వ్యభిచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకోవడంలో తప్పు లేదుగా!’’……. రాధాకృష్ణ తాజా ఆణిముత్యాల్లాంటి రాతలు ఇవి… ఒక రాజ్యం దివాలా తీస్తే ఇక ఆ మహిళలు వ్యభిచారం చేయాల్సిందే అనే మానసిక స్థితి, భావదారిద్య్రం పట్ల ఆయనకు నా సానుభూతి..! ఒక్క చంద్రబాబు తప్ప ప్రపంచంలో ఎవరు కుర్చీ మీద కూర్చున్నా సరే, ధిక్కరించి, భయపడకుండా, సవాళ్లు విసిరి మరీ ప్రతికూల వార్తలు రాయించగల ఓ మీడియా బాసుగా ఆయనంటే కొంత సానుకూలత ఉంది… ఐనాసరే, కొన్నిసార్లు ఇదుగో… తప్పదు..!! ఈమధ్య తనకు ఏమైందో అనే ఆందోళన కలుగుతోంది… ఎందుకంటే..? ముందుగా తాను రాసుకొచ్చిన ఈ అభిప్రాయం చదవండి…
‘‘అలవిమాలిన అప్పులు తెచ్చి, పప్పూబెల్లాల్లాగా పంచిపెట్టి, తమ సొంత ప్రతిష్టను పెంచుకుంటూ, పలు శాఖల నిధులను కూడా దీనికే మళ్లించే ముఖ్యమంత్రులది ఆర్థిక నేరం కాదా..? వాళ్లను ఎందుకు అరెస్టు చేయకూడదు..? తెచ్చే అప్పులకు ముఖ్యమంత్రులు వ్యక్తిగత పూచీకత్తు ఎందుకు ఇవ్వకూడదు..? జగన్ ఏమైనా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఇడుపులపాయ ఆస్తులనేమైనా తాకట్టు పెట్టడం లేదు కదా…’’ ఇలా చిత్రవిచిత్రంగా సాగిపోయింది ఆయన రచన ఈరోజు… బాగా నవ్వొచ్చింది, తరువాత ఆర్కే ఫోటో చూసి జాలికలిగింది… ఫాఫం, ఏమిటిలా తయారయ్యాడు అని..! చంద్రబాబు కూడా అప్పులు చేశాడు, ఆయనా డబ్బులు పంచిపెట్టాడు… కానీ జనం నమ్మలేదు, ఫోఫోవయ్యా అన్నారు… ఆయనేమైనా సర్కారీ అప్పులకు తన హెరిటేజ్, తన హైదరాబాద్ చంద్రభవనం తాకట్టు పెట్టాడా..? అవునూ, పామరుడిగా ఓ చిన్న ప్రశ్న…
Ads
రాధాకృష్ణ అనబడే ఓ అత్యంత నిజాయితీపరుడైన ఓ నాయకుడున్నాడు… తనకేమీ ఆస్తుల్లేవు… గాంధీలాగా ఓ గోచీ, చేతిలో కర్ర, నడుముకు గడియారం, కాళ్లకు కిర్రు చెప్పులు… ఉండటానికి ఓ గుడిసె… జీతం కూడా తీసుకోడు… మరి ప్రభుత్వం తీసుకునే లక్షల కోట్లకు ఆయన వ్యక్తిగత పూచీగా ఏం చూపించాలి..? ఆర్థిక సంస్థలు ఏం చూసి అప్పులు ఇవ్వాలి..? తను పూచీకత్తు ఇవ్వలేడు కాబట్టి ఇక ఆ రాష్ట్రానికి ఎవడూ నయాపైసా అప్పు ఇవ్వకూడదా..? ముఖ్యమంత్రి అనేవాడు పాలనకు అల్టిమేట్ బాధ్యుడు కాదు… చెక్, క్రాస్ చెక్ కోసం చాలా వ్యవస్థలున్నయ్… పీఏసీ, కోర్టులు, కాగ్, కేంద్రం, రిజర్వ్ బ్యాంక్… అనేకం..! అప్పులకు సీఎంలను బాధ్యుల్ని చేద్దాం సరే, ఒక ప్రాజెక్టు కడితే దాని వల్ల కలిగే ప్రయోజనాల్లో కూడా ముఖ్యమంత్రులకు డివిడెండ్లు ఇవ్వాలనలేదు… ఇంకా నయం…
‘‘రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముఖ్యమంత్రులతో గానీ, తెలుగు రాష్ట్రాల అధికారులతో గానీ చర్చించకుండా, కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి గెజిట్లు విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమను ఎదిరించలేని స్థితిలో ఉన్నారన్న నిర్ణయానికి వచ్చిన కేంద్రప్రభుత్వం ఈ చర్య తీసుకుని ఉంటుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న నీటి విషయంలో ఏకపక్ష నిర్ణయాలు సమర్థనీయం కాదు…’’ అని కూడా ఏదేదో రాశాడు… తనకు ఇరిగేషన్ సబ్జెక్టు ఏమీ తెలియదని తన రాతల ద్వారా అర్థమైంది… కేంద్రం ముందుగా డ్రాఫ్ట్ పంపించి మరీ అభిప్రాయాలు అడిగింది, గడువు ఇచ్చింది… తరువాతే బోర్డులకు సర్వాధికారాలు ఇచ్చింది… దానికి అర్ధరాత్రి గెజిట్లు అని పదప్రయోగం… కంటెంట్ ముఖ్యమా, అవి వెలువడిన టైం ముఖ్యమా..? అన్నీ బాగుంటే, రాష్ట్రాలు చర్చల ద్వారా పరస్పర సహకార ధోరణితో ఉంటే… బోర్డులకు ఇన్ని అధికారాలు ఇచ్చేదాకా వచ్చేదా..? ఏడేళ్లుగా కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోలేదు కదా… తమ్ముళ్ల తన్నులాట ముదిరితేనే కదా, పెద్దన్న రంగంలోకి వచ్చేది… కొంపదీసి RK ఎవరైనా ఘోస్ట్ రైటర్‌తో రాయించాడా ఈసారి ఈ రాతలన్నీ… అందుకేనా పసలేదు, పంచ్ లేదు, అసలు జీవమే లేదు…!! (ఈ విశ్లేషణ మీకు నచ్చితే దిగువన కోడ్ స్కాన్ చేసి ముచ్చటకు అండగా నిలవండి)
Share this Article